తిరుపతి పార్లమెంటు ఉప ఎన్నికల్లో పోటీ చేయాలని ఉవ్విళ్లూరుతున్న జనసేన పార్టీ కార్యకర్తల్లో ఒక్కసారిగా నిరుత్సాహం చోటు చేసుకుంది. ఆ పార్టీ అధినేత పవన్ కల్యాణ్ తిరుపతి పర్యటన అనంతరం జనసేన శ్రేణులు నీరుగారిపోయారు.
తిరుపతి ఎన్నికలకు సంబంధించి పవన్ కల్యాణ్ పార్టీ నేతలతో గురువారం నాడు సమావేశమయ్యారు. ఈ సమావేశంలో మాట్లాడిన నాయకులందరూ…తిరుపతి ఎన్నికల్లో జనసేన పోటీ చేయాలని, పొత్తు పేరుతో బిజెపికి విడిచిపెట్టకూడదని ముక్తకంఠంతో చెప్పారు.
తిరుపతి ఎన్నికల్లో తమ పార్టీ అభ్యర్థే పోటీలో ఉంటారని బిజెపి ప్రచారం చేసుకుంటున్న తరుణంలో జనసేన నేతలు తమ మనసులోని మాటను చెప్పారు. ఈ నియోజకవర్గంలో బిజెపి కంటే జనసేనకే బలం వుందని, అందుకే తిరుపతి పోటీచేసే అవకాశాన్ని ఎట్టిపరిస్థితుల్లోనూ వదులుకోకూడదని కోరారు.
దీనిపైన స్పందించిన పవన్ కల్యాణ్… తిరుపతిలో ‘బిజెపికి ఉన్నంత బలం మనకు లేదు’ అని వ్యాఖ్యానించినట్లు సమాచారం. పార్టీ అధినేతే ఆ విధంగా మాట్లాడిన నేపథ్యంలో ఇక జనసేన పోటీచేసే అవకాశం లేనట్లేనన్న నిర్దారణకు వచ్చిన ఆ పార్టీ శ్రేణులు తీవ్ర నిరాశలో ఉన్నారు.
మీడియా సమావేశంలో విలేకరులు అడిగిన ఒక ప్రశ్నకు సమాధానం ఇస్తూ, తిరుపతిలో ఎవరు పోటీ చేసేదీ వారంలో చెబుతామని పవన్ కల్యాణ్ చెప్పారు. ఎవరు పోటీ చేసినా హైదరాబాదు జిహెచ్ఎంసి ఎన్నికలు లాగా ప్రతిష్టాత్మకంగా అందరూ పని చేయాల్సివుంటుందని అభిప్రాయపడ్డారు.
ఇదిలావుండగా…పొత్తు ఉన్నప్పటికీ బిజెపి నేతలు తమను పట్టించుకోవడం లేదని, ఆ పార్టీ నేతలు తమను చిన్నచూపు చూస్తున్నారన్న ఆవేదనను జనసేన నేతలు పవన్ దృష్టికి తీసుకెళ్లారు.
ఇదే అంశాన్ని పవన్ కల్యాణ్ మీడియా సమావేశంలో ప్రస్తావించారు. బిజెపి అగ్రనేతలతో తనకు మంచి సంబంధాలు ఉన్నాయని, అయితే అటువంటి సమన్వయం కింది స్థాయిలో ఏర్పడలేదన్నారు. దీన్ని సరిచేస్తామని చెప్పుకొచ్చారు.
తిరుపతిలో పోటీ చేయాలన్న బలమైన ఆకాంక్ష జనసేన కార్యకర్తల్లో ఉంది. వాస్తవంగా కూడా తిరుపతి పార్లమెంటు స్థానం పరిధిలో బిజెపి కంటే జనసేన బలం అనేక రెట్లు ఎక్కువగా ఉంటుంది. తిరుపతి, శ్రీకాళహస్తి, వెంకటగిరి అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలో పవన్ సొంత సామాజిక తరగతి బలంగా ఉంది.
అయినప్పటికీ మనకంటే బిజెపి బలమే ఎక్కువని పవన్ కల్యాణ్ ఎందుకు వ్యాఖ్యానించారో అర్థంకాక జనసేన శ్రేణులు సతమతమవుతున్నారు.
ఈ పరిస్థితుల్లో పవన్ కల్యాణ్… బిజెపిని ఒప్పించి తమ అభ్యర్థిని బరిలోకి దింపుతారా లేకా బిజెపికే వదిలేస్తారా అనేది వేచి చూడాలి.
- ఆదిమూలం శేఖర్, ధర్మచక్రం ప్రతినిధి