అన్యమత ప్రచారం అంటూ అనవసర రాద్ధాంతం..!

తిరుమలలో ఓ బస్సులో ఇచ్చిన ఆర్‌టిసి బస్సు టికెట్టు వెనుక జరూసలాం యాత్రకు సంబంధించిన ప్రకటన ఉండటం పెద్ద వివాదంగా మారింది. దీన్ని కుట్రపూరితంగా జరుగుతున్న అన్యమత ప్రచారంగా చెబుతూ కొందరు రాద్ధాంతం చేస్తున్నారు. ఈ అంశంపై రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి స్పందించాల్సిన అవసరం ఏర్పడింది. అయినా…ఇంత చిన్న అంశంపై ఇంతటి రాద్ధాంతం అవసరమా అనేది ప్రశ్న.

తిరుమల విషయంలో ప్రతి చిన్న విషయాన్నీ భూతద్దంలో చూపెడుతూ…మత ఉద్రిక్తతలు రెచ్చగొట్టడానికి చాలాకాలంగా ప్రయత్నాలు జరుగుతున్నాయి. వైఎస్‌ రాజశేఖర్‌ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో…ఏడుకొండలను రెండు కొండలకు కుదించేశారన్న ప్రచారం సాగింది. అదేవిధంగా శేషాచలం అడవుల్లో వేరే మతానికి చెందిన ప్రార్థనా మందిరాలు నిర్మించేశారన్న దుష్ప్రచారమూ జరిగింది.

తిరుమల, తిరుపతిలో అన్యమతానికి సంబంధించి ఎలాంటి ప్రచారమూ జరగడం లేదన్న సంగతి స్థానికులకు బాగా తెలుసు. అయితే…దూర ప్రాంతాల వారిలో, తిరుమలలో ఏదో జరిగిపోతోందన్న అభిప్రాయాన్ని వ్యాపింపజేయడానికి ఇటువంటి ప్రచారాలను తరచూ ప్రయత్నిస్తూనే ఉన్నారు. ఇప్పుడూ ఆర్‌టిసి టికెట్ల విషయంలోనూ అటువంటి ప్రయత్నమే జరుగుతోందని చెప్పాలి.

ఆర్‌టిసి టికెట్ల వెనుక వాణిజ్య ప్రకటనలు ముద్రిస్తోంది. ఇందులో భాగంగా గత ప్రభుత్వం ఇచ్చిన ఒక ప్రకటనను ఆర్‌టిసి తన టికెట్ల వెనుక ముద్రించింది. ఇప్పుడు టికెట్లు టిమ్స్‌ మిషన్ల ద్వారా ఇస్తున్నారు. అయితే…దీనికి ఉపయోగించే పేపర్‌ రోల్స్‌లో వెనుకవైపు ముందుగానే ప్రకటనలు ముద్రించబడివుంటాయి. అలాంటి వాటిలో….జరూసలాం యాత్ర ప్రకటన ఉన్న పేపర్‌ రోల్స్‌ తిరుమలకు పొరపాటున వచ్చాయని ఆర్‌టిసి అధికారులు వివరణ ఇచ్చారు. అయినా…ఇదేదో కుట్రపూరితంగా జరుగుతోందన్నట్లు దుష్టశక్తులు ప్రచారం చేస్తున్నాయి.

ఈ ప్రచారం వెనుక…శ్రీవేంకటేశ్వరునిపైన భక్తికంటే, రాజకీయంగా లబ్ధిపొందాలన్న దురాలోచనే కనిపిస్తుంది. ఎవరు అధికారంలో ఉన్నా ఇలాంటి ప్రతి చిన్న అవకాశాన్ని ఉపయోగించుకోవాలని మతతత్వ శక్తులు ప్రయత్నిస్తున్నాయి. ఛైర్మన్ గా నియమితులైన వైవి సుబ్బారెడ్డి విషయంలోనూ ఇలాగే వివాదం సృష్టించే ప్రయత్నం చేశారు. అయితే…మీడియా కూడా సంయమనం పాటించకపోవడమే ఆందోళన కలిగించే అంశం. కారణాలు ఏవైనా…సున్నితమైన అంశాలనూ పెద్దవిగా చూపెడుతున్నారు. వెనుకా ముందూ ఆలోచించడం లేదు.

తమ వ్యతిరేక మీడియా ప్రతి అంశాన్ని మతకోణంలో చూస్తూ ముఖ్యమంత్రి జగన్‌ను ఇబ్బందిపెట్టడానికి ప్రయత్నిస్తున్నాయని దేవాదాయ శాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్‌ తన ప్రకటనలో పేర్కొన్నారు. ఇలాంటి సున్నితమైన అంశాలను రెచ్చగొట్టడం ద్వారా రాష్ట్రంలో శాంతిభద్రతల సమస్య సృష్టించానికి ప్రయత్నిస్తున్నారని కూడా ఆయన అభిప్రాయపడ్డారు. తిరుమల ప్రతిష్టను దెబ్బతీయడానికి కుట్రచేస్తున్న వారిపైన చట్టపరమైన చర్యలు తీసుకుంటామని ప్రకటించారు. ఏదిఏమైనా…టికెట్టు వివాదంపై ప్రభుత్వం, ఆర్‌టిసి సత్వరమే స్పంచాయి. వివాదానికి తెరదించడం అభినందనీయం.

  • ఆదిమూలం శేఖర్‌, తిరుపతి

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*