‘అమ్మా…జయలలితా..’ చూశావా…నీభక్తుల నిజరూపం!

తమిళనాడు ఒకప్పటి ముఖ్యమంత్రి, అన్నాడిఎంకే అధినేత్రి జయలలిత అంటే అ పార్టీ నేతలకు, కార్యకర్తలకు దేవతో సమానం. ఆమె ఎదుట ఎవరూ కూర్చోరు. ఆమె ముఖంలో ముఖం పెట్టి చూడలేరు. ఆమెను చూడగానే ఎంత పెద్ద నేతకైనా…వెన్ను ఒంగిపోతుంది. జయకు సాష్టాంగ నమస్కారం చేసిన మంత్రులు, ఎంఎల్‌ఏలు కోకొల్లలు. జయలలిత అంటే భయం, భక్తి రెండూ మెండుగా ఉండేవి. దేశంలోనే ఈ విధంగా తమ అధినేత పట్ల భయభక్తులు ప్రదర్శించిన నాయకులు, కార్యకర్తలు దేశంలో లేరు. జయలలితను చూస్తే దేశంలోని మిగతా పార్టీల నేతలకూ అసూయే. నాయకులు ఆమె పట్ల ఎంత విధేయత చూపుతున్నారు, ఎంత ప్రమాభిమానాలు ప్రదర్శిస్తున్నారు అనుకునేవారు.

ఎరుదురుగా మనషి ఉన్నప్పుడు ఒకరకంగానూ, లేనపుడు ఒకరకంగానూ ఉంటుంది మనుషుల ప్రవర్తన. జయలలిత విషయంలో ఆమె పరోక్షంగానూ వ్యతిరేక వ్యాఖ్యలు చేయడానికి ఎవరూ సాహసించేవారు కాదు. ఇలాంటిది…చనిపోయిన ఆమె సమాధి నుంచి ఎక్కడ రాగలదులే…అనే ధైర్యమో ఏమోగానీ, ‘ఓం క్లీం’ అంటూ కీర్తించిన అమ్మ గురించే వ్యతిరేకంగా మాట్లాడుతున్నారు. పళనిస్వామి మంత్రివర్గంలోని అటవీ శాఖ మంత్రి దిండుగళ్‌ శ్రీనివాస్‌ ఓ కార్యక్రమంలో మాట్లాడుతూ…’పళనిస్వామి ప్రభుత్వం అమ్మ ప్రభుత్వం కంటే అద్భుతంగా పని చేస్తోంది. ప్రజలు ఆయన్ను సులభంగా కలవగలుగుతున్నారు’ అంటూ కీర్తించారు. మరో మంత్రి డి.విజయకుమార్‌ కూడా ఈ వ్యాఖ్యలను సమర్థిస్తున్నారు.

పళని స్వామి ప్రభుత్వంలోని మంత్రులు మెల్లగా జయలలితకు వ్యతిరేకంగా మాట్లాడటం మొదలుపెట్టారు. దీనికి కారణం లేకపోలేదు. జయలలిత పేరును దినకరన్‌, శశికళ వంటివాళ్లు వాడుకుంటున్నారు. ఇంకా ఆమె పేరును తాముకూడా వాడుకోవడం వల్ల లాభం లేదని బిజెపి కనుసన్నల్లో పళని స్వామి భావిస్తుస్తారు. ప్రస్తుత ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి, మంత్రులంతా వచ్చే ఎన్నికల నాటికి బిజెపితో కలిసి పని చేయాల్సిన అవసరం రావచ్చు. అందుకే మెల్లగా ఇప్పటి నుంచి జయలలితను తక్కువ చేసి మాట్లాడటం మొదలుపెట్టారు. జయ కంటే తామే బాగా పరిపాలిస్తున్నామని చెప్పుకుంటున్నారు. రాబోయే కాలంలో జయలలితపైన ఇతరత్రా ఆరోపణలూ వెల్లువెత్తే అవకాశం లేకపోలేదు. ఇవన్నీ చూసి ‘అమ్మా…చూశావా, నీ భక్తుల నిజస్వరూపం’ అని జయలలిత నిజమైన అభిమనులు ఆవేదన చెందుతున్నారు.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*