
తిరుమల శ్రీవారి ఆలయ గోపురం తరహాలో వరాహస్వామి ఆలయ విమాన గోపురం కూడా స్వర్ణమయం కానుంది. ఇందుకోసం రూ.14 కోట్లు ఖర్చు చేయడానికి టిటిడి సిద్ధమయింది.
వరాహస్వామి విమాన గోపురంపై తొమ్మిది పొరలుగా బంగారుపూత పూసిన రాగి రాకులను అమర్చడానికి అక్టోబర్లో జరిగిన బోర్డు సమావేశంలో ప్రతిపాదనలు సిద్ధమయ్యాయి. దీనిపైన చర్చించిన పాలక మండలి ఈ అంశాన్ని ముందుగా ఫైనాన్స్ కమిటీకి పంపింది. ఈ కమిటీ సిఫార్సు వచ్చిన తరువాత నిర్ణయం తీసుకోనుంది.
ఈ బృహత్ కార్యక్రమం కోసం 42.43 కిలోల బంగారు అవసరం అవుతుంది. 18 కిలోల రాగి రేకులు కావాల్సివుంటుంది. ఇందులో బంగారం విలువ రూ.13.15 కోట్లు కాగా, రాగి విలువ రూ.11.16 లక్షలు. రాగి రేకులతో డిజైన్ తయారు చేయడం, బంగారు పూత వేయడం, అమర్చడం తదితర పనులకు కూలీ కింద రూ.21.04 లక్షలు వ్యయం అవుతుందని అంచనా వేశారు. ఇదికాకుండా విమాన గోపురం 3డి చిత్రాల నిర్మాణం కోసం రూ.19.39 లక్షలు అంచనా వేశారు.
టిటిడి దేవాలయాలకు అవసరమైన బంగారాన్ని ఖజానా నుంచి తీసుకునే వెసులుబాటు ఉంది. ఈ పనులకు కూడా దేవస్థానం వద్దనున్న బంగారాన్నే వినియోగించనున్నారు.
…. ధర్మచక్రం ప్రతినిధి, తిరుపతి
Leave a Reply