అమరావతిలో ప్రతిష్ఠించేందుకు శ్రీవారి విగ్రహం – శాస్త్రోక్తంగా ‘శిలా సంగ్రహణం’

రాష్ట్ర రాజధాని అమరావతిలో నిర్మిస్తున్న శ్రీవారి ఆలయంలో ప్రతిష్ఠించేందుకు గాను స్వామివారి విగ్రహం తయారీ పనులకు గురువారం జ‌రిగిన శిలా సంగ్ర‌హ‌ణం కార్య‌క్ర‌మంలో టిటిడి ధర్మకర్తల మండలి అధ్యక్షులు శ్రీవైవి.సుబ్బారెడ్డి ప్రత్యేక పూజలు నిర్వహించారు. తిరుపతి సమీపంలోని రాయలచెరువు రోడ్‌లో గల రామాపురం గ్రామం వద్ద శాస్త్రోక్తంగా ఈ కార్యక్రమం జ‌రిగింది.

ఈ సందర్భంగా ఛైర్మన్‌ మాట్లాడుతూ శ్రీవారి మూలమూర్తితోపాటు వకుళాదేవి, గరుడాళ్వార్‌, ద్వారపాలకులు, విష్వక్సేనులవారి విగహ్రాలను 18 మంది శిల్పులు కలిసి 6 నెలల వ్యవధిలో పూర్తి చేస్తారని తెలిపారు. 6 అడుగుల 2 అంగుళాల ఎత్తుతో శ్రీవారి విగ్రహాన్ని రూపొందిస్తున్నారని వెల్లడించారు. ఇటీవల అమరావతిలోని శ్రీవారి ఆలయ నిర్మాణ ప్రదేశాన్ని పరిశీలించానని, ఆలయాన్ని నిర్దేశిత గడువులోపు పూర్తి చేసేందుకు ప్రణాళికలు రూపొందిస్తున్నామని తెలిపారు. ఆంధ్రప్రదేశ్‌తోపాటు ఇతర రాష్ట్రాల్లో శ్రీవారి భక్తులు ఎక్కువగా ఉండే దళితవాడలు, బిసి కాలనీల్లో శ్రీవారి ఆలయాలు నిర్మించేందుకు చర్యలు చేపడతామన్నారు.

శిల సంగ్రహణంలో భాగంగా ముందుగా పంచగవ్యంతో శిలను శుద్ధి చేసి వాస్తుహోమం, పరిహరణ, మహాశాంతిహోమం, అభిషేకం, హోమాలు, మహాపూర్ణాహుతి నిర్వహించారు. వేదమంత్రాలతో శిలను చెక్కడం ప్రారంభించారు. ఈ సందర్భంగా శిల్పులు శ్రీ రాజేంద్రాచారి,  శ్రీ వేంకటేశాచారిని టిటిడి ఛైర్మన్‌ శాలువ, వస్త్రాలతో సన్మానించారు. అనంతరం భక్తులకు ప్రసాదాలు పంపిణీ చేశారు. ఆ త‌రువాత తిరుచానూరులో నూత‌నంగా నిర్మించిన శ్రీ ప‌ద్మావ‌తి నిల‌యం యాత్రికుల వ‌స‌తి స‌ముదాయాన్ని ఛైర్మ‌న్ ప‌రిశీలించారు.

ఈ కార్యక్రమంలో చంద్రగిరి ఎమ్మెల్యే డా.. చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి, టిటిడి వైఖానస ఆగమ సలహాదారులు శ్రీ ఎన్‌ఎకె.సుందరవరదన్‌, ఎన్‌వి.మోహన రంగాచార్యులు, చీఫ్‌ ఇంజినీర్‌ శ్రీ చంద్రశేఖర్‌రెడ్డి, అదనపు సివిఎస్‌వో శ్రీ శివకుమార్‌రెడ్డి, ఎస్‌ఇ శ్రీ రాములు, డెప్యూటీ ఈఓ శ్రీ విశ్వనాథం ఇతర అధికారులు పాల్గొన్నారు.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*