ఆమె కత్తికి అడ్డొస్తే…తలలు లేచిపోవాల్సిందే..! ఎస్‌వియూలో ఆమే బిగ్‌బాస్‌…!!

ఎస్‌వి యూనివర్సిటీలో ఆమె చక్రం తిప్పుతున్నారు. తన కత్తికి అడ్డొస్తే విసి అయినా, రెక్టారైనా, ఇంకెవరైనా తల తెగిపడిపోవాల్సిందే అనేవిధంగా ఆధిపత్యం చెలాయిస్తున్నారు. విసిలు చేసిన నిర్ణయాలనైనా ఆమె బుట్టదాఖలు చేయగలరు. హోదాలో తనకంటే ఎంత పెద్దవారైనా ఖాతరు చేయరు. విసి అయినా, రెక్టారైనా….ఆమె ఛాంబర్‌కు వెళ్లి మాట్లాడాలి తప్ప…ఆమె మాత్రం ఎవరి ఛాంబర్‌కూ వెళ్లరు. బలహీనవర్గాలకు చెందిన వారు ఉన్నత పదవుల్లో ఉంటే…అలాంటి వారి ఛాంబర్‌కు అస్సలు వెళ్లరు. ‘నువ్వు నిర్వహించే సమావేశానికి నేను రాను….అవసరమైతే నువ్వే నా ఛాంబర్‌కి వచ్చి మాట్లాడు’ అని హూంకరించగలరు. అయినా ఎవరూ ఏమీ చేయలేరు.

దామోదరంపైనా అగౌరవ ప్రవర్తన

గతంలో ఉన్న ఓ అధికారిపై అవినీతి ఆరోపణలు రావడంతో ప్రభుత్వం ఆయన్ను పదవి నుంచి తప్పించింది. దీని కోసమే కాచుకుని కూర్చున్న ఆమె….ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకున్నారు. ఆమెకంటే సీనియర్లు, విద్యాధికులు, అర్హులు ఉన్నప్పటికీ ప్రభుత్వంలో ఉన్న పలుకుబడిని ఉపయోగించి ఆ పదవి దక్కించుకున్నారు. ఆమె అధికార కుర్చీలో కూర్చున్నప్పటి నుంచి వివాదాస్పదంగానే వ్యవహరిస్తున్నారు.

ఆ కుర్చీలో కూర్చున్న కొద్ది రోజులకే అప్పటి విసిగా ఉన్న ఆవుల దామోదరం పదవీకాలం ముగిసి వెళ్లిపోయారు. ఆ సందర్భంగా దామోదరం కొందరు ఉద్యోగులను బదిలీ చేస్తూ నిర్ణయం తీసుకున్నారు. కానీ ఆ ఫైలును ఆమె చాలాకాలం పెండింగ్‌లో పెట్టేశారు. ఇది ఎస్‌సి, ఎస్టీ కమిషన్‌ దాకా వెళ్లింది. ఒక విధంగా ఆవుల దామోదరంపై ఉన్న కోపాన్ని ఆ విధంగా ప్రదర్శించారు. (దీనికి సంబంధించి ధర్మచక్రం గతంలోనే ఓ కథనాన్ని ప్రచురించింది)

జానకిరామయ్య అంటే కంటగింపు…

ఆవుల దామోదరం వెళ్లిపోగానే…ఇన్‌ఛార్జి విసి నియామకం సందర్భంగానూ ఆమె చక్రం తిప్పాలని చూశారు. తానే ఇన్‌ఛార్జి విసి అయిపోవాలని రాజధాని స్థాయిలో పావులు కదిపారు. ఫలించలేదు. బలహీనవర్గాలకు చెందిన జానకి రామయ్యను ఇన్‌ఛార్జి విసిగా నియమించింది ప్రభుత్వం. ఇది కూడా ఆమెకు కంటగింపుగా మారింది. అప్పటి నుంచే ఆయనపై కోపం పెంచుకున్నారు.

ఇన్‌ఛార్జి విసి స్థానంలో పూర్తికాలం విసి వచ్చారు. సాధారణంగా విసిలుగా పని చేసిన వారి ఫొటోలు యూనివర్సిటీలో ప్రదర్శిస్తారు. బోర్డులో పేర్లు రాస్తారు. కొన్ని నెలల పాటు ఇన్‌ఛార్జి విసిగా పని చేసిన జానకి రామయ్య ఫొటోను పెట్టారు. బోర్డులో పేరు రాశారు. ఇది కూడా ఆ బిగ్‌బాస్‌కు జీర్ణం కాలేదు. ఇన్‌ఛార్జి విసి ఫొటో, పేర్లు ఎలా వేస్తారంటూ రచ్చచేసి….ఫొటో, పేర్లు తీయించేశారు.

ఉదాహరణకు ఒక ఆర్‌డిఓ స్థానంలో ఇన్‌ఛార్జి కొన్ని రోజులు చేశారనుకోండి… బోర్డులో ఆ తేదీలు వేసి ఇన్‌ఛార్జి ఆర్‌డిఓ అని రాస్తారు. ఏ ప్రభుత్వ పోస్టులోనైనా ఇలాగేవుంటుంది. కానీ బలహీనవర్గాలకు చెందిన ఒక వ్యక్తి ఫొటో విసిల సరసన ఉండటం జీర్ణించుకోలేని ఆమె చక్రం తిప్పి….రానకిరామయ్య ఫొటో, పేరు తొలగింపజేశారు. విసి ఉన్నా ఆయన నిమిత్త మాత్రుడే. అందుకే యూనివర్సిటీలో ఆమె చెప్పిందే శాసనం అవుతోంది.

