ఆర్థిక సంక్షోభంలోకి తిరుమల శ్రీవారు!

తిరుమల తిరుపతి దేవస్థానం (టిటిడి) ఆర్థిక సంక్షోభంలోకి వెళుతున్న ప్రమాద ఘంటికలు గోచరిస్తున్నాయి. ఒకవైపు డిపాజిట్లు తగ్గిపోతున్నాయి, వడ్డీరేట్లలో కోతపడుతోంది, మరోవైపు ఖర్చులు అదుపుతప్పుతున్నాయి….వెరసి టిటిడి భవిష్యత్తు ఆందోళన కలిగించేలా ఉంది. 2018-19 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన బడ్జెట్‌ను పరిశీలిస్తే…టిటిడి మరింత పటిష్టమైన ఆర్థిక విధానాలను రూపొందిం చుకోవాల్సిన ఆవశ్యకత కనిపిస్తోంది. టిటిడి 2018-19 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి రూ.2,893 కోట్లతో వార్షిక బడ్జెట్‌ను రూపొందించింది. గత ఏడాది బడ్జెట్‌ రూ.2,858 కోట్లుగాకా 2016-17లో రూ.2,812 కోట్లు. ఏటా హుండీ ఆదాయం పెరుగుదల వల్ల బడ్జెట్‌ పెరుగుతున్నా, వడ్డీ రూపంలోనూ వస్తున్న ఆదాయం తగ్గిపోతోంది. ఖర్చులు విపరీతం అవుతున్నాయి. దీంతో లోటుబడ్జెట్‌లోకి వెళ్లాల్సిన పరిస్థితులు దాపురించేలావున్నాయి.

భారీగా తగ్గిన డిపాజిట్లు
సాధారణంగా హుండీ ద్వారా వచ్చే ఆదాయాన్ని క్యాపిటల్‌ ఆదాయంగా పరిగణిస్తారు. కానుకల ద్వారా వచ్చే ఈ ఆదాయాన్ని శాశ్వత పనులకు వినియోగించగా మిగిలిన దాన్ని డిపాజిట్‌ చేయాలి. ఈ డిపాజిట్లపై వచ్చే వడ్డీతో పాటు దర్శనాల టికెట్లు, ప్రసాదాల విక్రయాలు, తలనీలాల విక్రయాలు వంటి ద్వారా వచ్చే ఆదాయాన్ని రెవెన్యూ ఆదాయం అంటారు. రెవెన్యూ ఆదాయం నుంచే ఉద్యోగుల జీతభత్యాలు, మార్కెటింగ్‌ సరుకుల కొనుగోలు, విద్యుత్‌ ఛార్జీలు వంటివాటి కోసం ఖర్చు చేయాలి. డిపాజిట్లు ఎంత ఎక్కువగా ఉంటే వడ్డీ అంత ఎక్కువగా వస్తుంది. భవిష్యత్తులో హుండీ ఆదాయం తగ్గినా…వడ్డీ రావడం వల్ల ఆలయ నిర్వహణకు ఇబ్బంది లేకుండా ఉంటుంది. అయితే డిపాజిట్‌ చేసే మొత్తమే తగ్గిపోతోంది. గత ఏడాది (2017-18లో) రూ.533 కోట్లు డిపాజిట్‌ చేయాలని లక్ష్యం పెట్టుకున్నారు. అయితే ఆచరణలో డిపాజిట్‌ చేసింది రూ.268 కోట్లు మాత్రమే. అంటే దాదాపు 50 శాతం మాత్రమే. దీంతో 2017-18లో డిపాజిట్ల లక్ష్యాన్ని రూ.200 కోట్లకు కుదించేసుకున్నారు. 2016-17లో రూ.475 కోట్లు, 2015-16లో ఇది రూ.783 కోట్లు, 2014-15లో రూ.969 కోట్లు డిపాజిట్‌ చేశారు. అలాంటిది 2018-19లో రూ.200 కోట్లు మాత్రమే డిపాజిట్‌ చేయగలమని అంచనా వేశారు. అంటే నాలుగేళ్ల క్రితంతో పోల్చితే దాదాపు రూ.769 కోట్లు తగ్గినట్లు లెక్క.

