పంచాయతీ ఎన్నికల్లో ఏకగ్రీవంగా ఎన్నుకునే అంశంపై తెలుగుదేశం పార్టీ పెద్ద దుమారమే రేపుతోంది. దౌర్జన్యాలతో ఏకగ్రీవాలు చేసుకునేందుకు అధికార పార్టీ కుట్ర చేసిందని ఆరోపిస్తోంది. అర్ధంతరంగా ఆగిపోయిన ఎంపిటిసి, జెడ్పిటిసి ఎన్నికల్లో ఇదే విధంగా దౌర్జన్యంగా ఏకగ్రీవాలు చేసుకున్నారని తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. ఈ వాదనకు ఎన్నికల సంఘం కూడా వంత పాడుతోంది.
ఏకగ్రీవ ఎన్నికలు జరిగిన చోట ఎక్కడైనా దౌర్జన్యాలు వంటివి జరిగివువుంటే విచారణ జరిపి చర్యలు తీసుకోవచ్చు. అంతేగానీ ఏకగ్రీవం అనే విధానాన్నే తప్పుబట్టడం సరైనది కాదు. స్థానిక ఎన్నికలు రాజకీయ పార్టీ గుర్తులకు అతీతంగా జరిగేవి. అందువల్ల పల్లెల్లో అందరూ కూర్చుని, విభేదాలు లేకుండా, అందరికీ ఆమోదయోగ్యమైన వ్యక్తిని ఏకగ్రీవంగా ఎన్నుకోవడం ఎప్పటి నుంచో వస్తోంది. ఇప్పుడూ అదే జరుగుతోంది. అయితే ఇదేదో కొత్తగా వచ్చినట్లు టిడిపి విమర్శలు గుప్పిస్తోంది.
వైసిపి దౌర్జన్యాల సంగతి పక్కనపెడితే….టిడిపి నేతల దాసోహం వల్లే మొన్నటి ఎంపిటిసి ఎన్నికల్లో ఏగ్రీవాలు ఎక్కువగా జరిగాయని చెప్పాలి. అధికార పార్టీ నేతలతో లోపాయికారి ఒప్పందాలు కుదుర్చుకుని ఎక్కువ మంది నామినేషన్లు ఉపసంహరించుకురన్నది బహిరంగ రహస్యం. అధికార పార్టీ నేతలు టిడిపి కార్యకర్తలను నామినేషన్లు వేయనీయలేదని ఆరోపిస్తున్నారుగానీ….నామినేషన్లు వేసిన వారు కూడా ఎందుకు ఉపసంహరించుకున్నారో టిడిపి చెప్పడం లేదు.
ఉదాహరణకు చంద్రగిరి నియోజకవర్గాన్ని పరిశీలిద్దాం. మొత్తం 95 ఎంపిటిసి స్థానాలుంటే 90 స్థానాలకు నోటిఫికేషన్ వెలువడింది. ఇందులో 85 స్థానాలను వైసిపి ఏకగ్రీవంగా గెల్చుకుంది. ఐదు స్థానాలు టిడిపికి దక్కాయి. అదేవిధంగా ఆరు జెడ్పిటిసి స్థానాల్లో ఐదింటిని వైసిపి కైవసం చేసుకుంది. ఒక్క చంద్రగిరి జెడ్పిటిసి స్థానానికి మాత్రమే పోటీ ఏర్పడింది.
చంద్రగిరి నియోజకవర్గంలో ఎంపిటిసి, జెడ్పిటిసి స్థానాలకు వచ్చిన నామినేషన్ల వివరాలను పరిశీలిస్తే….మొత్తం 446 నామినేషన్లలో వైసిపి నుంచి 196 నామినేన్లు దాఖలయ్యాయి. టిడిపి నుంచి 208 నామినేషన్లు వచ్చాయి. వైసిపి కంటే టిడిపి వాళ్లే ఎక్కువ నామినేషన్లు వేశారు. అయినా ఎవరూ చివరిదాకా ఎందుకు నిలబడలేకపోయారన్నది ప్రశ్న.
టిడిపి నేతలు ఎక్కడికక్కడ అధికార పార్టీ నేతలతో రాజీపడిపోయారు. లోపాయికారి ఒప్పందాలతో పోటీ నుంచి తప్పుకున్నారు. పంచాయతీ ఎన్నికల్లో సహకరిస్తామనే హామీతో కొందరు పోటీ నుంచి విరమించుకున్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో వైసిపి ఘన విజయం సాధించడంతో….ఈ ఎన్నికల్లో ఎటూ గెలవలేమన్న భావనతో చాలామంది నామినేషన్లు ఉపసంహరించుకున్నారు. ఆ మాటకొస్తే జిల్లా స్థాయి టిడిపి నాయకులు కూడా లోపాయికారి అవగాహనతో పోటీ నుంచి వైదొలిగారు. గెలవని దానికి లక్షల రూపాయలు ఖర్చు పెట్టుకోవడం ఎందుకన్న భావనతో తప్పుకున్నవారు చాలామందే ఉన్నారు. టిడిపి రాష్ట్ర నాయకత్వం ఎక్కడా భరోసా ఇవ్వలేకపోయింది.
ఇటువంటి పరిస్థితుల్లో భారీగా ఏకగ్రీవాలైన మాట వాస్తవం. చంద్రబాబు నాయుడు ఈ అంశాలను దాచిపెట్టి అధికార పార్టీ నేతల దౌర్జన్యాల వల్లే ఏకగ్రీవాలు జరిగాయని ఆరోపించారు. దాదాపు అన్ని స్థానాలూ ఏకగ్రీవమైన చంద్రగిరి నియోజకవర్గంలో ఒక్క చిన్న గొడవ కూడా నమోదు కాకపోవడం గమనార్హం.
తెలుగుదేశం పార్టీ అధిష్టాతనం తమ వైఫల్యాలను కప్పిపుచ్చుకోడానికి ఏకగ్రీవాలను తీవ్ర వివాదంగా మార్చుతోంది. ఎక్కడైనా అక్రమాలు, దౌర్జన్యాలు జరిగితే..నిర్ధిష్టంగా వాటిని గుర్తించి, విచారణ జరిపింవచచ్చు. అంతేగానీ ఏకగ్రీవాలు జరిగిన అన్నిచోట్లా దౌర్జన్యాలు జరిగాయని చెప్పడం అభ్యంతరకరం.
అధికారంలో ఉన్నప్పుడు సంపాదించుకున్న నాయకులు స్థానిక ఎన్నికల సమయంలో ముఖం చాటేశారు. దీంతో తమకెందుకులే అని గ్రామస్థాయి నాయకులు కూడా రాజీ ధోరణితో వ్యవహరించారు. ఇటువంటి బలహీనతలను కప్పిపుచ్చుకుంటూ, ఏకగ్రీవాలను వివాదాస్పదం చేయడం వల్ల టిడిపికి ఒరిగేదీమీ ఉండదు. – ధర్మచక్రం ప్రతినిధి