ఆంధ్రప్రదేశ్‌లోకి భారత సైన్యం రావొచ్చునా…ఏపి కేసులను సుప్రీం కోర్టు విచారించవచ్చునా..!

తెలుగుదేశం పార్టీ అధినేత, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు బిజెపిపైన యుద్ధం పేరుతో తీసుకుంటున్న కొన్ని నిర్ణయాలు వివాదాస్పదంగా ఉంటున్నాయి. దేశ సమైక్యతను దెబ్బతీసేలా కనిపిస్తున్నాయి. తాజాగా తీసుకున్న నిర్ణయంలోనూ అటువంటి ఛాయలు కనిపిస్తున్నాయి.

ఆంధ్రప్రదేశ్‌ అనేది భారత దేశంలో ఒక రాష్ట్రమనే సంగతి మరచిపోయి….ఇదే ఒక స్వతంత్ర దేశం అనే భావన బాబు నిర్ణయాల్లో కనిపిస్తోంది. కేంద్ర ప్రభుత్వ దర్యాప్తు సంస్థ అయిన సిబిఐ ఆంధ్రప్రదేశ్‌లోకి అడుగు పెట్టకూడదట. రాష్ట్ర ప్రభుత్వ ఆధీనంలోని ఏసిబినే అన్నీ చక్కబెడుతుందట.

సిబిఐపై ఎన్ని విమర్శలు, ఆరోపణలున్నా…దేశంలో అదో ప్రతిష్టాత్మక దర్యాప్తు సంప్థ. ఎంతటి సంక్లిష్టమైన కేసులనైనా ఛేదించగల శక్తి సామర్థ్యాలు, సమర్థత ఉన్న వ్యవస్థ. అటువంటి సంస్థ ఆంధ్రప్రదేశ్‌లోకి రావడానికి వీల్లేదంటూ ఓ జీవోను జారీ చేశారు. ఇది న్యాయస్థానం ముందు నిలబడుతుందా లేదా అనేది వేరే సంగతిగానీ….ఈ జీవో చేయడం చూస్తే చంద్రబాబు ధోరణి ఏమిటో బయటపడుతోంది.

సిబిఐ వొద్దంటున్న చంద్రబాబు నాయుడు….తనకు భద్రత కల్పిస్తున్న నేషనల్‌ సెక్యూరిటీ గార్డ్స్‌ను తిరస్కరించగలరా? భద్రతా సిబ్బందిని తిప్పి పంపించగలరా? అదేవిధంగా ఆదాయ పన్ను శాఖ అధికారులు కేంద్ర పరిధిలోనే ఉంటారు. ఐటి అధికారులు రాష్ట్రంలోకి రాకూడదని చెప్పగలరా? తీవ్రమైన శాంతిభద్రతల సమస్య తలెత్తినపుడు సైన్యం కూడా రంగం ప్రవేశం చేస్తుంది. సైన్యం రాకూడదని బాబు అడ్డుకోగలరా? దేశం మొత్తానికి సుప్రీం కోర్టు తిరుగులేనిది. అది ఢిల్లీలో ఉంది కాబట్టి….ఆంధ్రప్రదేశ్‌ కేసులను విచారించడానికి లేదని వాదించగలరా? ప్రభుత్వ నిర్ణయంతో ఇటువంటి ప్రశ్నలు ఎన్నో ముందుకొస్తున్నాయి.

సిబిఐని కేంద్ర ప్రభుత్వం రాజకీయ అవసరాల కోసం వాడుకుంటోందని చంద్రబాబు ఆరోపిస్తున్నారు. అందుకే ఆ వ్యవస్థ ఆంధ్రప్రదేశ్‌లోకి రావడానికి వీల్లేదంటున్నారు. ఆ మాటకొస్తే రాష్ట్రంలోని సాధారణ పోలీసులను కూడా రాష్ట్ర ప్రభుత్వం రాజకీయ అవసరాల కోసం వాడుకుంటోంది. అధికార పార్టీ నేతలు ఏమి చెబితే అది మాత్రమే పోసులు చేస్తారు. అలాగని పౌరులు పోలీసు వ్యవస్థను ధిక్కరించి, ఈ వ్యవస్థను మేము ఖాతరు చేయం అని చెప్పగలరా?

రాష్ట్రంలోని ఏసిబి సమర్థవంతంమైనదని, సిబిఐ చేస్తున్న పనులను ఏసిబి చేయగలదని, ఇకపై ఏసిబితోనే అటువంటి దర్యాప్తులు చేయించగలమని చెబుతున్నారు. ఏసిబి అవినీతిని అరికట్టడం వరకే పరిమితం. అది ఇతర నేరాలపైన (హత్యలు, కుంభకోణాలు వంటివి) దర్యాప్తు చేయగల సమర్థత దానికి లేదు. సిబిఐ స్థానాన్ని ఏసిబి ఎలా భర్తీ చేయగలదు?

అసలు విషయానొకిస్తే….తనపై హత్యాయత్నం కేసులో సిబిఐ విచారణ జరిపించాలని జగన్‌ హైకోర్టును ఆశ్రయించిన సంగతి తెలిసిందే. న్యాయస్థానంలో జరుగుతున్న వాదనలు గమనించిన తరువాత…సిబిఐ విచారణకు కోర్టు ఆదేశించే సూచనలు కనిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే సిబిఐ ఆంధ్రప్రదేశ్‌లో అడుగుపెట్టడానికి వీల్లేదని ప్రభుత్వం నిర్ణయం తీసుకుందన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అయినా…ఇది చాలా పెద్ద అంశం. కేంద్ర ప్రభుత్వం, న్యాయస్థానాలతో ముడిపడిన అంశం. రాష్ట్ర ప్రభుత్వం అటువంటి నిర్ణయాన్ని తీసుకోజాలదు.

రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయాలు చూస్తుంటే….ఆలోచనలు గతితప్పుతున్న స్థితి కనిపిస్తోంది. రాష్ట్రంలో ఐటి, ఈడి దాడులు నిర్వహించే అధికారులకు పోలీసుల భద్రత కల్పించకూడదని ఇటీవలే ఓ నిర్ణయం తీసుకున్నారు. ఇప్పుడు సిబిఐ వద్దకు వచ్చారు. తెలుగుదేశం పార్టీ నేతలపైన విచారణలు, సోదాలు జరిగే సరికి ఆ వ్యవస్థలనే వివాదాస్పదం చేసి, అడ్డుకునే ప్రయత్నాలు చేస్తున్నట్లు అనిపిస్తోంది. సిబిఐ దర్యాప్తులకైనా, ఐటి దాడులకైనా స్వేచ్ఛగా అనుమతించాల్సిందిపోయి అడ్డుపడే చర్యలకు దిగడం వల్ల ప్రభుత్వ ప్రతిష్ట దెబ్బతినడం మినహా వచ్చే ప్రయోజనం ఏమీ ఉండదు.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*