అన్నీ ఉన్నా అల్లుడి నోటిలో శని….వరద పారుతున్నా కండలేరు నింపరా?

మనకైతే వర్షాలు లేవు. రాయలసీమ నాలుగు జిల్లాల్లో పంట పొలాలు నెర్రెలుబారి నోళ్లు తెరుచుకుని వున్నాయి. అద్రుష్టం కొద్దీ ఎగువ రాష్ట్రాలలో దఫా దఫాలుగా వర్షాలు పడటం వలన గతంతో పోల్చుకుంటే ఈ ఏడు కృష్ణ, గోదావరి నదులకు వరద రోజులు ఎక్కువగా వున్నాయి. కృష్ణ నదికి వచ్చే వరద కూడా ఉపయోగించుకోలేని దుస్థితిలో వున్నాము. గత రెండు రోజులుగా కృష్ణ నదికి వరద వస్తోంది. ప్రస్తుతం సోమశిలకు 30 టియంసిల నీరు చేరింది. కండలేరుకు చుక్క నీరు వదల లేదు. ప్రస్తుతం కండలేరులో 5.67 టియంసిల నీరు మాత్రమే ఉంది. దీపం వుండగానే ఇల్లు చక్క బెట్టుకోవాలన్నట్లు వరద రోజుల్లోనే కండలేరు నింపుకోవాలనే ఆలోచన ఈ ప్రాంత శాసనసభ్యులకు వున్నట్లు లేదు.

ఈ నెల 8వ తేది రాత్రి 8 గంటలకు 2,53, 157 క్యూసెక్కులు నీరు శ్రీ శైలం జలాశయం చేరుతుంటే కిందకు వివిధ రూపాల్లో 96, 746 క్యూసెక్కులు నీరు వదలి పెడుతున్నారు. జలాశయ నిల్వ సామర్థ్యం 215 టియంసిల అయితే 202 టియంసిల నీరు వుంది. ఇదే విధంగా వరద వుంటే గేట్లు రెండవ మారు ఎత్తి కిందకు వరద స్థితి బట్టి నీళ్లు వదలిపెడతారు.

గమనార్హమైన అంశమేమంటే భారీ ఎత్తున వరద వచ్చి, తుదకు ప్రకాశం బ్యారేజీ నుండి వందల టియంసిలు నీరు సముద్రం పాలౌతున్నా రాయలసీమకు వరద సమయంలో కూడా నీరు (నికర జలాలు ఏలాగు లేవు.) ఉపయోగించుకొనే పరిస్థితి లేకపోవడమే. ఇంత పెద్ద ఎత్తున వరద సముద్రంలో కలుస్తుంటే రాయలసీమకు కేవలం 26,526 క్యూసెక్కులు నీరు మాత్రమే ఉపయోగించుకోగలుగు తున్నారు. పోతురెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ ద్వారా 24,500 క్యూసెక్కులు, హంద్రీనీవా కు మల్యాల నుండి 2,026 క్యూసెక్కులు మాత్రమే వినియోగించుకున్నాము.
వాస్తవంలో గత అయిదు ఏళ్లలో నిర్మాణంలో వుండిన జలాశయాలను పూర్తి స్థాయిలో నీరు నిలుపు కొనే విధంగా పనులు పూర్తిచేసి వుంటే కొంతలో కొంత మేలు జరిగేది. అదీ జరగలేదు. పోనీ కొత్తగా వచ్చిన వైసిపి ప్రభుత్వం అయినా వచ్చే ఏడాదికైనా మిగిలిపోయిన పనులు పూర్తి చేసే అవకాశం కన్పించడం లేదు. దాని ప్రాధాన్యాలు వేరుగా వున్నాయి. అవినీతి వెలికితీత పేరుతో ఎక్కడ ప్రాజెక్టులు అక్కడ నిలిచి పోయాయి. అరకొరగానైనా నవ రత్నాలు అమలు చేయాలంటే వచ్చే రెండు నెలలకు 15 వేల కోట్ల రూపాయల అప్పు చేయాలని చెబుతున్నారు. ఈ ఆర్థిక సంవత్సరంలో సాగునీటి ప్రాజెక్టుల పనులు మొదలు పెట్టే అవకాశం లేదు. వచ్చే ఆర్థిక సంవత్సరంలో చేయి కాలు కూడేసుకొని టెండర్లు పిలిచి కాంట్రాక్టర్లు పనులు మొదలెట్టే సరికి పుణ్య కాలం గడచి పోతుంది. అవినీతిని ఒకవేపు వెలికి తీస్తూనే ఈ ఏడే పనులు పట్టాలు ఎక్కించి వుంటే వచ్చే సంవత్సరం వరద వస్తేగీస్తే సీమకు కొంతలో కొంత మేలు జరిగేది. ప్రస్తుతం ఆ సూచనలు కన్పించడం లేదు.

