అయ్యప్ప ఆలయంలోకి వెళ్లే అర్హత మగాళ్లకు మాత్రం ఎలావుంటుంది..?

వయసుతో ప్రమేయం లేకుండా అన్ని వయసుల్లోని మహిళలు శబరిబల అప్పయ్య స్వామి ఆలయంలోకి వెళ్లవచ్చని దేశ అత్యున్నత న్యాయస్థానం తీర్పునిచ్చింది. దీనిపై కొందరు హర్షం వ్యక్తం చేస్తుండగా కొందరు నానారాద్ధాంతం చేస్తున్నారు. దేవుడి దర్శనంలో లింగ వివక్ష పాటించడం అధర్మమంటున్నారు తీర్పును ఆహ్వానిస్తున్నవారు. చట్టాల కోణంలో సనాతన సంప్రదాయాలను ఎలా చూస్తారంటూ ప్రశ్నిస్తున్నారు తీర్పుపై విభేదించేవాళ్లు. మహిళలను ఆలయంలోకి రానివ్వకపోవడం వివక్ష అని కొందరు అంటుంటే…ఇది భారతదేశ వైవిధ్యతలో భాగమని ఇంకొందరు వాదిస్తున్నారు.

ఇన్నాళ్లు అయ్యప్ప ఆలయంలోకి మహిళలను అనుమతించకపోవడానికి ప్రధాన కారణం…ఆయన బ్రహ్మచారి అని, అందుకే మహిళలను ఆయన వద్దకు వెళ్లడానికి వీల్లేదని సనాతనవాదులు చెబుతున్నారు. నెలనెలావుండే బహిష్ట వల్ల మహిళలు ఆలయంలోకి వెళ్లకూడదని, ముట్టు నిలిచిన మహిళలైతే వెళ్లవచ్చని చెబుతున్నారు.

రుతుస్రావం అనేది మహిళలకు అత్యంత సహజమైనది. నోటిలో లాలాజలం ఊరడం, శరీరంపై చమట పట్టడం ఎంత సహజమో…ఇదే అంతే సహజమైన శారీరక ధర్మం. అటువంటి సహజ ధర్మం స్వామివారి దర్శనానికి ఎలా ఆటంకమవుతుంది? ఆయన బ్రహ్మచారి కావడం వల్ల మహిళలు వెళ్లకూడదని చెప్పేవారికి ఒక ప్రశ్న. పురుషులంతా బ్రహ్మచర్యం పాటిస్తున్నారా? మహిళలతో కలిసి సృష్టికార్యంలో పాల్గొనడం లేదా? మరి ఆ అంటుముట్లు పురుషులకు అంటవా? అలా అంటినవారి స్వామి దర్శనం చేసుకోగా లేని తప్పు…మహిళలు చేసుకుంటే వస్తుందా? అయ్యప్ప బ్రహ్మచారి కాబట్టి…బ్రహ్మచారులే దర్శనానికి వెళ్లాలంటే ఒక అర్థముంటుంది. వివాహితులైనా సరే పురుషులు వెళ్లవవచ్చు. అవివాహితులైనా సరే మహిళలు వెళ్లకూడదనడంలో అర్థముందా?

ఇక్కడే తిరుమలకు సంబంధించిన ఒక అంశాన్ని చర్చించాలి. తిరుమల కళ్యాణకట్టలో వందల ఏళ్ల నుంచి పురుష క్షురకులే ఉన్నారు. స్త్రీలను క్షురకులుగా నియమించలేదు. స్త్రీలలో అంటుముట్లు ఉంటాయని, అటువంటి సమయంలో తలనీలాలు సేకరించ కూడదని….కారణాలు చెబుతూ వచ్చారు. ఆఖరికి పోరాటం ద్వారా మహిళలు క్షరకర్మ చేసే భాగ్యాన్ని దక్కించుకున్నారు. ఒక విధంగా చెప్పాలంటే…ఇదే ఇప్పుడు సౌకర్యవంతంగా ఉంది. ఒకప్పుడు మహిళా భక్తులకూ పురుషులే తలనీలాలు తీసేవారు. ఇప్పుడు మహిళలకు మహిళా క్షురకులు క్షురకర్మ చేస్తున్నారు. తిరుమల ఆలయంలో వచ్చిన మార్పు…అయ్యప్ప ఆలయంలో వస్తే తప్పవుతుందా?

సనాతన ఆచారాలన్నీ భారతీయ వైవిధ్యతకు నిదర్శనంగా చూడాలంటే….ఏ దురాచారాన్నీ రూపుమాపివుండలేం. సతీసహగమనం ఒకప్పుడు ఆచారంగా ఉండేది. భర్త చనిపోతే… భార్య కూడా చితిలో దూకి చనిపోవాలనేది సంప్రదాయం. అది భారతీయ వైవిధ్యతకు ఒక రూపం అవుతుందా? మహిళలను, దళితులను, శూద్రులను, బహుజనులను చదువుకు దూరం చేసిన ఆచారం ఉండేది. అదీ భారతీయ వైవిధ్యమే అనుకోవాలా? ఇప్పటికీ చాలా ఆలయాల్లోకి దళితులను రానివ్వడం లేదు. దళితులు వస్తే ఆలయాలు మైలుపడతాయని వాదిస్తున్న ఛాందసులున్నారు. ఇదీ భారతీయ వైవిధ్యతలో భాగమే అని సరిపెట్టుకోవాలా?

అందుకే ఆచారాల పేరుతో, వైవిధ్యం సాకుతో దురాచారాలను, అహేతుక సంప్రదాయాలను అనుమతించడం మానవ హక్కులకు భంగమే కాదు….ఆధ్యాత్మిక కోణంలో అధర్మమూ అవుతుంది. ఇటువంటి చర్యలను అయ్యప్ప అయినా, శ్రీవేంకటేశ్వరుడైనా ఆమోదించరు. అయ్యప్ప ఆలయంలోకి మహిళల ప్రవేశానికి అనుమతిస్తూ సుప్రీం కోర్టు ఇచ్చిన తీర్పును అందరూ ఆహ్వానించాలి. దేశంలో ఇంకా ఇటువంటి ఆలయాలు ఎక్కడైనా ఉంటే…అక్కడా ఇదే తీర్పు ఆసరాగా మహిళలకు ఆలయ ప్రవేశం కల్పించాలి.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*