అలాగైతే…అధికారుల ‘చేతులు’ తీసేయాల్సిందే…!

ఇది చాలా ఆసక్తి కలిగించే వార్త. సరదాగా, వింతగా అనిపించిన వార్త. ఎన్నికల కోడ్‌ అమల్లోకి వచ్చినందున ప్రభుత్వ కార్యాలయాల్లో ఫ్యాన్లు తొలగించాలని టిడిపి నాయకులు అధికారులకు విన్నవించారు. ఫ్యాను వైసిపి గుర్తు అనేది అందరికీ తెలిసిందే. ఫ్యాన్లు ఆఫీసుల్లో ఉంటే…అది కోడ్‌ ఉల్లంఘన కిందకు వస్తుందని, వెంటనే వాటిని తొలగించాలని టిడిపి నాయకులు కోరారు.

కాంగ్రెస్‌ గుర్తు హస్తం…అంటే చెయ్యి. ఇదే సూత్రం అమలు చేయాల్సివుంటే ఎన్నికల విధుల్లో వుండే అధికారులకు, ఉద్యోగులకు ఎన్నికలయ్యేదాకా చేతులు తీసేయాల్సిందే. చేతులు ఉన్నా కట్టేయాల్సిందే. త‌మిళ‌నాడులో డిఎంకె గుర్తు ఉదయించే సూర్యుడు…మ‌రి సూర్యుడిని క‌నిపించ‌కుండా క‌ప్పేయాలా? బిజెపి గుర్తు క‌మ‌లం…ఎన్నిక‌ల‌య్యేదాకా ఆలయాల్లో క‌మ‌లం పూలు దేవునికి పెట్ట‌డం మానేయాలా? బిఎస్‌పి గుర్తు ఏనుగు…జంతుప్ర‌ద‌ర్శ‌న శాల‌లు, ఆల‌యాల నుంచి ఏనుగుల‌ను త‌రిమేయాలా…? కెఏ పాల్‌కు హెలికాప్టర్‌ గుర్తు కేటాయించారు. అయితే… ఎన్నికల అధికారులెవరూ హెలికాప్టర్‌ ఎక్కకూడదు. టిఆర్‌ఎస్‌కు కారు గుర్తువుంది….ఎన్నికలయ్యేదాకా అధికారులెవరూ కారు వాడకూడదు! ఇంకో పార్టీకి టేబుల్‌ గుర్తు ఉంటుంది, మరో అభ్యర్థికి పెన్ను సింబల్‌ ఇస్తారు…అంటే ఆఫీసుల్లో టేబుళ్లు, పెన్నులు వాడకూడదన్నమాట! ఇవన్నీ పాటిస్తే….అసలు ఎన్నికలు నిర్వహించడానికే సాధ్యంకాదన్నమాట.

నాయకుల బొమ్మలకు ముసుగులు వేయడం కూడా అటువంటిదే. ముసుగులు వేయమన్నారని….మదర్‌ థెరీసా విగ్రహానికీ గుడ్డ కప్పేశారట. ఇంకోచోట కార్మిక సంఘాల బోర్డులుంటే వాటిపైనా ముసుగు వేశారు అధికారులు. ఇది మహనాయులను అవమానించడం కాదా? అయినా విగ్రహాలను చూసి ఓట్లు వేస్తారా! ఇంకోచోట ఎక్కడా పార్టీ కార్యాలయంపైన ఉన్న బోర్డునూ మూసేయాలంటూ ప్రత్యర్థి పార్టీ నేతలు అధికారులకు విన్నవించారు. ఎన్నికల నిబంధనావళిని ముగ్గుసూటిగా అమలు చేస్తే…ఇలాగేవుంటుంది. దేనికైనా విచక్షణ అనేది ముఖ్యం.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*