అన్న ప్ర‌సాదం అడ‌గొద్దు..చిన్న ల‌డ్డూనే…!

తిరుమల శ్రీవారికి లడ్డూ మాత్రమేకాదు..ఎన్నో రకాల అన్నప్రసాదాలను నైవేద్యంగా సమర్పిస్తుంటారు. శ్రీవారి లడ్డూలు ఎంత రుచిగా ఉంటాయో….స్వామికి పెట్టే చక్కెర పొంగలి, దద్దోజనం, సీరా, కదంభం, పులిహోరా, మలిహోరా, పాయసం, పోలీ, సుగీ, జిలేబీ…ఇవన్నీ అంతకు మించి రుచిగా ఉంటాయి. నెయ్యి కారుతూ, జీడిపప్పు తేలుతూవుండే శ్రీవారి అన్నప్రసాదం కొద్దిగానైనా ఆరగించాలని ఆశపడతారు భక్తులు. అయితే ఇటీవల కాలంలో అన్నప్రసాదం దొరకడమే అరుదైపోతోంది. దీనికి కారణం ఈ ప్రసాదాల తయారీ అంతకంతకూ తగ్గిపోతూవుండటమే. ప్రస్తుతం సాధారణ రోజుల్లో రోజుకు 900 కిలోలు (200 గంగాళాలు), వారాంతాల్లో రోజుకు 1200 కిలోల (250 గంగాళాలు) ప్రసాదాలు తయారు చేస్తున్నారు.

వకులామాత పోటు, పాకశాల, అవ్వపోటు…అని పిలవడే వంటశాలలోనే దాదాపు 1000 ఏళ్లుగా అన్నప్రసాదాలు తయారవుతున్నాయి. ఇక్కడ సిద్ధమైన ప్రసాదాలను శ్రీవారి గర్భాలయంలోకి తీసెకెళ్లి స్వామికి ఆరగింపుచేస్తారు. ఆపై భక్తులకు పంచిపెడుతుంటారు. వైఖానస వైష్ణవులు అత్యంత నిష్టతో ప్రసాదాలు తయారు చేస్తారు. గంగాళాలకు గంగాళాలు ప్రసాదాలు తయారై వస్తూనేవుంటాయి. రోజులో ఒకటి రెండు గంటలు సమయం మాత్రమే చిన్నలడ్డూలను భక్తులకు ప్రసాదంగా ఇచ్చేవారు. మిగతా సమయమంతా అన్నప్రసాదాలనే పంపిణీ చేసేవారు. ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. ఉదయం నైవేద్యం అయిన తరువాత మధ్యాహ్నం 12 గంటలకల్లా అన్నప్రసాదాలు ఖాళీ అవుతున్నాయి. ఇక మళ్లీ అన్నప్రసాదం దొరకాలంటే రాత్రి గంటదాకా ఆగాల్సిందే. దీనికి కారణం అన్నప్రసాదాల తయారీ గణనీయంగా తగ్గిపోవడమే అని చెబుతున్నారు.

ఒకప్పుడు అన్నప్రసాదాల పోటులో 120 మంచి 150 మంది పనిచేసేవారు. ప్రస్తుతం 60 మంది మాత్రమే ఉన్నారు. ఒక బ్యాచ్‌లో 30 మంది, ఇంకో బ్యాచ్‌లో 30 మంది పని చేస్తున్నారు. ప్రసాదాలు తయారు చేయడమేగాదు…ఆ గంగాళాలను నైవేద్యం కోసం గర్భగుడిలోకి తరలించాలి. ఆరగింపు అయిన తరువాత ప్రసాదాలు పంపిణీ చేసే స్థలానికి తీసుకెళ్లాలి. పనిభారం వల్ల ప్రసాదాల పరిమాణమేకాదు…తయారయ్యే ప్రసాదాల రకాలూ తగ్గిపోయినట్లు చెబుతున్నారు. రమణ దీక్షతులు కూడా ఇదే ఆరోపిస్తున్నారు. స్వామివారికి నివేదించే ప్రసాదాలు తగ్గిపోతున్నాయని ఆయన చెబుతున్నారు.

అన్నప్రసాదాల పోటులో పనిచేస్తున్న ఉద్యోగుల సంఖ్య రానురానూ తగ్గిపోతోంది. ఒకొక్కరుగా రిటైర్‌ అవుతున్నారు. ఆ స్థానంలో ఇంకొరిని నియమించడం లేదు. సీనియర్లు ఉండగానే కొత్తవారిని నియమించి, వారికి శిక్షణ ఇస్తే ప్రసాదాలు ఎలా తయారు చేయాలో నేర్చుకుంటారు. శ్రీవారి అన్నప్రసాదాలను అదే రుచితో తయారుచేయడమంటే ఎంతో అనుభవముంటేగానీ సాధ్యంకాదు. కాంట్రాక్టు పద్ధతిలోనైనా అన్నపోటుకు అవసరమైనంత మందిని నియమించాలని ఆలయంలో పనిచేసే ఉద్యోగులు సూచిస్తున్నారు. అధికారులు దీనిపై దృష్టి పెట్టడం లేదు. లడ్డూలు ఇచ్చేస్తున్నాంకదా… అన్నిప్రసాదాలు తగ్గితే ఏముందిలే అనే భావనతో ఇక్కడ వంటవాళ్ల సంఖ్య పెంచడం గురించి ఉన్నతాధికారులు పెద్దగా పట్టించుకోవడం లేదు.

1 Comment

  1. Om namo venkateshaya

    In this regard, there must be an audit committee promulgated to evala te every activity happening at the temple and necessary revision is made in order to conduct it perfectly.

Leave a Reply

Your email address will not be published.


*