డిపాజిట్లు తగ్గడానికి కారణం ఏమిటి?
డిపాజిట్లు చేయడం అంటే భవిష్యత్తు అవసరాలను దృష్టిలో పెట్టుకుని వచ్చే ఆదాయంలో కొంత పొదుపు చేయడమే. ఆదాయం తగ్గినపుడు పొదుపూ తగ్గుతుంది. టిటిడి విషయంలో ఆదాయం తగ్గడం లేదు. పెరుగుతోంది. అయినా డిపాజిట్లు భారీగా తగ్గాయి. హుండీ ద్వారా వచ్చే కానుకలను పరిశీలిస్తే….2014-15లో రూ.993 కోట్లు, 2015-16లో రూ.1000 కోట్లు, 2016-17లో రూ.1010 కోట్లు వచ్చాయి. 2017-18లో 1,116 కోట్లు వచ్చాయి. అంటే హుండీ ద్వారా వస్తున్న ఆదాయం పెరుగుతూనే ఉంది. 2014-15లో రూ.993 కోట్లు వచ్చినపుడే….రూ.969 కోట్లు డిపాజిట్‌ చేశారు. అలాంటిది రూ.1,116 కోట్ల ఆదాయం వచ్చినపుడు డిపాజిట్లు రూ.268 కోట్లుకు పడిపోవడం ఆశ్చర్యం కలిగిస్తుంది.

రూ.200 కోట్ల మేర తగ్గిపోయిన వడ్డీ
డిపాజిట్లు తగ్గడం, వడ్డీ రేట్లలో బ్యాంకులు కోత విధించడం వల్ల వడ్డీ కాసుల వాడికి వస్తున్న వడ్డీ కూడా భారీగా తగ్గుతోంది. 2017-18లో వడ్డీ రూపంలో రూ.807 కోట్లు వస్తుందని అంచనా వేశారు. ఆచరణలో రూ.747 కోట్లు మాత్రమే వచ్చింది. 2014-15లో రూ.714 కోట్ల వడ్డీ వచ్చింది. 2015-16లో రూ.759 కోట్లు అయింది. 2016-17లో వడ్డీని రూ.762 కోట్లు వచ్చింది. ఈ గణాంకాలను పరిశీలిస్తే….వడ్డీ పెద్దగా పెరిగింది లేదు. టిటిడికి మొత్తంగా 11 వేల కోట్ల రూపాయల డిపాజిట్లు ఉన్నాయి. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో రూ.747 కోట్లు మాత్రమే వస్తాయని అంచనా వేస్తున్నారు. అంటే గత ఏడాది వచ్చిన రూ.807 కోట్లు కూడా రాదన్నమాట. రూ.140 కోట్లు తగ్గిపోతాయన్నమాట. దీనికి ప్రధాన కారణం వడ్డీ రేట్లు తగ్గిపోవడమే. పెద్దనోట్ల రద్దు తరువాత అన్ని బ్యాంకులూ వడ్డీ రేట్లను తగ్గించాయి. ఫలితంగానే ఏటా టిటిడి రూ.200 కోట్ల మేర వడ్డీ నష్టపోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. వడ్డీ రేట్లు తగ్గిపోయినపుడు డిపాజిట్లను పెంచగలిగితే….వచ్చే వడ్డీ సమతుల్యం అవుతుంది. అదీ చేయడం లేదు.

టిటిడికి పటిష్టమైన ఆర్థిక విధానం అవసరం ఉంది. టిటిడి నిధులను దేనికి ఖర్చు చేయాలి, ఎంత ఖర్చు చేయాలని అనేదానిపై పక్కా విధివిధానాలను రూపొందించుకోవాలి. దుబారాను, అనినీతిని అరికట్టడానికి చర్యలు తీసుకోవాలి. అన్నింటికీ మించి దేవుడి డబ్బులు ఖర్చు చేస్తున్నామన్న స్పృహ పాలక మండలికిగానీ, అధికారులకుగానీ ఉండాలి. డబ్బులున్నాయి కదా అని ఖర్చ పెట్టుకుంటూ వెళితే… భవిష్యత్తులో ఇబ్బందులు తలెత్తవచ్చు. టిటిడి బడ్జెట్‌ రూ.3000 కోట్లకు చేరుకుంటోంది. ఈ నేపథ్యంలో పటిష్టమైన ఆడిటింగ్‌ వ్యవస్థ కూడా ఉండాలి. టిటిడి ఆడిటింగ్‌ను కాగ్‌కు అప్పగించాలన్న డిమాండ్‌ చాలాకాలంగా ఉంది. ఇది కచ్చితంగా టిటిడికి మేలు చేసేదే తప్ప…నష్టం చేసేదికాదు. అందుకే దీన్ని పరిశీలించాలి.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*