అసెంబ్లీ ‘ముందస్తు’కు బాబునో…భ‌య‌మా! వ్యూహ‌మా!

లోక్‌సభకు ముందస్తు ఎన్నికలు జరిగినా…రాష్ట్ర శాసన సభకు సంబంధించినంత వరకు ముందస్తు ఎన్నికలకు వెళ్లేది లేదని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తమ పార్టీ నేతలకు స్పష్టం చేసినట్లు వార్తలొచ్చాయి. అటు తెలంగాణ ప్రభుత్వం కూడా ముందస్తు ఎన్నికలకు వెళ్లాలన్న ఆలోచనలో ఉంది. లోక్‌సభతో పాటే రెండు తెలుగు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు జరగాల్సివుంది. అయితే బిజెపికి వరుసగా ఎదురువుతున్న పరాజయాల నేపథ్యంలో…ఈ ఏడాది డిసెంబర్‌లో జరగాల్సిన రాజస్థాన్‌, మధ్యప్రదేశ్‌ తదితర రాష్ట్రాల్లో ఓటమి పాలైతే ఆ ప్రభావం ఆ తరువాత జరిగే లోక్‌సభ ఎన్నికలపై పడుతుందన్న భయంతో బిజెపి ముందస్తు ఎన్నికలకు సిద్ధమవుతోంది. డిసెంబర్‌లోనే లోక్‌సభ ఎన్నికలకు వెళ్లాలని ఆలోచిస్తోంది. ముందస్తు ఎన్నికలకు కెసిఆర్‌ సై అంటుంటే…చంద్రబాబు నో అని ఎందుకంటున్నారు? అనేది చర్చించాల్సిన అంశం.

ఇటీవలకే కెసిఆర్‌ తెలంగాణలో రైతుబంధు పథకాన్ని ప్రవేశపెట్టారు. ఆ పథకంతో గ్రామీణ స్థాయి దాకా టిఆర్‌ఎస్‌కు సానుకూలత ఉందన్న అభిప్రాయం కెసిఆర్‌కు ఉంది. అదేవిధంగా టిఆర్‌ఎస్‌కు వ్యతిరేకంగా అన్ని శక్తులూ ఇప్పుడిప్పుడే ఏకమవుతున్నాయి. కాంగ్రెస్‌ బలపడేందుకు ప్రయత్నిస్తోంది. బిజెపికి శక్తిని కూడగట్టుకునేందుకు తంటాలుపడుతోంది. ఇప్పటికే బహుజన లెఫ్ట్‌ ఫ్రంట్‌ ఏర్పాటయింది. కోదండరాం నేతృత్వంలో కొత్త పార్టీ ఆవిర్భవించింది…ఇలా టిఆర్‌ఎస్‌కు వ్యతిరేకంగా అనేక శక్తులు పురుడుపోసుకుంటున్నాయి. అయితే…ఇంకా ఆవి అంతగా బలపడలేదు. ఎన్నికలు ఎంత ఆలస్యమైతే అంత సమయం టిఆర్‌ఎస్‌ వ్యతిరేక శక్తులకు లభిస్తుంది. సాధ్యమైనంత త్వరగా ఎన్నికలు జరిగిపోతే…మరోసారి గెలిచి టిఆర్‌ఎస్‌కు తిరుగులేదని చాటుకునేందుకు కెసిఆర్‌ ఉవ్విళ్లూరుతున్నారు. అందుకే ఆయన ముందస్తు ఎన్నికలకు సై అంటున్నారు.

