ఆఖరి అస్త్రాన్నీ ప్రయోగించిన కాంగ్రెస్‌!

ఈ ఎన్నికల్లో గెలిచి అధికారం చేపట్టకుంటే కాంగ్రెస్‌ పార్టీకి గట్టికాలమే. ఇంకా చెప్పాలంటే కాంగ్రెస్‌ భవిష్యత్తు అధకారమే. రాహుల్‌ గాంధీ ప్రధానమంత్రి అవడం కలే అవుతుంది. అందుకే 2019 ఎన్నికలను కాంగ్రెస్‌ పార్టీ జీవన్మరణ సమస్యగా భావిస్తోంది. ఎలాగైనా అధికారంలోకి రావాలన్న పట్టుదలతో వ్యూహాలు రచిస్తోంది. తెలుగు రాష్ట్రాల్లో టిడిపితో పొత్తు పెట్టుకుందంటే అందులో భాగమే. అసలు విషయానికొస్తే…..

రాహుల్‌ గాంధీ సోదరి ప్రియాంకా గాంధీని ఏఐసిసి ప్రధాన కార్యదర్శిగా రంగంలోకి తెచ్చారు. ఈ నిర్ణయం వల్ల కాంగ్రెస్‌లో నూతనోత్తేజం వస్తుందని ఆ పార్టీ నేతలు భావిస్తున్నారు. ప్రియాంకా గాంధీని మాజీ ప్రధాని ఇందిరాగాంధీకి ప్రతిరూపంగా జనం చూస్తారన్నది ఆ పార్టీ నేతల నమ్మకం.

కాంగ్రెస్‌ పార్టీ ఇబ్బందుల్లో ఉన్నప్పుడుల్లా ప్రియాంకా గాంధీ పేరు వినిపిస్తూనే ఉంది. ఇంకా చెప్పాలంటే….రాహుల్‌ గాంధీ కంటే ప్రియాంకానే పార్టీ పగ్గాలు చేపడితే బాగుంటుందని రాహుల్‌కు బాధ్యతలు అప్పగించే సమయంలో పెద్ద చర్చ కూడా జరిగింది. రాజకీయాలపై పెద్దగా ఆసక్తి చూపని ప్రియాంక దూరంగా ఉండిపోయారు. అప్పుడప్పుడు ప్రచారంలో పాల్గొనడం మినహా ఆమె క్రియాశీలకంగా లేరు.

ఒకవేళ రాహుల్‌ గాంధీ విఫలమైతే ప్రియాంకా గాంధీని తెరపైకి తెస్తారని కాంగ్రెస్‌ నేతలు భావిస్తూవచ్చారు. రాహుల్‌ గాంధీ నేతృత్వంలో గత ఎన్నికల్లో ఓటమిపాలైనా అది అతని వైఫల్యంగా చెప్పడానికి వీల్లేకుండాపోయింది. ఎన్నికల కాస్తముందు పార్టీ పగ్గాలు చేపట్టడం వల్ల సర్దుకున్నారు. 2019 ఎన్నికలు అలాకాదు….వైఫల్యం వస్తే అది రాహుల్‌ మెడకు చుట్టుకోవడమే కాదు….ఆయన రాజకీయ భవిష్యత్తును, కాంగ్రెస్‌ పార్టీ భవిష్యత్తును అంధకారంలోకి నెట్టేస్తుంది.

ఇవన్నీ గమనించిన కాంగ్రెస్‌….ఒక్కోసారి ఒక్కో అస్త్రాన్ని కాకుండా అన్ని అస్త్రాలనూ ఒకేసారి ప్రయోగించాలని నిర్ణయించుకున్నట్లుంది. కిందపడిపోయిన తరువాత లేపే ప్రయత్నం చేయడంకంటే…. పడిపోకుండా నిలబెట్టడం మంచిదన్న భావనతోనే….రాహుల్‌కు తోడుగా ప్రియాంకనూ రంగంలోకి దింపుతోంది. అంటే చివరి అస్త్రాన్ని కూడా ఈ ఎన్నికల కోసం ప్రయోగిస్తోందన్నమాట.

అయినా ప్రియాంక ఇప్పుడు ఎంత ప్రభావం చూపగలరనేది ప్రశ్న. ఇందిరాగాంధీనే నేటి తరానికి గుర్తులేదు. ఇంకా చెప్పాలంటే ఆమెను ఒక మాజీ ప్రధానిగా మాత్రమే తెలుసు. ఆమెకు అప్పట్లో ఉన్న రాజకీయ ఛరిష్మా వంటివేవీ నేటి యువతరానికి తెలియవు. అటువంటిది ప్రియాంక రూపంలో ఇందిరాగాంధీని చూసి జనం ఓట్లేస్తారని భావించలేం. ఏదైనావుంటే…ఆమె వ్యక్తిగత రాజకీయ కౌశలంతోనే ఎంతోకొంత చేయగలగాలి. అంతేతప్ప ప్రియాంక రాకతో కాంగ్రెస్‌లో అద్భుతాలు జరిగేదేమీ ఉండకపోవచ్చు.

1 Comment

  1. అస్త్రం లేదూ ఏమీ లేదు. రాహుల్ చేతగానోడు అని ఇలా కన్ఫర్మ్ చేసేశారు. పైగా వీళ్ళ కుటుంబాన్ని చూసి ఓట్లు వేసి రోజులు పోయాయి. అమ్మమ్మ పోలికలు గట్రా కథలన్నీ కేవలం మీడియా పైత్యం తప్ప ఇప్పడుబున8ఓటర్లలో ఎంతమందికి ఇందిర గురించి తెలుసని ? ఈవిడ వల్ల.కొత్తగా ఒరిగేది ఏమీ.లేదు, విపక్షాలకు ఈవిడ భర్త అవినీతి రూపంలో మరొక కొత్త అస్త్రం దొరికింది. ఈవిడవల్ల నష్టమే తప్ప లాభం లేదు. మీడియా కావాలనే హైప్ చేస్తూ ఉంది.

Leave a Reply

Your email address will not be published.


*