అమరావతిలోకి ప్రవేశించడానికి వీసా కావాలా..!!

అమరావతిని రాజధానిగా కొనసాగించాలంటూ అక్కడి రైతులు ఆందోళనలు చేస్తున్నారు. మూడు వందల రోజులకుపైగా ధర్నాలు, రాస్తారోకోలు, ప్రదర్శనలు జరుగుతున్నా ఎటువంటి ఆటంకం, అభ్యంతరం లేకుండా సాగిపోతున్నాయి. ఇదే సమయంలో మూడు రాజధానులను సమర్ధించేవారు ఇదే అమరావతిలోని ఆందోళనకు పూనుకుంటే అక్కడివారు అడ్డుకున్నారు. ట్రాక్టర్లతో తొక్కిస్తామని బెదిరిస్తున్నారు. ఇదెక్కడి ప్రజాస్వామ్యం..?

రాజధానిలో ఆందోళనలు చేపట్టే హక్కు ఎవరికైనా ఉంటుంది. పోలీసుల వద్ద అవసరమైన అనుమతులు తీసుకుని ఆందోళనలు చేసుకోవచ్చు. ఏదైనా ఇబ్బందులు ఉంటే పోలీసులే అనుమతులు నిరాకరిస్తారు. అనుమతులు లేకుండా నిరసన కార్యక్రమాలు చేపడితే పోలీసులు అడ్డుకుంటారు. పోలీసులు అనుమతించినా మూడు రాజధానులను సమర్ధించే వారిని… రాజధాని రైతుల పేరుతో ఆందోళనలు చేస్తున్నవారు అడ్డుకుంటున్నారు. బెదిరిస్తున్నారు. స్థానికేతరులు ఇక్కడెలా ఆందోళనలు చేస్తారంటూ ప్రశ్నిస్తున్నారు.

ఇటువంటి ధోరణి గురించే ప్రజలు ఆందోళన చెందుతోంది. రాజధాని ప్రాంతంలో 50 వేల మందికి ఇంటి స్థలాలు ఇవ్వాలని ప్రభుత్వం సంకల్పిస్తే….దాన్ని న్యాయస్థానాల ద్వారా అడ్డుకున్నారు. స్థానికేతరులకు రాజధాని ప్రాంతంలో ఇంటి స్థలాలు ఇవ్వకూడదని వాదిస్తున్నారు. ఇప్పుడు రాజధానిలో తాముతప్ప ఇతరులెవరూ ఆందోళనలు కూడా చేయకూడదన్న తీరుగా వ్యవహరిస్తున్నారు. ఈ ధోరణిని ఒకవర్గం మీడియా కూడా సమర్ధించడం విషాదం. కార్పొరేట్‌ సంస్థలకు, బడా వ్యాపారవేత్తలకు వందల ఎకరాల భూములను ఇచ్చినపుడు ఎవరూ అభ్యంతరం చెప్పలేదుగానీ….పేదకు స్థలాలు ఇస్తామంటే మాత్రం ఆటంకాలు సృష్టిస్తున్నారు.

మూడు రాజధానుల ఉద్యమానికి ఆందోళనకారులను ఆటోల్లో తరలిరావడాన్ని తప్పుబడుతూ రాసింది ఓ పత్రిక. మరి అమరావతి ఉద్యమానికి ఎవరూ తరలించకుండానే, ఎవరూ ఆర్గనైజ్‌ చేయకుండానే ఉద్యమం సాగుతోందా..? ఇటువంటి వివచక్షాపూరిత వార్తలెందుకు..?

300 రోజులుగా అమరావతి సమర్ధకులు ఆందోళనలు చేస్తున్నా ఏఒక్కరూ అడ్డకోలేదు. ఆటంకాలు సృష్టించలేదు. మూడు రాజధానులను సమర్ధించేవారిని ఆందోళనలు ప్రారంభించిన మొదటి రోజే అడ్డుకోవడం గమనార్హం. మా ప్రాంతానికి ఎలా వస్తారంటూ బెదిరించడం చూస్తే….అమరావతి ప్రాంతానికి రావాలంటే వీసా అవసరమేమో అనే భావన ఇతర ప్రాంతాల వారికి కలుగుతుంది. ఇది అమరావతి ఉద్యమానికి మంచిది కాదు.

ఈ పరిస్థితుల్లో అమరావతి రైతుల ఆందోళనకు ఇతర ప్రాంతాలవారి మద్దతు ఎలా లభిస్తుందన్నది ప్రశ్న. మూడు రాజధానులకు మద్దతుగా ఆందోళనలు చేపడితే…తమ ఉద్యమం (అమరావతి అనుకూల) నీరుగారిపోతుందన్న భయం వారిలో ఉండొచ్చు. నిజంగానే అమరావతి రాజధానిపై ప్రజల్లో సెంటిమెంటు ఉంటే అంతగా భయపడాల్సిన పనిలేదు. మూడు రాజధానులను సమర్ధించేవారిని అడ్డుకుంటే…అది ఘర్షణకు దారితీసే ప్రమాదం ఉంది. ఇప్పటికైనా అమరావతి రైతులు తమ ధోరణిని మార్చుకోవాలి. మూడు రాజధానులను సమర్ధించే వారికీ తమలాగే ప్రజాస్వామ్యయుతంగా ఆందోళనలు చేపట్టే హక్కు ఉందనే విషయాన్ని గుర్తించాలి.

– ఆదిమూలం శేఖర్‌, సంపాదకులు, ఎడిటర్‌

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*