అలిపిరిలో ఖాకీ కరకుదనం కాదు….శ్రీవారి వంటి శాంతచిత్తులు కావాలి!

తిరుమలకు వెళ్లేందుకు అలిపిరి చెక్‌ పాయింట్‌ వద్ద తనిఖీల కోసం ఆగాను. నన్ను తనిఖీ చేసిన కానిస్టేబుల్‌తో…’నిన్న తమిళనాడు భక్తుడిని కొట్టిన ఎస్‌పిఎఫ్‌ సిబ్బంది ఉన్నారా…ఇక్కడి నుంచి ట్రాన్స్‌ఫర్‌ చేశారా’ అని ఒక మాట అడిగాను. అంతే అతను…’ఎందుకు ఉండరు…ఉంటారు. మావాళ్లు ఏంతప్పు చేశారు. వీడియో తీసిన ప్రెస్‌ వాడికి దానికి ముందు జరిగిందంతా పని లేదు…మావాళ్లు కొట్టేది మాత్రమే తీశాడు. భక్తులు కొడతావుంటే మేము చూస్తూవుండాలా…’ అని కాస్త దురుసుగానే వ్యాఖ్యానించారు.

అదేరోజు సాయంత్రం…చెన్నైకి చెందిన ఓ భక్తుడు శ్రీవారికి బహూకరించేందుకు రూ.2.25 కోట్లతో బంగారు హస్తాలు తయారు చేయించి తీసుకొచ్చారు. ఆ భక్తుడు చెప్పినది విన్న తరువాత….ఇంత భక్తి వుంటుంటా…అనిపించింది. పక్క వాళ్లకు ఒక రూపాయి ఇవ్వాలంటే పదిసార్లు ఆలోచిస్తామే…దేవుడి మొక్కు తీర్చుకోవడం కోసం కోట్ల రూపాయలు ఇంత సంతోషంగా ఇస్తారా…అనిపించింది.

ఈ రెండు ఉదంతాలు చెప్పడం ఎందుకంటే….తిరుమల శ్రీవారిని దర్శించుకునేందుకు వచ్చేవారు ఎంతో భక్తి విశ్వాసాలతో వస్తుంటారు. అలాంటి వారికి అలిపిరిలో 13.06.2019 తేదీ సాయంత్రం భద్రతా సిబ్బంది చేతిలో ఎదురైన చేదు అనుభవం ఎదురైతే వారి విశ్వాసాలు ఏమవుతాయి?

ఆ రోజు సాయంత్రం…తమిళనాడుకు చెందిన ఓ భక్తుడి జేబులో గుట్కా ప్యాకెట్‌ ఉందన్న పేరుతో….పది మంతి ఎస్‌పిఎఫ్‌ సిబ్బంది అతన్ని చావగొట్టారు. ఈ దారుణం ఏమటని ప్రశ్నిస్తే…భక్తులే తమపై దాడి చేశారని చెబుతున్నారు. ఇది నమ్మదగినదేనా? ఎక్కడి నుండో వచ్చిన భక్తుడు పోలీసులపై దాడి చేయగలడా? తెలిసో తెలియకో కాస్త గట్టిగా మాట్లాడివుండొచ్చు. అంత మాత్రాన అతన్ని గొడ్డుకంటే దారుణంగా కొడతారా? అయినా…అతడేమైనా మారణాయుధాలు, పేలుడు పదార్థాలు కలిగివున్నాడా? పోలీసులు ఎంతుకంట అమానవీయంగా ప్రవర్తించారు?!

ఇక్కడ తప్పుపట్టాల్సింది…ఎస్‌పిఎఫ్‌ను కాదు. టిటిడి అధికారులను. తిరుమల ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన అధ్యాత్మిక క్షేత్రం. ఇక్కడ ఆధ్యాత్మికత, మావవీయత వెల్లివిరవాలి తప్ప….ఇటువంటి దాడులు, దౌర్జన్యాలు కాదు. అందుకే తనిఖీల కేంద్రం వద్ద కూడా భక్తిభావం కలిగిన పోలీసులనే ఎంపిక చేసి నియమించాలి. భక్తులతో వ్యవహరించేటప్పుడు….దేవుడితో వ్యవహరిస్తున్నామన్న భావన కలిగిన వాళ్లనే నియమించాలి. ‘వాళ్లు కొడుతుంటే…చూస్తుండాలా’ అనే భావన కలిగిన పోలీసులను కాదు.

భక్తులతో ఎలా మెలగాలో శిక్షణ ఇచ్చేందుకు టిటిడికి ప్రత్యేక శిక్షణా కేంద్రం (శ్వేత) ఉంది. అక్కడ ఈ పోలీసులకూ శిక్షణ ఇవ్వాలి. భక్తులను కొట్టడం, తిట్టడం కాదు….ఏకవచనంతో సంబోధించినా నేరంగానే పరిగణించాలి. సార్‌ / మేడమ్‌, అయ్యా, అమ్మా అని గౌరవంగా పిలవాలి. ఇంకా చెప్పాలంటే గోవిందా అని సంబోధించాలి. భక్తులతో అత్యంత సున్నితంగా వ్యవహరించాలి. అంతేగానీ….నేరస్తులతో వ్యవహరించినట్లు దురుసుగా ప్రవర్తిస్తే చెడ్డపేరు వచ్చేది ఆ పోలీసులకు కాదు….తిరుమల తిరపతి దేవస్థానానికి. గతంలో ఆలయం లోపలే భక్తులపై దాడి చేసిన ఉదంతాలున్నాయి.

భక్తులు ఎక్కడో దూర ప్రాంతాల నుంచి వస్తుంటారు. కొందరు ఉపవాసంతో వస్తుంటారు. కొందరు సుదూరం నంచి నడచి వస్తుంటారు. మార్గమధ్యంలో ఎన్నో అవస్థలు పడుతారు. తమ బాధలు తీరాలని దేవున్ని వేడుకునేందుకు వచ్చేవాళ్లు ఉంటారు. భక్తులతో వ్యవహరించే ఎవరైనా, ఎక్కడైనా ఇటువంటివి గమనంలో ఉంచుకోవాలి. భద్రతా సిబ్బందికి పని ఒత్తిడి ఉంటే….సిబ్బంది సంఖ్య పెంచాలి. తక్కువ పని గంటలు ఉండేలా చూడాలి.

భద్రతా సిబ్బంది దుస్తులు మార్చాలన్న అభిప్రాయమూ వ్యక్తమవుతోంది. ఖాకీ, సఫారీ వంటి దుస్తుల స్థానంలో… తెలుగు వర్ణం వంటి సాత్విక దుస్తులు ఇవ్వాలని సూచిస్తున్నవారూ ఉన్నారు. తిరునామం ధరించేవారు ఉండాలి. ఇంకా చెప్పాలంటే..శ్రీవారి భక్తులపైన వారిని ఎంపిక చేసి భద్రతా విధుల్లో నియమించాలి. అయితే….టిటిడి ఇవన్నీ ఆలోచించినట్లు లేదు. ఏదో జరిగిపోతోందంటే జరిగిపోతోంది అనే రీతీలో వ్యవహరిస్తోంది. ఇప్పటికైనా ఈ అంశంపైన లోతుగా అధ్యయనం చేసి మంచి నిర్ణయం తీసుకోవాల్సిన అవసరం కనిపిస్తోంది.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*