అట్లాంటి హోటల్ మన ఊళ్లోనూ ఉంటే బాగుణ్ణు!

కొసరి కొసరి వడ్డించే హోటళ్ళు, విస్తర నిండిపోయేన్ని పదార్థాలను వడ్డించే హోటళ్ళు, కొన్ని ఐటమ్స్‌ కి పేరుగాంచిన హోటళ్ళు గురించి చాలానే విన్నాం. అయితే కేరళ లోని ఓ పెద్దమ్మ హోటల్ మాత్రం వీటన్నింటికీ భిన్నమైనది. తినగలిగినంత తిని, ఇవ్వాలనుకున్నంత ఇచ్చి వెళ్ళచ్చు. ధరలు, బిల్లులు ఏమీ ఉండవు. ఓ మిత్రుడు ఫేస్ బుక్ లో రాసిన వివరాలు మీరూ చదవండి. అలాంటి హోటల్ మన ఊళ్లోనూ ఉంటే బాగుండును అని తప్పక అనిపిస్తుంది.

**************************

కొల్లాం: ఒక సగటు జీవి బయటికెళ్లి హోటల్స్‌లో భోజనం చేయాలంటే ధరలు చూసి జంకుతున్న రోజులివి. ఇక రెస్టారెంట్స్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఇలాంటి రోజుల్లో ‘‘కడుపు నిండా తినండి.. డబ్బులు మాత్రం మీకు తోచినంత ఇవ్వండి’’ అని ఎవరైనా అంటారా. అలా అనడమే కాదు.. ఆ హోటల్‌లో ధరల పట్టిక ఉండనే ఉండదు. కేరళలోని కొల్లాం రైల్వే స్టేషన్‌కు రెండు కిలోమీటర్ల దూరంలో ఉన్న యశోదమ్మ హోటల్ స్పెషాలిటీ ఇది. ఈ హోటల్‌లో పని వారెవరూ ఉండరు. ఆ యశోదమ్మ అనే మహిళే అన్నీ తానై భోజన ఏర్పాట్లు చూస్తుంది. ఉదయాన్నే 5గంటలకు నిద్ర లేచి పది గంటలకల్లా వంటకాలను సిద్ధం చేస్తుంది.

50మందికి సరిపడా భోజనాన్ని కేవలం ఐదు గంటల్లో.. అదీ ఆ వయసులో.. ఎవరి సహాయం తీసుకోకుండా ఒక్కరే సిద్ధం చేయడమంటే ఆషామాషీ కాదు. కానీ యశోదమ్మ అలానే కష్టపడుతోంది. వెజ్ వంటకాలతో పాటు నాన్‌వెజ్ కూడా ఈ హోటల్‌లో దొరుకుతుంది. యశోదమ్మ హోటల్‌లో ఎలాంటి జీఎస్‌టీలు ఉండవు. ధరల పట్టిక కూడా ఉండదు. ఒక ప్లాస్టిక్ బాక్స్ ఉంటుంది. అదే ఆ హోటల్‌లో క్యాష్ కౌంటర్. తిన్న తర్వాత ఎవరికి ఎంత ఇవ్వాలనిపిస్తే అంత ఆ బాక్స్‌లో వేసి వెళితే చాలు. ఇంత కష్టపడుతూ.. లాభాపేక్ష లేకపోవడంపై యశోదమ్మ స్పందిస్తూ… పక్కవారి ఆకలి తీర్చడంలో కన్నా ఆత్మ సంతృప్తి ఇంకెందులో ఉంటుందని చెప్పింది. ఆ హోటల్ సమీపంలో బ్యాంకు కోచింగ్ సెంటర్లున్నాయి. దీంతో విద్యార్థులు, ఫ్యాకల్టీ యశోదమ్మ హోటల్‌కు క్యూ కడుతుండటం విశేషం.

1 Comment

  1. Thanks to that mother feeding the potential of the nation. Lets see if sfew of them becomes top officers and contribute the lession learnt from her and her meal. Once again thanks to that mother and also Dharmachakram for circulating inspirable news.

Leave a Reply

Your email address will not be published.


*