అమరావతి ఉద్యమానికి తెరపడనుందా…! రెండు కీలక పరిణామాలు..!!

అమరావతి కేంద్రంగా జరుగుతున్న ఉద్యమానికి తెరపడే దిశగా కీలక పరిణామాలు చోటు చేసుకున్నాయి. ఇందులో ఢిల్లీ కేంద్రంగా ఒకటి, అమరావతి కేంద్రంగా ఒకటి జరిగాయి. అమరావతి రైతులు కొందరు 4వ తేదీన ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డిని కలిశారు. తమ భూములు తమకు తిరిగి ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. సిఆర్‌డిఏ చట్టాన్ని రద్దు చేయాలని, భూసమీకరణ కోసం ఇచ్చిన నోటిఫికేసన్‌ రద్దు చేయాలని కోరారు. తమ భూములను అమ్ముకోడానికి, బ్యాంకుల నుంచి రుణాలు తీసుకోడానికి వీలుగా ఈ చర్యలు చేపట్టాలని ప్రభుత్వానికి విన్నవించుకున్నారు. అదేవిధంగా వ్యవసాయ కూలీలకు ఇప్పటిదాకా ఇస్తున్న రూ.2500 పెన్షన్‌ను రూ.5 వేలకు పెంచడంపై హర్షం వ్యక్తం చేశారు.

ఇది అత్యంత కీలకమైన పరిణామంగా చెప్పాలి. రాష్ట్ర ప్రభుత్వం మూడు రాజధానుల ఆలోచనను బయటపెట్టినప్పటి నుంచి, అమరావతినే ఏకైక రాజధానిగా కొనసాగించాలంటూ….రాజధాని కోసం భూములు ఇచ్చిన 29 గ్రామాలకు చెందిన రైతులు ఆందోళన చేస్తున్నారు. ప్రభుత్వం కౌలు 15 ఏళ్లు ఇస్తామని ప్రకటించినా, వ్యవసాయ కూలీల పెన్షన్‌ పెంచినా ఆందోళన కొనసాగిస్తూనే ఉన్నారు. తమ ఉద్యమానికి మద్దతు ఇవ్వమని కేంద్ర ప్రభుత్వ పెద్దలను కలిసేందుకు కొందరు రైతులు ఢిల్లీకి వెళ్లిన రోజునే….ఇక్కడ రైతులు, వ్యవసాయ కూలీలు ముఖ్యమంత్రిని కలిశారు.  అమరావతి ఉద్యమం మొదలయ్యాక రైతులు ప్రభుత్వాన్ని కలవడం ఇదే తొలిసారి.

ఇక ఢిల్లీ కేంద్రంగా జరిగిన మరో కీలక పరిణామం ఏమంటే….మూడు రాజధానులకు సంబంధించి టిడిపి ఎంపి గల్లా జయదేవ్‌ అడిగిన ప్రశ్నకు సమాధానంగా కేంద్రం లిఖితపూర్వక సమాధానం ఇస్తూ…..రాజధాని ఎక్కడో నిర్ణయించునే స్వేచ్ఛ రాష్ట్ర ప్రభుత్వానికి ఉంటుందని తేల్చి చెప్పింది. అదేవిధంగా 2015లో రాష్ట్రం జారీ చేసిన ఓ జీవోలో అమరావతిని రాజధానిగా నోటిఫై చేశారని పేర్కొన్నారు. మూడు రాజధానులు ఏర్పాటవుతున్నట్లు మీడియా కథనాల ద్వారా తెలిసిందని పేర్కొన్నారు. దీనిద్వారా రాజధాని విషయంలో కేంద్రం జోక్యం చేసుకోబోదని తేల్చేసింది.

ఈ రెండు పరిణామాలు అమరావతిలో జరుగుతున్న ఉద్యమానికి పెద్ద దెబ్బే అని చెప్పాలి. ఉద్యమం క్రమేపీ నిరుగారే సూచనలు కనిపిస్తున్నాయి. రాజధాని వికేంద్రీకరణ విషయంలో రాష్ట్ర ప్రభుత్వం దృఢంగా ముందుకే సాగుతోంది. వెనకడుగు వేసే సంకేతాలు ఎక్కడా కనిపించడం లేదు. ఇది  ఎప్పుడో అర్థమైనా కేంద్రం మీద ఆశతో ఉద్యమాన్ని కొనసాగిస్తున్నారు. మరోవైపు రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన చర్యలు చిన్నపాటి రైతులు, వ్యవసాయ కూలీలు సంతృప్తి చెందినట్లు అనిపిస్తోంది. భూములను వెనక్కి తీసుకుంటే మేలన్న భావనకు వచ్చినట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలోనే రైతులు ముఖ్యమంత్రిని కలిశారు. ఈ పరిణామాలను గమనిస్తున్న పరిశీలకులు….అమరావతి ఉద్యమానికి క్రమేపీ తెరపడుతుందని అంచనా వేస్తున్నారు.

– ధర్మచక్రం ప్రతినిధి 

1 Comment

Leave a Reply

Your email address will not be published.


*