ఆంధ్రప్రదేశ్‌లో అనేక వివాదాలు, మలుపులు, వాదోపవాదాల మధ్య పంచాయతీ ఎన్నికలు జరుగుతున్నాయి. స్థానిక సంస్థల ఎన్నికల విషయంలో దేశ చరిత్రలో, గతంలో, ఏ రాష్ట్రంలోనూ ఇప్పటిదాకా జరగని పరిణామాలు ఆంధ్రప్రదేశ్‌లో జరుగుతున్నాయి. అందుకే ఈ ఎన్నికలు రెండు తెలుగు రాష్ట్రాల్లో మాత్రమే కాదు దేశ వ్యాపితంగానూ చర్చనీయాంశంగా మారాయి.
సుప్రీం కోర్టు దాకా వెళ్లి, ఎన్నికల నిర్వహణకు అదేశాలు తెచ్చుకోవడం ద్వారా, ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ విజయం సాధించారని, ప్రభుత్వం ఆయన ముందు ఓడిపోయిందని కొందరు చెబుతున్నారు. నిమ్మగడ్డ న్యాయస్థానాల్లో విజయం సాధించి వుండొచ్చుగానీ…ప్రజాకోర్టులో ఆయన సమాధానం చెప్పుకోవాల్సిన అంశాలు అనేకం ఉన్నాయి. ఆయన నిజాయితీని, నిబద్ధతను ప్రశ్నార్థకం చేస్తున్న విషయాలు అనేకం ఉన్నాయి.
ప్రశ్న 1 : రాష్ట్రంలో 2018 ఆగస్టుతోనే స్థానిక సంస్థల ఎన్నికల గడువు ముగిసింది. వెంటనే ఎన్నికలు నిర్వహించాల్సిన బాధ్యత కమిషనర్‌గా ఆయనపైన ఉంది. అయితే ఆయన పట్టించుకోలేదు. దీనికి కారణం లేకపోలేదు. 2019లో జరిగే శాసనసభ, లోక్‌సభ ఎన్నికలకు ముందుగా స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహిస్తే, ఆ ఎన్నికల్లో అప్పటి అధికార పార్టీ ఓటమి పాలైతే ఆ ప్రభావం జనరల్ ఎన్నికలపైన పడుతుందన్న భయంతో చంద్రబాబు నాయుడు స్థానిక సంస్థల ఎన్నికల జోలికి వెళ్లలేదు. ప్రత్యేక అధికారుల పాలన సాగించారు. దాదాపు ఏడాదికిపైగా చంద్రబాబు స్థానిక ఎన్నికలను వాయిదా వేసినా… నిమ్మగడ్డ రమేష్ కుమార్ ఏనాడూ ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చిన ఉదంతాలు లేవు. ఇప్పటిలాగా కోర్టులను ఆశ్రయించి ఎన్నికలు నిర్వహించే ప్రయత్నం ఎందుకు చేయలేదనేది ప్రశ్న?
ప్రశ్న 2 : వైసిపి అధికారంలోకి వచ్చాక, ప్రభుత్వంలో కాస్త కుదుటపడిన తరువాత 2020 మార్చిలో స్థానిక ఎన్నికలకు సిద్ధమైంది. రమేష్ కుమార్ ముందుగా ఎంపిటిసి, జెడ్పీటీసి; పురపాలక సంఘాల ఎన్నిలకు నోటిఫికేషన్ ఇచ్చారు. ఈ రెండు ఎన్నికలకు సంబంధించి నామినేషన్ల ప్రక్రియ దాదాపు పూర్తయింది. ఎంపిటిసి ఎన్నికలకు ఇంకో వారం రోజుల్లో పోలింగ్ జరగాల్సివుండగా…నిమ్మగడ్డ రమేష్ కుమార్ ఒకరోజు మీడియా సమావేశం ఏర్పాటు చేసి, ఎన్నికలు వాయిదా వేస్తున్నట్లు ప్రకటించారు. ప్రభుత్వంతో ఒక మాట కూడా చెప్పలేదు. కరోనా కేసుల వల్లే ఎన్నికలు వాయిదా వేస్తున్నట్లు చెప్పారు. అప్పటికి రాష్ట్రంలో ఒకటి రెండు కేసులు మాత్రమే ఉన్నాయి.