ఇక ఆంధ్రప్రదేశ్‌లో అధికార పార్టీ పరిస్థితి అందుకు భిన్నంగా ఉంది. నాలుగేళ్లపాటు కేంద్రంలో అధికారాన్ని పంచుకున్న తెలుగుదేశం….రాష్ట్రానికి ఏమీ సాధించలేకపోయింది. బిజెపి నుంచి విడిపోయిన తరువాత తెలుగుదేశం నాయకులే ఆ మాట చెబుతున్నారు. వాస్తవంగా రాష్ట్రానికి అన్యాయం జరగడానికి బిజెపి ఎంత కారణమో….టిడిపి కూడా అంతే కారణం. అయితే…బిజెపి వల్లే అన్యాయం జరిగిందని చెప్పడం ద్వారా తాను తప్పించుకునేందుకు టిడిపి ప్రయత్నిస్తోంది. ఇందులో కొంత సక్సెస్‌ అయింది కూడా. ప్రత్యేక హోదా, విభజన హామీలు అమలు చేయాలంటూ దీక్షలు, ఆందోళనలు చేస్తోంది. ఇలాగే ఇంకొంతకాలం కొనసాగిస్తే….టిడిపిపై ప్రజల్లో ఉన్న కోపాన్ని పూర్తిగా చల్లార్చవచ్చునని భావిస్తోంది. అదేవిధంగా రాష్ట్రంలో అసంతృప్తితో ఉన్న వివిధ వర్గాల ప్రజలకు తాయిలాలు ఇస్తూ దువ్వే ప్రయత్నిం చేస్తోంది. అంగన్‌వాడీలు, ఆశావర్కర్లు, విఆర్‌వోలు, హోంగార్డులు…అలా కొందరికి జీతాలు పెంచడం ఇందులో భాగమే. మూడు లక్షల ఎన్‌టిఆర్‌ ఇళ్లకు ఒకేరోజు గృహప్రవేశాలు చేయించారు. ఇటువంటి సంక్షేమ కార్యక్రమాలను ఈ కొన్ని నెలల్లో పెద్ద ఎత్తున నిర్వహించడానికి టిటిడి ప్రభుత్వం సిద్ధమయింది. ఆ తరువాత ఎన్నికలు జరిగితే ఓట్లు రాలుతాయన్న ఆశతో టిడిపి ఉంది. అందుకే ముందస్తు ఎన్నికలకు చంద్రబాబు నో అంటున్నారు.

లోక్‌సభకు ముందస్తు ఎన్నికలు నిర్వహించాలని బిజెపి అనుకుంటే ఆపగల శక్తి టిడిపికి లేదు. లోక్‌సభను ప్రధాన మంత్రి రద్దు చేస్తే…ఆరు నెలల్లో ఎన్నికలు నిర్వహించాల్సివుంటుంది. అసెంబ్లీకి కూడా ముందస్తు రావాలంటే అసెంబ్లీని ముఖ్యమంత్రి రద్దు చేయాలి. లేదా అసెంబ్లీని రద్దు చేయడానికి వీలుగా రాజ్యాంగ సవరణ చేయాలి. బిజెపి అంతదూరం వెళ్లకపోవచ్చు. లోక్‌సభకు మందస్తు జరిగితే… తెలుగుదేశం పార్టీకి ఒక విధంగా మంచిదే అవుతుంది. బిజెపి, వైసిపి, జనసేన రహస్య అవగాహనతో పని చేస్తున్నాయని టిడిపి ఆరోపిస్తోంది. లోక్‌సభ ఎన్నికలు జరిగి, ప్రభుత్వం ఏర్పాటు చేయాల్సిన పరిస్థితుల్లో ఆ రహస్యం పాటించడం సాధ్యంకాదు. అప్పుడు ఎవరు ఏమిటో బయటపడిపోతుంది. అదే జరిగితే…వైసిపి, బిజెపి ఒక్కటయ్యాయని తాము చేస్తున్న ఆరోపణలు నిజమని తేలిందంటూ అసెంబ్లీ ఎన్నికల్లో ప్రచారం చేసుకోవచ్చు. ఒకవేళ అలాంటిది జరగకపోయినా….లోక్‌సభ ఎన్నికల వల్ల టిడిపికి వచ్చే నష్టమేమీ ఉండదు. అందుకే బాబు ముందస్తు అసెంబ్లీ ఎన్నికలకు నో అంటున్నారు.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*