యూనివర్సిటీ పాలనా వ్యవహారాల్లో ఆమె కుటుంబ సభ్యులు జోక్యం చేసుకుంటున్నారట. ఏ ఫైలుపైన సంతకం పెట్టాలో కూడా వాళ్లే నిర్ణయిస్తున్నారట. ఫైళ్లు ఇంటికి తీసుకెళుతున్నారన్న విమర్శలూ ఆమెపైన ఉన్నాయి.

ఆమెపై ముఖ్యమంత్రికి ఫిర్యాదులు వెళ్లడంతో…

అసలు ఆ పదవిలో ఆమె నియామకం చెల్లదని, ఆమెకు అవసరమైన అర్హతలు లేవని, ఆమెను ఆ పదవి నుంచి తొలగించాలని (దీనికి సంబంధించిన కథనం మరో వార్తగా రాస్తాను) విద్యార్థి సంఘాలు డిమాండ్‌ చేస్తున్నాయి. ముఖ్యమంత్రి చంద్రబాబుకు కూడా ఫిర్యాదు చేశారు. పక్కా ఆధారాలతో ప్రభుత్వానికి ఫిర్యాదు చేరి, విచారణ మొదలు కానున్న నేపథ్యంలో…జానకి రామయ్యను దొంగదెబ్బ తీయడానికి ప్రయత్నించారు.

జానకిరామయ్య ఇన్‌ఛార్జి విసిగా ఉన్నప్పుడు బిఇడి కాలేజీలకు సంబంధించి డబ్బులు తీసుకున్నారంటూ….ఓ విద్యార్థి సంఘంతో ఒక ఆడియోను విడుదల చేయించారు. వాస్తవంగా అందులో జానకిరామయ్య డబ్బులు అడుగుతున్నట్లు ఎక్కడా లేదు. ఆయన మాట్లాడిన మాటలను ఎడిట్‌ చేసి, ఎదో జరిగింది అని అనుమానం కలిగేలా….ఆ వీడియో టేపును సిద్ధం చేసి విడుదల చేశారు. అదీ ఎప్పుడో జరిగిన దాన్ని…ఆమెపై ఫిర్యాదులు, ఆరోపణలు వస్తున్న తరుణంలో మీడియాకు విడుదల చేయించారు.

ప్రైవేట్‌ బిఇడి కాలేజీలతో కలిసి కుట్ర

వాస్తవంగా జానకిరామయ్య ఇన్‌ఛార్జి విసిగా ఉన్నప్పుడు 26 బిఇడి కాలేజీలపైన రూ.20 లక్షల ఫైన్‌ విధించారు. (ఒరియా బిఇడి విద్యార్థులు బ్లాక్‌ టీచింగ్‌ ప్రోగ్రాంలో పాల్గొనని కారణంగా ఈ ఫైన్‌ విధించారు) ఈ ఫైన్‌ చెల్లించడంలో జాప్యం జరిగితే….దీనికీ అపరాధ రుసుం విధించారు. అదేవిధంగా గతంలో బిఇడి రాసిన వారంతా పాస్‌ అయ్యేవారు. 100 శాతం ఫలితాలు వచ్చేవి. ఇందుకు బిఇడి కాలేజీలు అడ్డదారులు తొక్కేవి. జానకి రామయ్య వీటికి అడ్డుకట్ట వేశారు. కేవలం 35 శాతం మాత్రమే పాస్‌ అయ్యారు. ఇది బిఇడి కాలేజీలకు కంటగింపుగా మారింది. ఆ కాలేజీలు, ఆమెతో కలిసి తనపై కుట్ర చేశాయని జానకిరామయ్య వాపోతున్నారు. దీనిపైన ఎటువంటి విచారణకైనా సిద్ధమని ఆయన చెబుతున్నారు.

ఏదిఏమైనా యూనివర్సిటీలో జరుగుతున్న పరిణామాలు గమనిస్తే…విసి, రెక్టార్‌ అందరూ డమ్మీ అయిపోయారు. ఆమే బిగ్‌బాస్‌గా చెలామణి అవుతున్నారు. అమరావతి స్థాయిలో తమకు పలుకుబడి ఉందని, తాము తలచుకుంటే ఏమైనా చేయగలమని బెదరిస్తూ తనకు తానే సూపర్‌ బాస్‌గా పెత్తనం చేస్తున్నారు. ప్రభుత్వ పెద్దలు స్పందించి లోతుగా విచారణ జరిపిస్తే….అనేక అంశాలు వెలుగులోకి వస్తాయి. లేదంటే యూనివర్సిటీ పరుగు మరింతగా దిగజారుతుందనడంలో సందేహం లేదు.

– ఆదిమూలం శేఖర్

విసి గీసీ జాన్తా నై..! నేనే బిగ్‌ బాస్‌…!

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*