ఇలా ఎన్నికలు వాయిదా వేయడానికి కరోనా అసలు కారణం కాదన్నది వైసిపి అభిప్రాయం. ఆ ఎన్నికలు అధికార వైసిపికి ఏకపక్షంగా మారాయి. సహజంగానే అందకు ఏడాది ముందు జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో 151 స్థానాలను, 50 శాతానికిపైగా ఓట్లను సాధించిన వైసిపికి స్థానిక ఎన్నికలూ అనుకూలంగా మారాయి. గతంలో ఎన్నడూ లేనన్ని స్థానాలను తమ పార్టీ ఏకగ్రీవంగా కైవసం చేసుకోవడంతో జీర్ణించుకోలేని టిడిపి…తెరవెనుక చక్రం తిప్పి నిమ్మగడ్డతో ఎన్నికలను వాయిదా వేయించిందని వైసిపి నేతలు ఆరోపించారు. నిజంగానే కరోనా వల్ల ఎన్నికలు వాయిదా వేసివుంటే….ఎన్నికల కమిషనర్ ప్రభుత్వ పెద్దలతో, కనీసం వైద్య ఆరోగ్యశాఖ అధికారులతో ఎందుకు సంప్రదించలేదన్నది ప్రశ్న?
ప్రశ్న 3 : ఎన్నికలను ఏకపక్షంగా వాయిదా వేసిన నిమ్మగడ్డ రమేష్ కుమార్ హైదరాబాదు పార్క్ హయత్ హోటల్లో టిడిపి, బిజెపి నేతలను కలిసినట్లు వీడియోలు బయటకు వచ్చాయి. ఏ పార్టీకీ సంబంధం లేకుండా ఉండాల్సిన ఎన్నికల కమిషనర్ ప్రతిపక్ష పార్టీల నేతలను ఎందుకు కలిశారు? ఏమి చర్చించారు? దీనికి అప్పటికీ నిమ్మగడ్డ రమేష్ కుమార్ సమాధానం చెప్పలేదు.
అంతేకాదు….ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి మీద కేంద్ర హోం శాఖకు ఒక లేఖ రాశారు. అందులో సిఎంని ఫ్యాక్షనిస్టు అని నిందించారు. ఇంకా ఏవేవే రాశారు. రాజ్యాంగ పదవిలో ఉన్న ఒక అధికారి, ఒక ముఖ్యమంత్రిపై ఇటువంటి లేఖ రాయడం దేశంలో ఇప్పటి దాకా ఎక్కడా జరగలేదు. పైగా, తాను ఎటువంటి లేఖా రాయలేదని మొదట్లో చెప్పారు. దానిపైన ప్రభుత్వం విచారణ జరిపించే సరికి తానే ఆ లేఖ రాశానని అన్నారు. ఇటువంటి చర్యలతో నిమ్మగడ్డ తాను నిష్పక్షపాతంగా ఉన్నానని చెప్పగలరా?
నిమ్మగడ్డ చర్యలతో షాక్‌తిన్న ప్రభుత్వం…ఆయన్ను పదవి నుంచి తప్పించడానికి ఆర్డినెన్స్ తీసుకొచ్చింది. కొత్త కమిషనర్‌ను నియమించింది. దానిపైన రమేష్ కుమార్ కోర్టును ఆశ్రయించి, తిరిగి ఆ సీట్లో కూర్చో గలిగారు. ప్రభుత్వం చేసిన తప్పిదానికి మొట్టిక్కాయలు పడ్డాయి. మరి నిమ్మగడ్డ రమేష్ కుమార్ ఆ తరువాతనైనా నిబద్ధతతో వ్యవహరించారా? )
ప్రశ్న 4 : కరోనా టీకాలు వేయడానికి దేశమంతా సిద్ధమయింది. అన్ని రాష్ట్రాలూ ఇదే పనిలో తలమునకలుగా ఉన్నాయి. ఈ పరిస్థితుల్లో ప్రభుత్వంతో కనీసం సంప్రదించకుండా ఎన్నికలకు సిద్ధమయ్యారు నిమ్మగడ్డ. దీనిపైన ప్రభుత్వం కోర్టులకు వెళ్లింది. ప్రభుత్వంతో సంప్రదించి ఎన్నికలు నిర్వహించాలని హైకోర్టు, సుప్రీం కోర్టు చెప్పాయి. కోర్టులు చెప్పిన తరువాత కూడా సంప్రదింపులను మొక్కుబడిగా మార్చేశారు నిమ్మగడ్డ.
