అర్చకులందు ప్రధాన అర్చకుని మనవడు వేరయా…!

టిటిడిలో పలుకుబడి ఉంటే ఏదైనా సాధ్యమే అనేందుకు ఉదాహరణ ఈ ఉదంతం. ఉన్నతాధికారులను ప్రసన్నం చేసుకోగల శక్తివుంటే చాలు….కోరిన కోరికలు తీరిపోతాయి. ఓ అర్చకుని బదిలీనే ఇందుకు నిదర్శనం.

టిటిడికి అనుబంధంగా దేశ వ్యాపితంగా అనేక ఆలయాలు, సమాచార కేంద్రాలున్నాయి. వీటిల్లో పని చేయడానికి అర్చకులు, పరిచారకులు, వేదపారాయణదార్లు, పోటు వర్కర్లు, ప్రసాదం పంపిణీదారులు, వాయిద్య కళాకారులు…మొత్తం 291 మందిని కాంట్రాక్టు పద్ధతిలో తీసుకున్నారు. వీరందరినీ శ్రీపద్మావతి శ్రీనివాస సేవా సమితి పేరుతో ఒక సొసైటీగా ఏర్పాటు చేసి, ఆ సొసైటీ ద్వారా వేతనాలు చెల్లిస్తూ వచ్చారు.

ఢిల్లీ, ముంబయి, చెన్నై, బెంగుళూరు, విజయవాడ….ఇలా ఎక్కడెక్కడో పని చేస్తున్న అందరినీ ఒక సొసైటీలోనే ఉంచడంతో వేతనాల చెల్లింపులో తలెత్తిన ఇబ్బందిని దృష్టిలో ఉంచుకుని, పోలా భాస్కర్‌ జెఈవోగా ఉన్న సమయంలో ఆయా ప్రాంతాల్లోని వారికి వేర్వేరు సొసైటీలు ఏర్పాటు చేసి, సొసైటీల ద్వారా వేతనాలు చెల్లిస్తూ వచ్చారు.

దేశ వ్యాపితంగా ఎక్కడెక్కడో పని చేస్తున్న ఈ అర్చకులు, పరిచారకులు తదితర సిబ్బంది తమను తిరుపతికి బదిలీ చేయమని అనేక పర్యాయాలు టిటిడి ఉన్నతాధికారులకు విన్నవించుకున్నారు. అయితే….అందరూ తిరుపతికి రావాలని కోరుకోవడంతో టిటిడి ఒక నిర్ణయం తీసుకుంది. ఎక్కడ పనిచేస్తున్న వారు అక్కడే పని చేయాలని, ఒక సొసైటీ నుంచి మరో సొసైటీ పరిధిలోకి మార్చడం సాధ్యం కాదని అధికారులు తేల్చేశారు.

ఇప్పుడు సమస్య ఏమంటే….నగరి సమీపంలోని సత్రవాడ ఆలయంలో పని చేస్తున్న ఓ అర్చకున్ని శ్రీనివాస మంగాపురం పరిధిలోకి బదిలీ చేశారు. అయితే ఆయనకు అధికారికంగా ఎటువంటి ఉత్వర్వులూ ఇవ్వలేదు. ఉన్నతాధికారుల నోటి మాటతో శ్రీనివాసమంగాపురానికి తీసుకొచ్చారు.

టిటిడి నిబంధనలకు విరుద్ధంగా బదిలీపై వచ్చిన సదరు అర్చకుడు శ్రీవారి ఆలయ ప్రధాన అర్చకుల్లో ఒకరికి మనవడు అవుతారని, అందుకే ఆయనకు నిబంధనల్లో సడలింపు ఇచ్చారని మిగతా అర్చకులు చెబుతున్నారు.

ఈవిధంగా బదిలీ చేయడం వల్ల వేతన చెల్లింపులోనూ ఇబ్బంది తలెత్తినట్లు తెలుస్తోంది. అధికారిక ఉత్తర్వులు లేనిదే శ్రీనివాస మంగాపురం సొసైటీల్లో సదరు అర్చకున్ని చేర్చుకోవడం సాధ్యం కాదని, ఈ పరిస్థితుల్లో వేతనం చెల్లించడమూ సాధ్యం కాదని అర్చకులు చెబుతున్నారు. ఈ సమస్యవల్లే రెండు నెలలుగా ఆ అర్చకునికి వేతనం చెల్లించలేదని అంటున్నారు.

ఏదిఏమైనా పలుకుబడి కలిగిన వారిని ఒక విధంగా, పలుకుబడి లేనివారిని ఇంకో విధంగా చూడటం టిటిడి వంటి ధార్మిక సంస్థలో ధర్మం కాదని అర్చకులు అంటున్నారు. కాంట్రాక్టు సిబ్బందికీ బదిలీలుంటే…దానికి ఒక విధానాన్ని రూపొందించి అందరినీ బదిలీ చేయాలని, అంతేతప్పు పలకుబడి కలిగిన వారిని మాత్రం కోరుకున్న చోటికి వేయడం ధర్మం కాదని అర్చకులు, ఇతర సిబ్బంది ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

-ధర్మచక్రం ప్రతినిధి, తిరుపతి

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*