
ఈ ఫొటోను ఫేస్బుక్లో ఓ మిత్రుడు పోస్టు చేశారు. వాస్తవంగా ఇది పత్రికల్లో ప్రచురించదగ్గ ఫొటో. ఎందుకో ప్రచురించలేదు. ఈ ఫొటో పెద్ద వార్తనే చెబుతోంది. సాక్షి వంటి పత్రిక కూడా ఇలాంటి ఫొటోను, కథనాన్ని ప్రచురించడంలో విఫలమయింది. ఇంతకీ విషయం ఏమంటే…
తిరుపతిలో ఏప్రిల్ 30వ తేదీన నిర్వహించి ధర్మపోరాట సభను తెలుగుదేశం పార్టీ అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. లక్ష మందికిపైగా జనాన్ని తరలించాలని లక్ష్యంగా నిర్దేశించుకుంది. అన్నింటికన్నా మించి…ఈ సభ ద్వారా తమ కార్యకర్తల్లో ఉత్తేజం నింపాలని భావించింది. జనాన్ని తరలించారుగానీ….బలమైన ఉద్వేగం, ఉత్తేజాన్ని కార్యకర్తల్లో నింపలేకపోయారు. కేంద్రాన్ని ఢీకొట్టేలా కార్యర్తలను సన్నద్ధం చేయాలనుకున్నా….ఈ సభలో అంత ఆకట్టుకునే ఉపన్యాసాలను ఎవరూ చేయలేకపోయారు. చంద్రబాబు కూడా చాలా గందరగోళంగా మాట్లాడినట్లు అనిపించింది. విజయవాడలో నిర్వహించిన ధర్మపోరాట దీక్షలో బిజెపిఐ ఘాటైన విమర్శలు చేయడంతో వివాదాలు వచ్చాయి. అలాంటి వివాదాలకు దూరంగా ఉండాలనుకున్నారో ఏమోగానీ…అందరూ చప్పగా మాట్లాడారు. తెలుగుదేశం ప్రభుత్వంపై కేంద్రం కక్షగట్టి….రద్దు చేయడం వంటివి చేసినా; చంద్రబాబు వంటి కీలక నాయకులపై కేసులు నమోదు చేసినా వాటిని దీటుగా ఎదుర్కొనేలా కార్యకర్తలకు పౌరుషాన్ని నూరుపోయాలనుకున్నప్పటికీ…ఓ ఒక్కరి ఉపన్యాసమూ కార్యక్తలను ఉర్రూతలూగించేలా సాగలేదు. ఒకవైపు చంద్రబాబు నాయుడు మాట్లాడుతుండగా….సభకు వచ్చిన జనం వెనుకవైపు నుంచి వెళ్లిపోయారు. దీంతో గ్రౌండ్ ఇలా ఖాళీగా కనిపించింది. దీన్నే ఓ విలేకరి ఫోటో తీసి సోషల్ మీడియాలో సోస్టు చేశారు.
ఈ సభలో గమనించాల్సిన అంశాలు చాలానే ఉన్నాయి. చంద్రబాబు నాయుడు ఎన్నిసార్లు గట్టిగా చప్పట్లు కొట్టమని కోరినా…సభికులు పెద్దగా స్పందించలేదు. ఒకప్పుడు ఎన్టిఆర్ వంటి వాళ్లు మాట్లాడుతుంటే ప్రతి మాటకూ చప్పట్లు మార్మోగేవి. సభ దద్దరిల్లేలా నినాదాలు వినిపించేవి. ధర్మపోరాట సభలో అలాంటి వాతావరణం ఏ దశలోనూ కనిపించలేదు. దీనికి కారణం ఏమిటో తెలుగుదేశం పార్టీనే విశ్లేషించుకోవాలి.
Leave a Reply