అసలు వదిలి కొసరు పట్టుకున్న మీడియా..! అచ్చెన్న అరెస్టు వార్తల్లో కుప్పిగంతులు..!

మాజీ మంత్రి, తెలుగుదేశం పార్టీ నేత అచ్చెన్నాయుడి అరెస్టుకు సంబంధించి తెలుగు మీడియా ధోరణి చిత్ర విచిత్రంగా ఉంది. అసలు వదలి కొసరు పట్టుకొని లాగుతోంది. ప్రజలనూ‌ దారి మళ్లించేందుకు ప్రయత్నిస్తోంది. పత్రికలైనా, టీవి ఛానళ్లయినా ఇదే చేస్తున్నాయి.

కార్మికులకు వైద్యం అందించే ఈఎస్ఐ ఆస్పత్రులో మందుల కొనుగోలు విషయంలో గడచిన ఐదేళ్ళ కాలంలో 150 కోట్ల రూపాయల కుంభకోణం జరిగిందన్న అభియోగంపై అచ్చెన్నాయుడిని‌ ఏసిబి అరెస్ట్ చేసింది. అయితే…మీడియా ఈ కుంభకోణం ఎలా జరిగింది, ఎప్పుడు జరిగింది, ఇందులో అచెన్నాయుడి పాత్ర ఏమిటి అనే అంశాలు వెలికితీయడానికి బదులు….ఆయన్ను ఎలా అరెస్ట్ చేశారు, గ్రామాన్ని పోలీసులు ఎలా చుట్టుముట్టారు, ఇంటి గోడను‌ ఎలా దూకారు… అని చెప్పడానికి చెప్పడానికే తెలుగుదేశం అనుకూల మీడియా ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చింది.

సాధారణంగా ఇలాంటి అంశాలు వచ్చినప్పుడు మీడియా తన సొంత పరిశోధన ద్వారా ప్రత్యేక కథనాలు ప్రచురిస్తుంది. అధికారులు చెప్పిన అంశాలకే పరిమితం కాకుండా లోతుల్లోకి వెళ్లి సమాచారం సేకరించి ప్రత్యేక కథనాలు ప్రచురిస్తుంది. ఇది అనేక సందర్భాల్లో జరిగింది. జగన్ కేసులోనైతే ఇటువంటి కథనాలు పుంఖాను పుంఖాలుగా కుమ్మరించాయి.

అచ్చెన్నాయుడు విషయంలో మాత్రం కుంభకోణం జోలికి అసలు వెళ్ళలేదు. ఏదో ఆయన్ను అక్రమంగా అరెస్టు చేశారు అనే విధంగానే వార్తలు వండి వార్చుతున్నాయి. వాస్తవంగా చెప్పాలంటే కొన్ని నెలల క్రితమే ఈఎస్ఐ కుంభకోణం బయటపడింది. అయినా మీడియా పట్టీపట్టనట్లుగా ఉండిపోయింది. అరెస్టుల పర్వం మొదలైన తరువాతనైనా పట్టించుకుంటారా అంటే అదీ లేదు.

రెండు అగ్రశ్రేణి పత్రికలు….శీర్షికలో కుంభకోణం ప్రస్తావన లేకుండా జాగ్రత్తపడ్డాయి. కథనం లోపల కూడా కుంభకోణం తీవ్రతను ప్రస్తావించలేదు. ఇదే తరహా జర్నలిజమో అర్థం కాదు. అయినా పాఠకులు విజ్ఞులు. ఏ వార్తల వెనుక‌ ఏ ప్రయోజను ఉన్నాయో‌ తెలుసుకోగల వివేకం ఉన్నవారు.‌ ఈ విషయాన్ని మీడియా అర్థం చేసుకోవాలి. – ధర్మచక్రం ప్రతినిధి

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*