అధికారంలో ఉన్నా బాబు ప్రతిపక్ష పాత్ర..!

పోలింగ్ సమీపించే కొద్దీ టిడిపి ప్రతిపక్షంగా తన రాజకీయ పంథా మార్చుకొన్నది. మరీ పోలింగ్ రోజైతే రాష్ట్రంలో తను అధికారంలో వున్నాననే భావన పక్కన పెట్టి ఫక్తు ప్రతిపక్షంలాగా ముఖ్యమంత్రి ఉదయం 10 గంటలకే 150 కేంద్రాలలో రీ పోలింగ్ డిమాండ్ చేశారు. పోలింగ్ ముందు రోజు అధికార లాంఛనాలు పక్కన పెట్టి రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారిని కలసి వినతిపత్రం సమర్పించారు.

1) ఏ రాష్ట్రంలో కూడా ఎన్నికల అధికారిని ముఖ్యమంత్రి కలిసి వినతిపత్రం ఇవ్వడం ఇది వరలో ఎప్పుడూ లేదు. 2) కాగా ముఖ్యమంత్రి తీరు తిలకించిన వారు బెదిరింపు ధోరణకి ఇది తార్కాణంగా భావించిన వారు వున్నారు. ఏది ఏమైనా ముఖ్యమంత్రి సరి కొత్త చరిత్ర సృష్టించారని చెప్పాలి.

ఈ కథ ఇంతటితో ఆగలేదు. వాస్తవం చెప్పాలంటే పోలింగ్ రోజు ఉదయం ఇవియంలు పలు చోట్ల మొరాయించాయి. ఈ అవకాశాన్ని ముఖ్యమంత్రి ఉపయోగించుకుని ఎన్నికల సంఘం పై తీవ్రమైన దాడి సాగించారు. సాధారణంగా సాయంత్రం ఎవరైనా రీ పోలింగ్ డిమాండ్ చేస్తారు. కాని ముఖ్యమంత్రి ఉదయం 10 గంటలకే రీ పోలింగ్ డిమాండ్ తెర మీద కు తెచ్చారు. పైగా సైకిల్ కు బటన్ నొక్కితే ప్యాన్ పై పడుతున్నదనే తీవ్ర మైన ఆరోపణను ముఖ్యమంత్రి చేశారు. ఇందుకు ఎన్నికల ప్రధాన అధికారి గట్టి సమాధానమే ఇచ్చారు. తదుపరి ఈ రగడ మరుగుపడింది.
అంతటితో టిడిపి నేతలు ఆగలేదు. విజయవాడలో టిడిపి నేత ఎన్నికల నిర్వహణ పక్కన పెట్టి ధర్నాకు దిగారు. వాస్తవం చెప్పాలంటే ఎన్నికల పోరులో ఓడిపోయే వారు ఏలాంటి ఎత్తు గడలు అవలంభించుతారో అచ్చం అదే విధంగా టిడిపినేతలు వ్యవహరించడం చూశాం.

ఎన్నికలు ఫలితాలు ఏవిధంగానైనా వుండవచ్చు. గాని ముఖ్యమంత్రి గాని పార్టీ నేతలు గాని కొంత కాలంగా కేంద్ర ప్రభుత్వాన్ని ముద్దాయిని చేస్తూ వుండి పోలింగ్ రెండు రోజుల నుండి ప్రత్యక్షంగా కేంద్ర ఎన్నికల సంఘం పైననే యుద్ధం ప్రారంభించారు. ఫలితంగా రాష్ట్రంలో ఒక విచిత్ర పరిస్థితి నెలకొంది. ఎన్నికల సంఘం అధికారపక్షం కాగా టిడిపి ప్రతి పక్షంగా మిగిలి పోయింది.
జిల్లాల నుండి వస్తున్న వార్తలను పరిశీలించితే ప్రధాన ప్రతిపక్షం వైసిపి చాపకింద నీరులాగా అల్లరి లేకుండా తన పని తాను చేసుకుపోవడమే కాకుండా పోలింగ్ రోజు ప్రతిపక్షంలాగా టిడిపి అల్లరి చేస్తుంటే వైసిపి పోలింగ్ పై దృష్టి పెట్టి పైగా ఎన్నికల సంఘం పై ఈగ వాలకుండా చూచు కొన్నది. తన మీడియాలో కూడా ఎన్నికల సంఘంపై విమర్శలు లేకుండా చూచు కొన్నది.

