అధికారపక్షం అత్యుత్సాహం….ప్రతిపక్షం ఆక్రోశం..! శాసన సభా సమావేశాల తీరు !!

ఆంధ్రప్రదేశ్‌ శీతాకాల శాసన సభా సమావేశాలు ఐదు రోజులు గడిచాయి. ఈ సమావేశాలు రోజూ రచ్చరచ్చగానే సాగుతున్నాయి. ఒక పూట కూడా సావధానమైన చర్చ జరిగినట్లు కనిపించదు. ప్రశ్నోత్తరాలతోనే విమర్శలు, ప్రతివిమర్శలు, దూషణలు మొదలై సభ చివరి నిమిషం దాకా కొనసాగు తున్నాయి. అధికారపక్షం అత్యుత్సాహం, ప్రతిపక్షం ఆక్రోశం మధ్య సభ హుందాతనం కోల్పోతోంది. ప్రతిష్ట దిగజారుతోంది.

ప్రతిపక్ష తెలుగుదేశం పార్టీ ప్రతి అంశాన్ని వివాదాస్పదం చేసి, తమకున్న మీడియా ద్వారా ప్రచారం చేసుకుని లబ్ధిపొందడానికి అసెంబ్లీ సమావేశాలను ఒక అవకాశంగా భావిస్తోంది. అధికార వైసిపి….ఇదే అసెంబ్లీని ఆసరాగా చేసుకుని టిడిపి అధినేత చంద్రబాబు సహా ఆ పార్టీ సభ్యులను మానసికంగా బలహీనం చేయడానికి ప్రయత్నిస్తోంది. గడచిన ఐదేళ్లలో శాసనసభలో ఏమి జరిగిందో ఇప్పుడూ అదే జరుగుతోంది. కాకుంటే అటువారు ఇటు – ఇటువారు అటు అయ్యారు. అంతే తేడా.

చంద్రబాబూ నీకు బుద్ధివుందా…అని ముఖ్యమంత్రి జగన్‌ మండిపడినా, ఆయన ప్రతిపక్ష నేతా…పనికి మాలిన నేతా అని రోజూ మాట్లాడినా, చంద్రబాబుకు ఇంగ్లీషు రాదంటూ బుగ్గున హేళన చేసినా, చంద్రబాబు మానసిక రోగుల కేంద్రం ఏర్పాటు చేసి అందులో మొదటి పేసెంట్‌గా ఆయన్నే చేర్చాలని మంత్రి నాని ఎద్దేవా చేసినా…..ఈ అన్నింట్లో కనిపించేది ఒక్కటే….చంద్రబాబును చికాకుపెట్టడం. ‘నేను శాసన సభా సమావేశాలకే రాను…మహాప్రభో’ అనిపించేలా చేయడం. తద్వారా మిగతా తెలుగుదేశం సభ్యులనూ బలహీనం చేసి అచేతన స్థితికి నెట్టేయడం.

అసెంబ్లీ సమావేశాలకు రానివ్వకుండా మార్సిల్స్‌ తమను అడ్డుకున్నారని చంద్రబాబు ఆరోపించినా, తనకోసం కేటాయించిన గేటు ద్వారా కాకుండా మిగతా సభ్యులు వచ్చే గేటు ద్వారా వచ్చేందుకు ప్రయత్నించినా, మహిళా సభ్యుల చేతలనూ తనిఖీ చేసి అవమానించారని చెప్పినా, ముఖ్యమంత్రి జగన్‌ను నువ్వు ఉన్మాదివి అని విమర్శించినా, నీ కథ చూస్తా అంటూ స్పీకర్‌ను ఉద్దేశించి వ్యాఖ్యలు చేసినా, మార్కెట్‌కు వెళ్లి ఓ వ్యక్తి గుండెపోటుతో చనిపోతే ఉల్లిపాయల వల్లే చపిపోయారని ప్రచారం చేసినా…ఇవన్నీ శాసనసభను అడ్డుపెట్టుకుని రాజకీయంగా లబ్ధిపొందడానికి చంద్రబాబు చేసిన ప్రయత్నాలే.

ఈ వ్యవహారాల్లో స్పీకర్‌ తమ్మినేని సీతారాం కూడా ప్రతిపక్ష నేతల విమర్శలకు కేంద్రంగా ఉంటున్నారు. తమకు మైకు ఇవ్వడం లేదని, అధికార పక్షం చేస్తున్న విమర్శలకు సమాధానం చెప్పే అవకాశం ఇవ్వడం లేదని, అధికారపక్షం పట్ల పక్షపాతంతోనూ, తమపట్ల కక్షపూరిత ధోరణితోనూ వ్యవహరిస్తున్నారని టిడిపి ఆరోపిస్తోంది. ఆయన ధోరణిపై గవర్నర్‌కు కూడా ఫిర్యాదు చేసింది. తెలుగుదేశం సభ్యుడు వంశీని ప్రత్యేక సభ్యునిగా గుర్తించడాన్ని కూడా తెలుగుదేశం తప్పుబట్టింది.

