అంబ ప‌లికించిన భ్ర‌మ‌రాంబ‌!

శ్రీకాళహస్తి ఆలయ ఈవోగా పనిచేసిన దుర్భముళ్ల భ్రమరాంబ తనదైన శైలిలో విధులు నిర్వహించి శెభాష్‌ అనిపించుకున్నారు. అవినీతిపరుల ఆటకట్టించడమేగాక ఆలయాన్ని అభివృద్ధి పథంలో పయనింపజేశారు. ఎన్నో విభేదాలకు, వివాదాలకు కేంద్ర బిందువుగా మారినప్పటికీ….తాను ఏమి చేసినా శివయ్య కోసమే అనుకుని తనకు తెలిసిన రీతిలోనే పని చేసుకుపోయారు. ఈవోగా కుర్చీలో కూర్చున్న తొలి రోజు నుంచే ఆమెను బదిలీ చేయించడానికి అధికార పార్టీ నాయకులు చేసిన ప్రయత్నాలు ఎట్టకేలకు ఇప్పటికి ఫలించాయి. ఆమెను బదిలీ చేసి ఆ స్థానంలో కర్నూలు జిల్లా సంయుక్త పాలనాధికారి-2 రామస్వామిని నియమించారు. ఈ నేపథ్యంలో భ్రమరాంబ గురించిన కథనం.

శ్రీకాళహస్తి ఆలయం అవినీతి, అక్రమాలకు నిలయం అనే అభిప్రాయం సర్వత్రా ఉండేది. అధికారులు, కాంట్రాక్టులు, అర్చకులు ఎవరికి వారు జేబులు నింపుకునేవారు. ఒక హారతి పళ్లాల రూపంలోనే కోట్లాది రూపాయల అవినీతి జరిగేది. ఇక కాంట్రాక్టులు, కొనుగోళ్లు తదితర వాటిలో అక్రమాల గురించి చెప్పాల్సిన పనిలేదు. ఆలయంలో దర్శనాల పేరుతో దళారుల దందాకు కొదవేలేదు. ఈ పరిస్థితుల్లో 2015 అక్టోబర్‌లో భ్రమరాంబ ఈవోగా బాధ్యతలు చేపట్టారు. అప్పుడే ఆలయ ట్రస్టు బోర్డు కూడా కొత్తగా ఏర్పాటయింది.

అక్రమాలకు కళ్లెం!
భ్రమరాంబ మొదట అక్రమాలపై దృష్టి సారించారు. ఆలయంలోకి దళారులు ఎవరూ వెళ్లకుండా క్యూలైన్లను కట్టుదిట్టం చేశారు. ఇక ఆలయంలోని పరివార దేవతల వద్ద హారతి పళ్లాలు పెట్టి కానుకలు దండుకుని, ముడుపులు కట్టుకునే పద్ధతికి చెక్‌పెడుతూ….హారతి పళ్లేలను తొలగించారు. ఇక రాహు-కేతు పూజల్లో బలవంతపు వసూళ్లను అడ్డుకోగలిగారు. ఒకప్పుడే రాహు-కేతు పూజలు బంగారు బాతులా ఉండేది. అక్కడ నిఘా పెట్టి భక్తుల నుంచి కానుకలు వసూలు చేసుకున్నా…వాటిని తీసి హుండీలో వేయడం మొదలుపెట్టారు. ఆ తరువాత సిసి కెమెరాలు ఏర్పాటు చేసి నిఘా పెట్టారు. కాంట్రాక్టర్ల కోసమే కొబ్బరి కాయలు కొనుగోలు చేస్తున్న పద్ధతిని గమనించారు. రాహు-కేతు పూజల్లో మూడు కొబ్బరి కాయులు ఇచ్చేవాళ్లు. అందులో రెండు వృథా అయ్యేవి. రాహు-కేతు పూజలకు ఒక కొబ్బరికాయ మాత్రమే ఇచ్చే పద్దతి పెట్టారు. దీనివల్ల ఆలయానికి కోట్లాది రూపాయలు ఆదా అయ్యాయి. ఇదేకాదు…ఫల సరుకుల కొనుగోలు, నెయ్యి కొనుగోలు టెండర్లలో అక్రమాలకు ఆస్కారం లేకుండా అన్ని దార్లూ బిగించేశారు. ప్రసాదాల తయారీపై దృష్టిపెట్టి…ఇస్తున్న దిట్టానికి, తయారవుతున్న ప్రసాదాలకు మధ్య తేడా ఉండటతో గుర్తించి, అక్కడే తిష్టవేసి, ఎంత దిట్టానికి, ఎంత పరిమాణంలో ప్రసాదాలు తయారుకావాలో నిర్ధారణ చేశారు. దీనివల్ల కూడా కోట్ల రూపాయలు ఆదా అయ్యాయి. మహాశివరాత్రి వచ్చిందంటే…ఎవరికి దొరికిన చోట వాళ్లు దండుకునేవారు. ఆచిచూచి నిధులు వ్యయం చేయడంతో దుబారా తగ్గింది. అవినీతిని, అక్రమాలను అడ్డుకునే క్రమంలో… అనేక మంది ఉద్యోగులను సస్పెండ్‌ చేశారు. కొందరిని బదిలీ చేశారు. దళారులపై కేసులు పెట్టంచారు.

