పులివెందుల నియోజకవర్గంలో మూడు కల్యాణ మండపాల నిర్మాణం..!

ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి సొంత నియోజకవర్గం పులివెందులలో మూడు మండలాల్లో మూడు కల్యాణ మండపాలు నిర్మించాలని టిటిడి నిర్ణయించింది. ఈ మేరకు సెప్టెంబర్‌లో జరిగిన బోర్డు సమావేశంలో ఓ తీర్మానాన్ని ఆమోదించారు.

మండల కేంద్రాలైన వేముల, లింగాలతో పాటు, సింహాద్రిపురం మండలంలోని బలపనూరులో కల్యాణ మండపాలు నిర్మించనున్నారు. ఒక్కో కల్యాణ మండపానికి రూ.1.50 కోట్లు ఖర్చు చేయనున్నారు. ఇటీవల జరిగిన పులివెందుల ఏరియా డెవలప్‌మెంట్‌ ఏజెన్సీ (పడ) సమావేశంలో తీసుకున్న నిర్ణయం మేరకు టిటిడి చర్యలు తీసుకుంది. మ్యారేజ్‌ హాలు 500 మందికి, భోజనశాల 120 మందికి సరిపోయేలా మండపాలు నిర్మిస్తారు.

టిటిడి నిబంధనల ప్రకారం, మండపాల నిర్మాణానికి అయ్యే వ్యయంలో…. ఎస్‌సిలు నివసించే ప్రాంతంలోనైతే 10 శాతం, బిసి నివాస ప్రాంతాల్లోనైతే 30 శాతం, జనరల్‌ ప్రాంతాల్లోనైతే 40 శాతం భరించాల్సివుంటుంది. ఇప్పుడు కల్యాణ మండపాలు నిర్మిచనున్న ప్రాంతాలను బిసిలు నివాసమున్న ప్రాంతాలుగా గుర్తించి 30 శాతం ప్రజల కాంట్రిబ్యూషన్‌గా నిర్ణయించారు. ఎక్కడైనా కల్యాణ మండపం నిర్మించాలంటే…అందుకు అవసరమైన స్థలాన్ని దాతలు టిటిడికి ఉచితంగా ఇవ్వాల్సివుంటుంది.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*