ప్రస్తుతం కరోనా టీకాలు వేస్తున్నందు వల్ల ఒకటి రెండు నెలలు ఆగాలని ప్రభుత్వం అభ్యర్థించినప్పటికీ నిమ్మగడ్డ రమేష్ కుమార్ పట్టించుకోలేదు. పంచాయతీ ఎన్నికలకు నోటిఫికేషన్ ఇచ్చారు. ఒకప్పుడు ఒకటి రెండు కరోనా కేసులు ఉన్నప్పుడే ఎన్నికలు వాయిదా వేసిన ఆయన, ఇప్పటికీ వేలాది కేసులునాయి, పైగా టీకాల కార్యక్రమం సాగుతోంది…అయినా ఎన్నికల నిర్వహణకు ఎందుకు తొందర పడుతున్నారన్నది ప్రశ్న. సుప్రీం కోర్టు దాకా వెళ్లి మరీ పంచాయతీ ఎన్నికలు నిర్వహిస్తున్నారు.
ప్రశ్న 5 : దేశమంతా ఎన్నికలు జరుగుతున్నాయి కాబట్టి…ఇక్కడా ఎన్నికలు పెడుతున్నానని నిమ్మగడ్డ చెబుతున్నారు. ఈ వాదనే నిజమనుకుంటే….మధ్యంతరంగా ఆగిపోయిన ఎంపిటిసి, జెడ్పీటీసి, మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలను ముందుగా పూర్తి చేయాలి. ఆ తరువాత మిగతా ఎన్నికల సంగతి చూడాలి. కానీ, ఆయన ఆగిపోయిన ఎన్నికలను వదిలేసి, పంచాయతీ ఎన్నికలకు నోటిఫికేషన్ ఇచ్చారు. ఇలా ఎందుకు చేశారో ఇప్పటికీ నిమ్మగడ్డ సమాధానం చెప్పలేదు.
ఎంపిటిసి, జెడ్పీటీసి, మున్పిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో జరిగిన ఏకగ్రీవాలను రద్దు చేయాలన్న డిమాండ్ టిడిపి నుంచి ఉంది. అది చెస్తే వేలమంది కోర్టులను ఆశ్రయిస్తారు. ఇప్పట్లో ఎన్నికలు జరగవు. అదీ కాకుండా….పార్టీ గుర్తులతో జరిగే ఆ ఎన్నికల్లో ఏ పార్టీకి ఎన్ని సీట్లు వచ్చాయో తెలిసిపోతుంది. ఇప్పటికే వైసిపికి ఏకపక్షంగా ఉన్న ఆ ఎన్నికలు….ఎన్నికలు పూర్తయితే దాదాపు అన్ని సీట్లూ ఆ పార్టీ ఖాతాలోనే పడుతాయి. ఇది టిడిపి శ్రేణుల్లో ఆత్మస్థైర్యాన్ని దెబ్బతీస్తుంది. అందుకే ఆగిపోయిన ఎన్నికల జోలికి వెళ్లకుండా పంచాయతీ ఎన్నికలు నిర్వహిస్తున్నారని వైసిపి ఆరోపిస్తోంది.
ప్రశ్న 6 : 2019 నాటి ఓటర్ల జాబితాతోనే ఎన్నికలు నిర్వహిస్తున్నారు. ఓటర్ల జాబితా తాజాపరచనందు వల్ల 3.60 లక్షల మంది యువ ఓటర్లు ఓటు హక్కు కోల్పోయారని రమేష్ కుమారే స్వయంగా చెప్పారు. దీనికి బాధ్యత ఎవరిది? ఐదేళ్లుగా ఎస్ఇసిగా ఉన్న రమేష్ కుమార్‌ది కాదా? కరోనా వంటి అనూహ్య కారణాల వల్ల ఓటర్ల జాబితా సిద్ధం చేయడంలో జాప్యం జరిగిందని అనుకుందాం. ఇప్పుడు అన్నీ కుదుటపడుతున్నాయి. ఒకటి రెండు నెలలు ఆగితే అందరికీ ఓటు హక్కు కల్పించవచ్చు. మరి నిమ్మగడ్డ ఎందుకు ఆగలేకున్నారు. 3.60 లక్షల మందికి ఓటు హక్కు కల్పించడం కంటే తన అహాన్ని సంతృప్తి పరుచుకోవడమే ప్రధాన్యంగా మారిందా? ఇదేనా ప్రజాస్వామ్య స్ఫూర్తి?
