ఆభరణాల ప్రదర్శన కాదు…పరిశీలన జరగాలి!

శ్రీవారి ఆభరణాలకు భద్రత లేదని, కొన్ని ఆభరణాలు మామయ్యాయని ప్రధాన అర్చకులు రమణ దీక్షితులు ఆరోపణలు చేస్తున్న నేపథ్యంలో స్వామి ఆభరణాలను ప్రజా ప్రదర్శనకు ఉంచాలన్న ఆలోచన ఉందని, ఆగమ పండితుల సూచలనకు అనుగుణంగా ఈ నిర్ణయమాన్ని అమల్లోకి తెస్తామని ఈవో అనిల్‌ కుమార్‌ సింఘాల్‌ ప్రకటించారు. ఈనెల 5వ తేదీన జరిగిన ధర్మకర్తల మండలి సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు చెప్పారు. వాస్తవంగా ఇటువంటి ఆలోచన గురించి గత సమావేశంలోనే (మే 16వ తేదీనాటి సమావేశం) వెల్లడించారు. 20 రోజుల తరువాత కూడా అదేమాట చెప్పారు. ఆభరణాలను ప్రదర్శనకు ఉంచాలన్న ఆలోచన ఉన్నప్పుడు ఈ 20 రోజుల్లో ఆగమ పండితుల సూచనలు ఎందుకు తీసుకోలేదనేది ప్రశ్న. బోర్డు సమావేశంలోనే ఆగమ పండితులను పిలిపించి చర్చించారని, స్వామివారికి అలంకరించే ఆభరణాలను ప్రదర్శనకు ఉంచడానికి ఆగమం అంగీకరించదని చెప్పినట్లు వార్తలొస్తున్నాయి. ఆయినా…భక్తుల అనుమానాలను నివృత్తి చేయడానికి ఆభరణాలను ప్రదర్శనకు ఉంచాల్సిన అవసరం లేదు. అలా ఉంచడం వల్ల భద్రతాపరమైన సమస్యలు కూడా ఉన్నాయి. తప్పదనుకుంటే ఏడాదిలో వారం రోజుల పాటు ఆభరణాలను ప్రదర్శించవచ్చు. అంతేగానీ…ఏడాది పొడవునా ప్రదర్శనకు పెట్టాల్సిన అవసరం లేదన్నది కొందరు టిటిడి అధికారుల అభిప్రాయం. ఈ రోజు ఆభరణాలపై అనుమానాలు వ్యక్తమయ్యాయి కాబట్టి….ప్రదర్శనకు పెట్టాలనడం సరికాదు.

అయినా భక్తులు కోరుతున్న స్వామివారి ఆభరణాలను బహిరంగ ప్రదర్శనకు పెట్టాలని కాదు. రమణ దీక్షితులు కోరుతున్నదానిలోనూ అదిలేదు. కొన్ని ఆభరణాలు మాయమయ్యాయని, కొన్నింటిలో విలువైన వజ్రాలు గల్లంతయ్యాయని రమణ దీక్షితులు చెబుతున్నారు. ఆభరణాల ప్రదర్శనతో ఈ అనుమానాలు తీరిపోవు. 1996లో టిటిడి స్వాధీనం చేసుకున్న రోజున రూపొందించిన మాస్టర్‌ జాబితాలోని ఆభరణాలన్నీ ఉన్నాయని, ఆ జాబితాలో లేని ఆభరణాల గురించి తమకు తెలియదని ఈవోనే చెబుతున్నారు. అందుకే ఇప్పుడు తేల్చాల్సింది ఏమంటే….ఇప్పటికే లభ్యమైన రికార్డుల ద్వారాగానీ, శాసనగాల ద్వారాగానీ శ్రీవారికి ఎవరెవరు ఏయే ఆభరణాలు సమర్పించారు, ఏవి ఉన్నాయి, ఏవి లేవి, ఎప్పటి నుంచి కనిపించకుండాపోయాయి తదితర అంశాలను నిర్ధిష్టంగా తేల్చాలి. ఆ వివరాలన్నీ భక్తులకు తెలియజేయాలి. అదేవిధంగా అందుబాటులో ఉన్న ఆభరణాల్లో అసలైన వజ్రాలే ఉన్నాయి, మధ్యలో ఏదైనా స్థానభ్రంశం జరిగిందా అనేది కూడా తేల్చాలి. పింక్‌ డైమండ్‌ వల్లేనే వజ్రాల అనుమానం వస్తోంది. తాను దాన్ని వజ్రమని గట్టిగా నమ్ముతున్నారు. టిటిడి వద్దకు వచ్చిన తరువాత మధ్యలో ఎప్పుడో డైమండ్‌ స్థానంలో రాయి (రూబీ) వచ్చి చేరిందని, అది గరుడసేవలో పలిగిపోయిందని రమణ దీక్షితులు చెబుతున్నారు. అందుకే దీక్షితులు చెబుతున్న ఆ పింక్‌ డైమండ్‌ మాత్రమే మారిందా..మిగతా ఆభరణాల్లోని వజ్రాలేవైనా తరలిపోయాయా అనేది తేల్చాలి. నిష్పక్షపాతమైన కమిటీతో, నిపుణులతో విచారణ జరిపించి, నిజానిజాలు నిగ్గు తేల్చితే చాలు…ఆభరణాలను బహిరంగంగా పెట్టాల్సిన అవరం లేదు. టిటిడి ఇది చేయగలిగినపుడే భక్తుల్లో విస్వానాన్ని నింపగలదు. గతంలో పరిశీలన చేసివున్నా…మరోసారి ఆ పని చేయడంలో తప్పులేదు.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*