అందుకే…సిబిఐ ఈజ్‌ గ్రేట్‌!

ఇటీవల కాలంలో సిబిఐ అంటే ఒక చలకన భావన ఉంది. అది కేంద్ర ప్రభుత్వం చేతిలో కీలుబొమ్మ అని అందరూ విమర్శిస్తుంటారు. రాజకీయ కక్ష సాధించడానికి కేంద్రానికి సిబిఐ సహకరిస్తోందన్న ఆరోపణలు బలంగా ఉన్నాయి. అలాంటి రాజకీయ కేసులు, దర్యాప్తులు పక్కనపెడితే….ఒక నేర పరిశోధనా సంస్థగా సిబిఐ అత్యంత సమర్థతను, నైపుణ్యాన్ని ప్రదర్శిస్తుంది. సప్త సముద్రాల అవతల దాక్కున్న నేరస్తులనూ జుత్తుపట్టుకుని బయటకు లాక్కుని రాగలదు సిబిఐ. ఎంతటి తెలివైన అపరాధినైనా శోధించి పట్టుకోగలదు. ఒక బాలికపై అత్యాచారానికి పాల్పడి ఆపై హత్య చేసిన ఓ నిందితుడిని పట్టుకోడానికి సిబిఐ ఎంతగా శ్రమించిందో తెలుసుకుంటో….ఆ సంస్థపై గౌరవం పెరుగుతుంది. క్రైం థిల్లర్‌ సినిమాలో చూపించినట్లు….సిబిఐ నిర్వహించిన ఓ నేర పరిశోధనకు సంబంధించి ఈ కథనాన్ని చదవండి.

హిమాచల్‌ ప్రదేశ్‌లోని బల్సాంగ్‌ గ్రామానికి చెందిన పదోతరగతి చదివే బాలిక మెహ్సు గ్రామంలోని పాఠశాలకు వెళ్లి వస్తూ గత ఏడాది జులై 4న అదృశ్యమయింది. కోట్‌ఖాయ్‌లోని దట్టమైన హలియాలా అడవుల్లో ఆమె మృతదేహం జులై 6న దుస్తులు లేకుండా కనిపించింది. హిమాచల్‌ ప్రదేశ్‌ హైకోర్టు ఆదేశాలతో జులై 22న సీబీఐ దర్యాప్తు బాధ్యతలను చేపట్టింది. అప్పటి నుంచి 40 మంది సీబీఐ అధికారులు నేరం జరిగిన చోటుకు చుట్టుపక్కల ప్రాంతంలోనే తొమ్మిది నెలల పాటు మకాం వేశారు. అప్పటినుంచి నిందితుడి వేట మొదలయింది. బృందాలుగా విడిపోయిన సీబీఐ అధికారులు భిన్న కోణాల్లో పని చేసుకుంటూ వెళ్లారు. కొన్ని బృందాలు స్థానికులతో పరిచయం పెంచుకుని నిఘా సమాచారం రాబట్టాయి. కొన్ని బృందాలు అటవీ ప్రాంతంలో గాలింపు చర్యల్లో పాల్గొన్నాయి. దర్యాప్తు అధికారులు మొత్తం వెయ్యి మందితో మాట్లాడి వారిలో 400 మంది నుంచి వాంగ్మూలం సేకరించారు. కొన్ని బృందాలు హిస్టరీ షీటర్లు, ఆ ప్రాంతంలో నివసిస్తున్న ప్రజల డీఎన్‌ఏ నమూనాలు సేకరించాయి. ఈ నమూనాల ఆధారంగా సెంట్రల్‌ ఫోరెన్సిక్‌ సైన్స్‌ లాబొరేటరీ (సీఎఫ్‌ఎస్‌ఎల్‌) నిపుణులు పర్సంటేజ్‌ మ్యాచ్‌, లీనియేజ్‌ మ్యాచ్‌ వంటి అధునాతన పరీక్షలు నిర్వహించారు. అనుమానితులు ఏ ప్రాంతానికి చెందిన వారు, ఏ వంశానికి చెందిన వారో నిర్ధారించుకోవడానికి ఈ అధునాతన పరీక్షలు ఉపయోగపడతాయి. సీబీఐ ఇలాంటి 250 నమూనాలను సేకరించింది. ఒక నమూనాలో కొంత శాతం.. నేరం జరిగిన చోట దొరికిన మద్యం సీసాపై, బాధితురాలి మృతదేహం, దుస్తులపై ఉన్న రక్తం నమూనాతో సరిపోలింది. ఈ నమూనా ఆధారంగా ఒక వ్యక్తిని ప్రశ్నించారు. ఆ విచారణ ఆధారంగా సీబీఐ.. కాంగ్రా జిల్లాలోని అనుమానితుడి