ప్రశ్న 7 : అధికారులతో, ప్రభుత్వంతో సమన్వయం చేసుకుని ఎన్నికలు నిర్వహించాలని న్యాయస్థానాలు చెప్పాయి. మరి నిమ్మగడ్డ చేస్తున్నది ఏమిటి? అధికారులపై కక్షగట్టినట్లు వ్యవహరిస్తున్నారు. ఇద్దరు అధికారులను అభిశంసిస్తూ ప్రభుత్వానికి లేఖ రాశారు. తనకు నమ్మకం లేని అధికారులను పక్కనపెట్టడం వేరు. అభిశంసించడం వేరు. పైగా కేంద్ర ప్రభుత్వ సిబ్బంది, బలగాలు కావాలని కేంద్రానికి లేఖ రాశారు. కేంద్రం నుంచి బలగాలను, సిబ్బందిని తెప్పించుకోవాల్సిన పరిస్థితులు రాష్ట్రంలో ఉన్నాయా? తీవ్రవాదుల సమస్యో, ఉగ్రవాదుల ప్రమాదమో ఉన్న ప్రాంతాల్లో కేంద్ర బలగాలను దించుతారా? రాష్ట్రానికి అటువంటి అవసరం ఏముంది?
ప్రశ్న 8 : పంచాయతీ ఎన్నికలను ఏకగ్రీవం చేసుకోండి అంటూ ప్రభుత్వం ఒక ప్రకటన ఇచ్చింది. దాన్ని కూడా నిమ్మగడ్డ తప్పుబడుతున్నారు. ఇవి రాజకీయాలకు అతీతంగా జరిగే ఎన్నికలు. ఎన్నికల పేరుతో గ్రామసీమల్లో కక్షలు కార్పణ్యాలు పెంచుకోకుండా, ఏకాభిప్రాయంతో సర్పంచులను, వార్డు సభ్యులను ఎన్నుకోమని ప్రోత్సహించడమూ నేరం అవుతుందా? దీన్ని కూడా నిమ్మగడ్డ తీవ్రంగా తప్పుబడుతున్నారు.
పంచాయతీ ఎన్నికలు ఏకగ్రీవం చేసుకుంటే కొన్ని ప్రోత్సాహాలనూ ప్రభుత్వాలు ఇస్తున్నాయి. మన రాష్ట్రంలోనూ గతంలో వేలాది పంచాయతీలు ఏకగ్రీవమయ్యాయి. దేశంలోని ఇతర రాష్ట్రాల్లోనూ ఇటువంటి ఉన్నాయి. అయినా నిమ్మగడ్డ విచిత్రంగా వ్యవహరిస్తున్నారు. ఏకగ్రీవాలు జరిగితే జాగ్రత్త అంటూ అధికారులను బెదిరిస్తున్నారు. ఏకగ్రీవాలను పరిశీలించేందుకు ఒక అధికారిని ప్రత్యేకంగా నియమించారు కూడా. ప్రతి ఒక్కరూ ఓటు హక్కు వినియోగించుకోండి అని ప్రభుత్వం ఒక ప్రకటన ఇచ్చినా…దాన్ని కూడా తప్పుబట్టే పరిస్థితి కనిపిస్తోంది.
ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ వ్యవహారం మొదటి నుంచి అనుమానాస్పదంగానే ఉంది. ప్రభుత్వానికి వ్యతిరేకంగా, ప్రతిపక్షానికి అనుకూలంగా వ్యవహరిస్తున్నారని చెప్పడానికి ఆయన చర్యలే బలం చేకూర్చుతున్నాయి.
రాజ్యాంగబద్ధమైన సంక్షోభం తలెత్తకూడదన్న విశాల దృక్పథంతో దేశ అత్యున్నత న్యాయస్థానం తీర్పు ఇచ్చివుండొచ్చుగానీ…అంత మాత్రాన అది నిమ్మగడ్డకు అనుకూలంగా వచ్చిన తీర్పు కాదు. నిమ్మగడ్డ చర్యలకు సమర్ధన అంతకన్నా కాదు. తాను కోర్టుల్లో గెలిచానని నిమ్మగడ్డ భావిస్తుండొచ్చగానీ…ఆయన ఇప్పటికీ ప్రజాకోర్టులోని బోనులో నిలబడే ఉన్నారు.
- ఆదిమూలం శేఖర్, సంపాదకలు, ధర్మచక్రం