ఆ వార్తల్లో నిజం లేదని టిటిడి ఛైర్మన్ తేల్చేశారు..! ధర్మచక్రం కథనమే నిజం..!!

ధర్మచక్రం ప్రతినిధి – తిరుపతి

లాక్ డౌన్ వల్ల శ్రీవారి దర్శనం ఆపివేయడం వల్ల టిటిడికి‌ తీవ్ర నష్టం వాటిల్లిందని, ఉద్యోగులకు జీతాలు ఇవ్వడం కూడా కష్టంగా మారుతోందని కొన్ని పత్రికల్లో, టివి ఛానళ్లలో వచ్చిన వార్తలు సత్య దూరమని‌ టిటిడి ఛైర్మన్ వైవి సుబ్బారెడ్డి తేల్చేశారు.

లడ్డూలకు సంబంధించి కీలక ప్రకటన చేయడానికి తిరుపతిలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో‌ ఛైర్మన్ మాట్లాడుతూ…. టిటిడి నిర్వ‌హ‌ణ‌కు గానీ, ఉద్యోగుల వేత‌నాలు చెల్లించేందుకు గానీ ఎలాంటి నిధుల కొర‌త లేద‌ని తెలిపారు. శ్రీ‌వారి అనుగ్ర‌హంతో భ‌విష్య‌త్తులో కూడా ఆ పరిస్థితి రాదని అన్నారు. రాష్ట్ర ప్ర‌భుత్వ నిబంధ‌న‌ల మేర‌కు ఉద్యోగులకు మార్చి, ఏప్రిల్ వేత‌నాలు చెల్లించామ‌ని, మే నెల వేత‌నాల చెల్లింపున‌కు సిద్ధంగా ఉన్నామన్నారు. టిటిడి ఉద్యోగుల‌కు వేత‌నాలు చెల్లించ‌లేని స్థితిలో ఉంద‌ని కొన్ని మీడియాల్లోనూ, సామాజిక మాధ్యమాల్లోను ఇటీవ‌ల జ‌రిగిన ప్రచారం అవాస్తవమని స్పష్టం చేశారు.

ఇదే అంశంపై ధర్మచక్రం ప్రత్యేక కథనాన్ని ప్రచురించింది. దాదాపు‌ నగదు, బంగారు కలిపి రూ.20 వేల కోట్ల డిపాజిట్లు కలిగిన టిటిడికి‌ ఆర్థిక ఇబ్బందులు లేవని, ఉద్యోగులకు వేతనాలు చెల్లించలేనంత‌ దురావస్థ ఎప్పటికీ రాదని వివరించింది. ఇదే విషయాన్ని ఇప్పుడు ఛైర్మన్ వెల్లడించారు.

లాక్‌డౌన్ దాక్ సగం ధరకే ల‌డ్డూ ప్ర‌సాదం…
లాక్డౌన్ కారణంగా భక్తులకు శ్రీవారి దర్శనం నిలిపి వేసి సుమారు రెండు నెలలైందని టీటీడీ ధర్మకర్తల మండలి అధ్యక్ష్యులు శ్రీ వైవి సుబ్బారెడ్డి చెప్పారు. భక్తులకు స్వామి వారి దర్శనాలు ఎప్పటి నుంచి ప్రారంభిస్తామో ఖచ్చితంగా చెప్పలేని పరిస్థితి ఉందన్నారు. ఈ నేపథ్యంలో తమకు స్వామివారి లడ్డూ ప్రసాదం అయినా అందించాలని తనకు అనేక విజ్ఞప్తులు వచ్చినట్లు ఆయన చెప్పారు. భక్తుల విజ్ఞప్తి మేరకు అధికారులతో చర్చించి లాక్డౌన్ ముగిసే వరకు రూ.25 కే లడ్డూ ప్రసాదం అందించాలని నిర్ణయించినట్లు ఆయన చెప్పారు. ఈ పంపిణీ ఎప్పటి నుంచి ప్రారంభం అయ్యేది, రెండు మూడు రోజుల్లో చెబుతామన్నారు. లాభ నష్టాలను చూడకుండా రూ.50/- ల‌డ్డూను రూ.25/- కు త‌గ్గించి భ‌క్తుల‌కు అందించాల‌ని నిర్ణ‌యించిన‌ట్టు తెలిపారు. రాష్ట్ర‌వ్యాప్తంగా ఉన్న అన్ని జిల్లా కేంద్రాల్లోని టిటిడి క‌ల్యాణ‌మండ‌పాలు,చెన్నై, బెంగ‌ళూరు, హైద‌రాబాద్‌ నగరాల్లో ఉన్న స‌మాచార కేంద్రాల్లో శ్రీ‌వారి ల‌డ్డూ ప్ర‌సాదాన్ని అందుబాటులో ఉంచుతామ‌న్నారు. ఎవ‌రైనా ఎక్కువ మోతాదులో ల‌డ్డూ ప్ర‌సాదం తీసుకుని భ‌క్తుల‌కు పంచ‌ద‌ల‌చుకుంటే వారు శ్రీ‌వారి ఆల‌య డెప్యూటీ ఈవో శ్రీ హరీంద్ర నాథ్ 9849575952 లేదా ఆల‌య పోటు పేష్కార్ శ్రీ శ్రీనివాస్ 9701092777ను సంప్ర‌దించాల‌ని కోరారు.

ఈ హుండి ద్వారా పెరిగిన కానుకలు… 2019 ఏప్రిల్ నెల‌లో ఇ-హుండీ ద్వారా స్వామి వారికి రూ.1.79 కోట్లు కానుకలు అందయన్నారు. ఈ ఏడాది ఏప్రిల్ నెల‌లో రూ.1.97 కోట్లు కానుక లు వచ్చాయని చైర్మన్ చెప్పారు. లాక్‌డౌన్ కార‌ణంగా శ్రీ‌వారి ద‌ర్శ‌నానికి రాలేక‌పోయినా ఇ-హుండీ ద్వారా కానుక‌లు స‌మ‌ర్పించిన భ‌క్తులంద‌రికీ ఈ సంద‌ర్భంగా కృతజ్ఞ‌త‌లు తెలియ‌జేశారు.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*