విశ్వసనీయంగా తెలుస్తున్న సమాచారం ఏమంటే పోలింగ్ ముందు సాగించే మేనేజ్ మెంట్ లో కారణాలు ఏమో గాని టిడిపి కొంత మేర వైఫల్యం చెందిందని తెలుస్తోంది. చిత్తూరు, నెల్లూరు, ప్రకాశం జిల్లాలో పోల్ మేనేజ్మెంట్లో టిడిపి అట్టర్ ప్లాఫ్ అయిందంటుంన్నారు. ఇందుకు ఎన్నికల సంఘం విధించిన కట్టుబాట్లు కారణం కావచ్చు. అధికార పక్షం కాబట్టి మేనేజ్ మెంట్ ఏవిధంగా నైనా చేసుకోవచ్చని భావించిన ముఖ్యమంత్రి తుదకు వైఫల్యం చెంది అంతిమంగా ఎన్నికల సంఘాన్ని టార్గెట్ చేస్తూ వుండవచ్చు. అయితే పోల్ మేనేజ్మెంట్లో భారత దేశంలో మొత్తం మీద ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తర్వాతనే ఎవరినైనా చెప్పు కోవాలి. వ్యూహం ఎత్తుగడలు రూపొందించి ప్రత్యర్థిని బోల్తా కొట్టించడంలో ముందుగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గురించి చెప్పుకోవాలి.

ఏమైందో ఏమో గాని 2014 తర్వాత ప్రతి సందర్భంలోనూ ముఖ్యమంత్రి బోల్తా పడుతున్నారు. ప్రత్యర్థులు పన్నిన వలలో పడుతున్నారు. ఇందుకు ఆయన స్వవచన విఘాతాలు కొంత కారణమైతే పార్టీ నేతలను అదుపు చేయలేక పోవడంతో పుట్టి మునిగే పరిస్థితి పీక మీదకు తెచ్చుకుంటున్నారు. పైగా ప్రస్తుతం పోల్ మేనేజ్ మెంట్ కన్నా టిడిపి పసుపు కుంకుమ పైననే ఆశలు పెంచుకొని వుంది. టిడిపి దాని పరివారం పోలింగ్ కు మహిళలు వృద్ధులు వచ్చినందుకు గెలుపు పై ఆశలు పెట్టుకున్నారు. మరో వేపు వైసిపి ప్రభుత్వ వ్యతిరేకతతోనే ఓటర్లు వెల్లువెత్తినట్లు భావించి గెలుపు పై ఆశలు పెంచుకున్నారు. ఇందులో ముఖ్య మైన అంశమేమంటే పోలింగ్ రోజు కాకుండా రెండు రోజుల ముందు నుండే ముఖ్యమంత్రి ప్రతిపక్ష పార్టీ పాత్ర పోషించడంలోని ఆంతర్యం అర్థం కావడం లేదు. ఇందులోనే అసలు రహస్యం ఇమిడి వుంది. రేపు కుడి ఎడమైతే ఎన్నికల సంఘాన్ని దోషిగా నిలబెడతారా?
మరో ట్విస్ట్ ఏమంటే రాష్ట్రంలో రాజకీయ విశ్లేషణలు సాగించే ఒకరిద్దరు మాత్రం గట్టిపోటీ అని తమ అభిప్రాయాలను వెల్లడించారు

– వి.శంకరయ్య, 9848394013

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*