అలక వీడిన అరుణ…మళ్లీ గల్లాకే చంద్రగిరి టికెట్టు!

గల్లా అరుణకుమారి తాను తెలుగుదేశం పార్టీని వీడేది లేదని, ఎట్టిపరిస్థి తుల్లోనూ వైసీపీలో చేరబోనని ప్రకటించారు. గత కొంతకాలంగా పార్టీ పట్ల కినుక వహించిన ఆమె మౌనం మౌనం వీడి మీడియాతో మాట్లాడారు.

చంద్రగిరి నియోజకవర్గం నుంచి నాలుగుసార్లు కాంగ్రెస్‌ తరపున గెలిచిన ఆమె….గత ఎన్నికల సమయంలో, విధిలేని పరిస్థితుల్లో టిడిపిలో చేరారు. వైసిపి అభ్యర్థి చెవిరెడ్డి భాస్కర్‌ రెడ్డిపై పోటీచేసి ఓటమిపాలయ్యారు. గత లోక్‌సభ ఎన్నికల్లోనే రాజకీయ రంగప్రవేశం చేసిన ఆమె తనయుడు గల్లా జయదేవ్‌ గుంటూరు నుంచి లోక్‌సభకు టిడిపి తరపున ఎన్నికయ్యారు. వచ్చే ఎన్నికల్లో చంద్రగిరి నుంచి చంద్రబాబు తనయుడు లోకేష్‌ పోటీ చేస్తారని, అరుణ కుమారిని పలమనేరుకు వెళ్లమని చెప్పినట్లు వార్తలొచ్చాయి. చంద్రగిరి నుంచి ఆరు పర్యాయాలు పోటీ చేసి నాలుగు సార్లు గెలుపుపొందిన ఆమెకు ఇక్కడ బలమైన అనుచర గణం ఉంది. కులాలతో సంబంధం లేకుండా ఊరూరా ఆమె మద్దతుదా రులున్నారు. ఆమె ఎటువెళితే అటు గుడ్డిగా వెళ్లేంతగా అభిమానించే కార్యకర్తలున్నారు. ఇలాంటి నియోజకవర్గాన్ని వదులుకున్ని, పలమనేరుకు వెళ్లడం ఇబ్బందే.

గత ఎన్నికల్లో ఓటమి పాలైనప్పటి నుంచి ఆమె కాస్త నిరాశ చెందారు. అయినా ఎంఎల్‌సిగానైనా ఎన్నికై, మంత్రి పదవి చేపట్టాలన్నది ఆమె లక్ష్యం. ఎంఎల్‌సి ఎన్నికల్లో ఎవరెవరికో సీట్లు ఇచ్చారుగానీ అరుణకు ఇవ్వలేదు. ఇటీవల గాలి ముద్దుక్రిష్ణమ నాయుడు ఎంఎల్‌సిగా ఉంటూ అనారోగ్యంతో మరణించారు. ఇప్పుడు మళ్లీ ఆ స్థానానికి ఎన్నికలు జరుగుతున్నాయి. ఈసారైనా తనకు ఎంఎల్‌సి సీటు ఇస్తారని గల్లా ఆశపెట్టుకున్నారు. అయితే…గాలి కుటుంబంలోని ఒకరికి ఇవ్వాలని ముఖ్యమంత్రి నిర్ణయించారు. ముద్దుక్రిష్ణమ ఇద్దరు కుమారులు ఇద్దరూ పోటీ పడటంతో…ఆఖరికి ఆయన సతీమణికి సీటు ఖరారు చేశారు. వాస్తవంగా స్థానిక సంస్థల్లో టిడిపికి ఎక్కువ ఓట్లు ఉన్నాయి. అందుకే ముద్దుక్రిష్ణమ నాయుడు ఎన్నికైనపుడు కూడా వైసిపి అభ్యర్థిని దించలేదు. దీంతో ఎన్నిక ఏకగ్రీవం అయింది. ఇప్పుడు కూడా అదే పరిస్థితి. వైసిపి అభ్యర్థిని పెట్టడం లేదు. అంటే ఏకగ్రీవం అవుతుంది. సీటు ఇచ్చివుంటే….గల్లా ఎంఎల్‌సి అయిపోయేవారు. వచ్చే ఎన్నికలతో సంబంధం లేకుండా ఆమె చట్టసభల్లో ఉండేవారు. 2019 ఎన్నికల్లో టిడిపి గెలిచి అధికారంలోకి వస్తే…మంత్రి పదవి గ్యారెంటీ అయ్యేది. అటు చంద్రగిరి ఎంఎల్‌ఏ టికెట్టు ఇవ్వకుండా, ఇటు ఎంఎల్‌సి పదవి ఇవ్వకుండా…ఎక్కడికో పలమనేరుకు వెళ్లడ ఏమిటి…? అనేది గల్లా అరుణ ప్రశ్న. ఈ నేపథ్యంలోనే ఆమె అలకబూని, తనను చంద్రగిరి నియోజకవర్గ బాధ్యతల నుంచి కూడా తప్పించమని ముఖ్యమంత్రిని కోరారు. ఆ తరువాత విదేశాలకు వెళ్ళిపోయారు. పార్టీ పట్ల కినుక వహించడం వల్లే ఆమె విదేశాలకు వెళ్లిపోయారని ప్రచారం జరిగింది. అదేవిధంగా వచ్చే ఎన్నికల్లో వైసీపీ తరఫున పోటీ చేస్తారన్న వార్తలు వచ్చాయి. ఇదిలా ఉండగా ఆమె అనుచరులు గల్లా అరుణకుమారి నాయకత్వమే చంద్రగిరి నియోజకవర్గానికి అవసరమని సమావేశాలు నిర్వహించి ప్రకటించారు. మరోవైపు అరుణకుమారి తనయుడు గల్లా జయదేవ్ ఎంపీగా టీడీపీలో కీలక పాత్ర పోషిస్తున్నారు. పార్టీ ఆమెను ఎలా సముదాయించాలో గాని వారం రోజుల క్రితం విదేశాలను చూసిన ఆమె చాలాకాలం తర్వాత మీడియాతో మాట్లాడారు. టిడిపిని వీడేది లేదని ప్రకటించారు. చంద్రగిరి ఇన్చార్జిగా తననే కొనసాగాల్సిందిగా ముఖ్యమంత్రి కోరారని వెల్లడించారు. ఈ పరిణామాలన్నీ చూస్తుంటే 2019 ఎన్నికల్లో చంద్రగిరి టిడిపి అభ్యర్ధి గల్లా అరుణకుమారేనని స్పష్టమవుతోంది. ఈమేరకు పార్టీ అధినేత భరోసా ఇవ్వడం వల్లే గల్లా అరుణకుమారి అలక వీడి క్రియాశీలకంగా వ్యవహరించేందుకు సిద్ధమయ్యారని పరిశీలకులు అంటున్నారు.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*