ఇంటికి వెళ్లింది. ఆ అనుమానితుడికి గతంలో నేర చరిత్ర ఉన్నట్లు తేలింది. ఒక హత్యాయత్నం కేసులో బెయిలు పొందిన తర్వాత 2016, సెప్టెంబరు నుంచి అతను పరారీలో ఉన్నాడని కనుగొన్నారు. ఆ అనుమానితుడి తల్లిదండ్రులకు సీఎఫ్‌ఎస్‌ఎల్‌ నిపుణులు డీఎన్‌ఏ ప్రొఫైలింగ్‌ చేశారు. నేరం జరిగిన చోట దొరికిన నమూనాలు వారి కుమారుడివేనని నిర్ధారించారు. అయితే నిందితుడి ఆచూకీ దొరకకపోవడంతో అతని కోసం గాలింపు మొదలు పెట్టారు. నిందితుడు తన కుటుంబంతో మాట్లాడడం నిలిపేశాడు. డిజిటల్‌ ట్రాకింగ్‌కు అవకాశం లేకుండా చేసేందుకు తన వద్ద మొబైల్‌ ఫోన్‌ ఉంచుకోలేదు. అతనితో మాట్లాడి ఉండడానికి ఎక్కువ అవకాశం ఉన్న 80 మంది జాబితాను సీబీఐ రూపొందించి వారిని విచారించడం ప్రారంభించింది. మిగిలిన వారి ఫోన్లను పరిశీలించింది. అయితే నిందితుడు వారితో మాట్లాడడానికి కొత్త వారి ఫోన్లను ఉపయోగించాడు. అతను మాట్లాడడానికి ఉపయోగించిన ఫోన్ల యజమానులను సీబీఐ ప్రశ్నించింది. నిందితుడు మాట్లాడిన చోట్లను ట్రాక్‌ చేసింది. ఆ కాల్స్‌ ఆధారంగా ఎక్కడి నుంచి ఎక్కడికి నిందితుడు కదిలిందీ గుర్తించింది. ఏప్రిల్‌ 13న చేసిన ఇలాంటి కాల్‌ను సీబీఐ విన్నది. వెంటనే దర్యాప్తు బృందాలు సిమ్లా సమీపంలోని రోహరు ప్రాంతంలోని ఒక వ్యవసాయ క్షేత్రానికి చేరుకున్నాయి. అక్కడ ఒక కూలీని గుర్తించాయి. వారు వెదుకుతున్న ప్రొఫైల్‌తో అతని వివరాలు సరిపోలాయి. వెంటనే అతన్ని పట్టుకుని దిల్లీ తీసుకెళ్లారు. అక్కడ పరీక్షలు నిర్వహించారు. నేరం జరిగిన చోట దొరికిన రక్తం నమూనాతో అతని డీఎన్‌ఏ వందశాతం సరిపోలింది.
అతన్ని విచారించగా నేరానికి ఎలా పాల్పడిందీ వివరించాడు. దట్టమైన హలాలియా అటవీ ప్రాంతంలో కొండ ప్రాంతంపై విసిరేసినట్లుగా ఉండే గ్రామాల్లో బల్సాంగ్‌ గ్రామం ఒకటి. ఆ గ్రామానికి చెందిన పిల్లలు అక్కడికి ఐదు కిలోమీటర్ల దూరంలోని మెహ్సు గ్రామంలోని పాఠశాలకు వెళ్లి వస్తుంటారు. ఐదు కిలోమీటర్లు నడిచి వెళ్లడానికి వారికి గంటన్నర సమయం పడుతుంది. పాఠశాల నుంచి గ్రామానికి రావడానికి మధ్యలో దట్టమైన అడవిని దాటాల్సి ఉంటుంది. గత ఏడాది జులై 4న అనిల్‌కుమార్‌ అక్కడికి సమీపంలోని ఒక వ్యవసాయ క్షేత్రంలో పని చేస్తున్నాడు. పాఠశాలలో స్పోర్ట్స్‌మీట్‌ పూర్తి చేసుకున్న బాధితురాలు ఇంటికి తిరిగి వస్తూ అతని కంట పడింది. ఆమెపై బలప్రయోగం చేసి అత్యాచారానికి పాల్పడి, ఆ తర్వాత హత్య చేసినట్లు సీబీఐ ఆరోపించింది. నిందితుడిని సిమ్లాలోని న్యాయస్థానంలో బుధవారం హాజరుపర్చగా కోర్టు జ్యుడిషియల్‌ కస్టడీకి పంపించింది.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*