ప్రస్తుతం శాసనసభ జరుగుతున్న తీరుపై ప్రజాస్వామిక వాదులకు ఎన్ని అభ్యంతరాలున్నా తప్పుపట్టలేని పరిస్థితి. ఎందుకంటే….నీవు నేర్పిన విద్యయే గదా నీరజాక్షా అనే చందంగా ఇప్పుడు జరుగుతున్న దానికి మూలాలు గడచిన ఐదేళ్లలోనే ఉన్నాయి. తెలుగుదేశం ప్రభుత్వంలో శాసనసభా సమావేశాలు ఇంతకన్నా భిన్నంగా ఏమీ జరగలేదు. ప్రతిపక్షాన్ని దూషించడమైనా, ఏకపక్షంగా విమర్శించడమైనా, సభ్యులను సస్పెండ్‌ చేయడమైనా….ఏదీ ఇప్పటికంటే హుందాగా ఏమీలేదు.

సభ మొదలయితే చాలు….జగన్‌ను అవినీతిపరుడని, జైలుకెళ్లాడని ప్రతి తెలుగుదేశం సభ్యుడూ మాట్లాడేవారు. అప్పటి ప్రతిపక్షం వైసిపికి సభ్యులకు మైకు వచ్చేది కాదు. అధికారపక్షం చేస్తున్న విమర్శలకు బదులిచ్చే అవకాశం దొరికేది కాదు. సభకు వెళ్లినా మైక్‌ ఇవ్వరు అనిచెప్పి వైసిపి శాసన సభ సమావేశాలను బహిష్కరించింది. ఇక బూతల విషయానికొస్తే….బోండా ఉమా, అచ్చన్నాయుడు వంటివారి నోటికి అడ్డూఅదుపూ ఉండేది కాదు. నోటికి ఎంతొస్తే అంత అనేసేవారు. రోజును ఏడాదిపాటు సభ నుంచి బహిష్కరించారు. కోర్టు ఆదేశాలిచ్చినా ఆమెను లోనికి రానివ్వలేదు. 23 మంది వైసిపి ఎంఎల్‌ఏలు ఫిరాయించి, టిడిపి ప్రభుత్వంలో మంత్రి పదవులు తీసుకున్నా స్పీకర్‌ ఏ చర్యలూ తీసుకోలేదు.

గత పాపాల కారణంగానే….ప్రస్తుతం సభలో జరుగుతున్న వ్యవహారాలను ప్రశ్నించే నైతికతను టిడిపి కోల్పోయింది. అందుకే ఆ పార్టీ నేతలు ఎంతగా ఆక్రోశిస్తున్నా సానుభూతి లభించడం లేదు. ప్రతి సందర్భంలోనూ వైసిపి గతంలో జరిగిన ఉదంతాలను ప్రస్తావిస్తూ తెలుగుదేశం సభ్యుల నోరుమూయిస్తోంది. 23 మంది ప్రతిపక్ష ఎంఎల్‌ఏలను తీసుకుని, కొందరికి మంత్రిపదవులు కూడా కట్టబెట్టిన టిడిపికి….ఇప్పుడు వల్లభనేని వంశీ విషయంలో పోరాడగల నైతికత ఎలావుంటుంది? ఏ అంశంలోనైనా ఇటువంటి నైతికతే టిడిపికి అడ్డుతగులుతోంది. అందుకే దాని పోరాటంలో బలం లేదు.

ఇక అధికార పార్టీ విషయానికొస్తే…..గతంలో జరగిన దానికి ప్రతీకారం తీర్చుకోవాలన్న కాంక్ష వైసిపి సభ్యుల్లో బలంగా ఉండొచ్చుగానీ ప్రజాస్వామ్యయుతంగా, హుందాగా వ్యవహరించాల్సిన అవసరం అంతకంటే బలంగా ఉండాలి. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు అటూఇటూ వ్యవహరించినా జనం పట్టించుకోరు. అధికారంలో ఉన్నప్పుడు ఆధిపత్య ధోరణి ప్రదర్శిస్తే….ప్రజలు హర్షించరు. ప్రతిపక్షాన్ని అణచివేస్తున్నారన్న భావన కలుగుతుంది. ఇప్పుడు జరగుతున్న తీరులోనైతే శాసనసభ సమావేశాలు నిర్వహించడమే వృథా అనే భావన జనంలో బలపడుతోంది. ఇది ఎవరికీ మంచిది కాదు.

-ఆదిమూలం శేఖర్‌, సంపాదకులు, ధర్మచక్రం

1 Comment

  1. చక్కగా విశ్లేషించారు. మీరన్నట్లు ఎవ్వరినీ తప్పుబట్టలేని పరిస్థితి. ఇన్నేళ్లు అనుభవం ఉన్న చంద్రబాబు మతిలేని వ్యక్తిగా వ్యవహరించి ఐనదానికీ కానిదానికీ విమర్శలు చేస్తూ దూషిస్తూ ఉంటే అవతలివాళ్ళు మాత్రం ఊరికే ఎందుకు ఉంటారు.

Leave a Reply

Your email address will not be published.


*