అభివృద్ధి పరుగులు!
దాదాపు 20 ఏళ్లలో జరిగిన అభివృద్ధి గడచిన 2 ఏళ్లలో జరిగిందంటే అతిశయోక్తికాదు. ఆలయంలో 15 టన్నుల వెండి గుట్టలాగా పేరుకుపోయివుండగా…దాన్నంతటినీ కరిగించి, బంగారు కొనుగోలు చేసి బ్యాంకులో డిపాజిట్‌ చేశారు. దీనివల్ల దేవస్థానానికి వడ్డీ రూపంలో కోట్లాది రూపాయలు జమ కాబోతున్నాయి. 12 సంవత్సరాలకోసారి మహాకుంభాభిషేకం నిర్వహించాల్సివుండగా… జాప్యం జరగడాన్ని గమనించి, వెంటనే ఆ క్రతువు పూర్తి చేశారు. ఆలయ గోపుర శిఖరాలు, వాహనాలు, ధ్వజస్తంభం ఇలా అన్ని స్వర్ణతాపడం పనులు ఆమె హయంలోనే జరగడం విశేషం. దాదాపుగా రూ.35 కోట్ల వ్యయంతో ఈ పనులు పూర్తయ్యాయి. ఇదంతా భక్తుల నుంచి విరాళంగానే సేకరించారు. ఎక్కడా చిన్నపాటి అవినీతి ఆరోపణలు ఆమెపై రాలేదు. ముక్కంటి ఆలయ అభివద్ధి కోసం ప్రభుత్వం చేపట్టిన బహత్తర ప్రణాళిక పనులు భ్రమరాంబ సారథ్యంలోనే ఒక కొలిక్కివచ్చాయి. ఇక టిటిడి నిర్మిస్తున్న యాత్రీకుల వసతి సముదాయం పూర్తయింది. భరద్వాజ తీర్థం కోనేరును సుందరంగా తీర్చిదిద్దారు. ఇలా చెప్పుకుంటూపోతే అనేక పనులు భ్రమరాంబ ఈవోగా ఉన్నప్పుడు జరిగినవే. సంవత్సరాల తరబడి బ్యాంకుల్లో ఉండిపోయిన ఆభరణాలను బయటకు తీసి స్వామి అమ్మవార్లకు అలంకరింపజేశారు.

వివాదాలకూ కొదవలేదు…
తన ముక్కుసూటితనం వల్ల, పట్టువిడుపులు తెలియని ధోరణి వల్ల అనేక వివాదాలకు భ్రమరాంబ కేంద్రబిందువు కూడా అయ్యారు. ఆలయ ట్రస్టుబోర్డు సభ్యులతో ఎప్పుడూ ఘర్షణే. సభ్యులతో ముఖాముఖి మాట్లాడలేని పరిస్థితి. అదేవిధంగా ఆలయ అర్చకులతోనూ విభేదాలు వచ్చాయి. కానుకలు దాచుకున్నారన్న పేరుతో పంచెలు విప్పించి తనిఖీలు చేశారంటూ అర్చకులు ముఖ్యమంత్రికి ఫిర్యాదు చేశారు. అక్రమార్కులను సస్పెండ్‌ చేయడం ద్వారా వారి ఆగ్రహానికి గురయ్యారు. మహాశివరాత్రి సందర్భంగా స్థానికులను ప్రత్యేక దర్శనానికి అనుమతించకపోవడమూ వివాదాస్పదమయింది. అయితే తాను ఏనాడూ తప్పు చేయలేదనేది ఆమె నమ్మకం. తాను ఏమి చేసినా ఆలయ అభివృద్ధి కోసమే చేశానని ఆమె చెబుతారు. మూడు శివరాత్రి ఉత్సవాలను విజయవంతంగా నిర్వహించడం తనకు దక్కిన భాగ్యంగా చెబుతారు.

2 Comments

  1. భ్రమరాంబ కధనం బాగుంది.
    ఆమెపై రాజకీయ పార్టీల ఒత్తిళ్ళ గురించి తెలిపి ఉంటే ఇంకా బాగుండేది.

  2. Yes, the public also of the same opinion that she is the dare devil in crushing the corruption and disorders at the temple. After due review of the situation, she should have been allowed to continue as EO but it is very unfortunate that she is posted out.

Leave a Reply

Your email address will not be published.


*