తెలుగు దేశం ప్రభుతంలో జరిగిన అన్యాయమే రెండేళ్ల పాటు వైసిపి ప్రభుత్వంలో కూడా తప్పేట్టులేదు.
ప్రస్తుతం పోతురెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ నుండి విడుదల అవుతున్న 24, 500 క్యూసెక్కులలో (9 వతేదికి) 11,892 క్యూసెక్కులు సోమశిల ప్రాజెక్టుకు తరలిస్తున్నారు. 10,030 క్యూసెక్కులు గండికోట జలాశయానికి పంపుతున్నారు. ప్రస్తుతం సోమశిల జలాశయంలో 29.34 టియంసిల నీరు వుంది. 11వేల క్యూసెక్కులు నీరు వచ్చి చేరుతోంది. కాని కండలేరుకు ఒక చుక్కనీరు విడుదల కావడం లేదు.

చెన్నయికి తాగునీరు ఇస్తారో లేదో తెలియదు. ఒక వేళ ఇవ్వాలన్నా కండలేరు నింపవలసి వుంది. కండలేరుకు కూడా నీరు వదిలితే తిరుపతి తాగునీటి అవసరాలు తీరడమే కాకుండా వెంకటగిరి, సుళ్ళూరుపేట ప్రాంతాలతో పాటు చిత్తూరు జిల్లాలో శ్రీ కాళహస్తి,‌సత్య వేడు నియోజకవర్గాల్లో రైతులకు రబీలోనైనా సాగునీరు అందివ్వవచ్చు. ఆ సూచనలు ఏ మాత్రం కన్పించడం లేదు. గత ఏడాది కూడా సోమశిలకు కృష్ణ జలాలు 50 టియంసిలు తరలించినా ఆ జిల్లాకు చెందిన ఇద్దరు మంత్రులు ఒకచుక్క కిందకు వదల లేదు. ఈ ఏడు అదే జరగబోతోంది. ప్రస్తుతం కండలేరులో కేవలం 5.67 టియంసిల నీరు మాత్రమే వుంది. ఒక వేపు సోమశిలకు నీరు చేరుతూవుండగా మరో వేపు కండలేరుకు నీరు ఎందుకు విడుదల కావడం లేదో మంత్రి అనిల్ కుమార్ యాదవ్ చెప్ప వలసి వుంది.

మరో వైపు చిత్తూరు జిల్లా తూర్పు ప్రాంతం శాసనసభ్యులు నిమ్మకు నీరెత్తి నట్లు వున్నారు. క్రిష్ణకు వరద వస్తున్న రోజుల్లోనే కండలేరును నీటిలో నింపక పోతే తర్వాత ఇంతే సంగతులు. గతంలో కూడా ఇలాగే జరిగింది. పరిమితంగా చెన్నయ్ నీరు వదలి మార్గమధ్యంలో రైతులకు నీళ్లు వదల లేదు. ఈ సంవత్సరం కృష్ణ నదికి గతంలో లేని విధంగా వరద రోజులు ఎక్కువగా వున్నాయి. రెండవ మారు వరద వచ్చింది. చిత్తూరు జిల్లాకు చెందిన శ్రీకాళహస్తి సత్యవేడు శాసనసభ్యులతో పాటు తిరుపతి శాసనసభ్యుడు చొరవ తీసుకుని వరద వున్న రోజులలోనే కండలేరును నీటితో నింపేందుకు కృషి చేయలసి వుంది. రోజులు గడచి వరద తగ్గుముఖం పడితే కడప కర్నూలు జిల్లాలో రైతుల వత్తిడి ఎక్కువగా వుంటుంది. పైగా నెల్లూరు జిల్లా రైతులు అడ్డుచెప్పే అవకాశం ఉంది.

-వి.శంకరయ్య, విశ్రాంత పాత్రికేయులు, 9848394013

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*