ఆర్‌కె పాఠం…మోడీకి, కెసిఆర్‌కే కాదు చంద్రబాబుకూ వర్తిస్తుంది..!

తెలుగు ప్రజలకు సుపరిచితులైన సీనియర్‌ పాత్రికేయులు; ఆంధ్రజ్యోతి పత్రిక, టివి ఛానల్‌ అతినేత రాధాకృష్ణ ఈ ఆదివారం కొత్త పలుకు శీర్షికన ఓ సవివరమైన కథనాన్ని రాశారు. ఇదే కథనం వీకెండ్‌ కామెంట్‌ పేరుతో ఏబిఎన్‌ ఛానల్‌లో ప్రసారమయింది.

ఈ శీర్షికలు వారం వారం వచ్చేవేగానీ….ఈ వారం ఆయన దేశంలో మీడియా పరిస్థితిపైన ఆవేదనాపూర్వక కథనం రాశారు. ఇందులో చాలా అంశాలను చర్చించారు. పాలకుల అదుపాజ్ఞల్లో పని చేస్తున్న మీడియా ఏ విధంగా చేష్టలుడిగిందో వివరించారు. ప్రధాన స్రవంతి మీడియా విశ్వసనీయతను కోల్పోతున్న తీరుపై ఆవేదన వ్యక్తం చేవారు. ఇదే సమయంలో సోషల్‌ మీడియా పోషిస్తున్న పాత్రనూ, దానికి పెరుగుతున్న ప్రాధాన్యతను, విశ్వసనీయతనూ ప్రస్తావించారు.

ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ….జాతీయ స్థాయిలో మీడియాను ఏ విధంగా తన అదుపాజ్ఞల్లో పెట్టుకున్నారో ఉదాహరణలు సహా వివరించారు రాధాకృష్ణ. రాఫెల్‌ కుంభకోణం గురించి ఎవరు ఎంతగా అరచి గీపెట్టుకుంటున్నా జాతీయ మీడియా దాన్ని పట్టించుకోలేదని ఆయన చెప్పిన దాంట్లో వాస్తవం ఉంది. అంత పెద్ద వ్యవహారానికి జాతీయ మీడియాలో దక్కాల్సినంత ప్రాధాన్యత దక్కలేదు. ఈ నాలుగున్నరేళ్లుగా మీడియాను తన కనుసన్నల్లో ఉంచుకుని శాసిస్తున్నా…క్రమంగా పడిపోతున్న తన ప్రతిష్టను, ప్రభను మోడీ ఆపలేకపోయారని చెప్పారు.

జాతీయ మీడియా తరహాలోనే తెలంగాణలోనూ మీడియా తలవంచుకునే పని చేస్తున్నాయని ఆర్‌కె వ్యాఖ్యానించారు. ప్రభుత్వంలో ఉన్న పెద్దలతో గొడవెందుకులే అనే రాజీ ధోరణిని మీడియా అలవచ్చుకుందని చెప్పారు. ప్రతిపక్షాలకు ప్రాధాన్యత ఇవ్వలేని స్థితిలో మీడియా ఉందని వాపోయారు. వ్యతిరేక వార్తలు రానంతమాత్రాన అంతా సవ్యంగా ఉందన్న భ్రమలో పాలకులు బతికేస్తున్నారని చురకలేశారు.

ప్రధాన స్రవంతి మీడియా ఏకపక్షంగా ఉండటం వల్ల ప్రభుత్వ వ్యతిరేక వార్తలు ఇవ్వడం లేదని, దీంతో ఆ పాత్రను సోషల్‌ మీడియా పోషిస్తోందని విశ్లేషించారు. దీనికి చక్కటి ఉదాహరణ కూడా ఇచ్చారు. కొంగరల్‌కలాన్‌లో టిఆర్‌ఎస్‌ భారీ బహిరంగ సభ నిర్వహించడానికి ప్రయత్నించింది. అయితే ఆ సభ ఆశించిన స్థాయిలో జరగలేదు. ఈ విషయాన్ని ప్రధాన ప్రసంతి మీడియా చూసీచూనట్లు వ్యవహరించినా…సోషల్‌ మీడియా మాత్రం వదిలిపెట్టలేదు. కాయకష్టం చేసేవారి చేతిలోనూ స్మార్ట్‌ఫోన్‌ ఉన్న నేటి రోజుల్లో మీడియా దాచిపెట్టాలనుకున్నా…నిజాలు దాగడం లేదు. అందరికీ తెలిసిపోతున్నాయి…అని మంచి విశ్లేషణ చేశారు.

ఆర్‌కె చెప్పినట్లు….అతి జాతీయ మీడియాగానీ, తెలంగాణలోని తెలుగు మీడియాగానీ.. వెన్నెముక విరినట్లు వ్యవహరిస్తున్నాయనడంలో సందేహం లేదు. పాలక పార్టీల పెద్దల పల్లకీలు మోస్తున్నాయనడంలో సందేహం లేదు. అయితే…ఇక్కడ ఆయన మిస్‌ అయిన అంశం ఏమంటే….ఆంధ్రప్రదేశ్‌ మీడియా ఎలావుందన్న విశ్లేషణే. జాతీయ, తెలంగాణ మీడియాకంటే ఆంధ్రప్రదేశ్‌ మీడియా భిన్నంగా ఏమీ లేదు. ఆర్‌కె చెప్పిన పాఠం మొత్తం అక్షరం పొల్లుపోకుండా ఆంధ్రప్రదేశ్‌కూ సరిపోతుంది.

ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు…ఆహా అంటే ఆహా అనడం, ఛీ అంటే ఛీ అనడం ఇక్కడి మీడియాకు అలవాటైపోయింది. ప్రత్యేక హోదా ఏమీ సంజీవిని కాదని బాబు అంటే…మీడియా అదే చెప్పింది. ఇప్పుడు హోదా కోసమే పోరాడుతున్నానంటూ అద్భుతం అంటోంది. రాష్ట్రంలోకి ఏబిసి రావొద్దంటే…కరెక్టే అంటోంది. బద్ధ శత్రువు కాంగ్రెస్‌తో కలిసినా…బాబుగారి చాణక్యమని చెబుతోంది. నాలుగేళ్లు బిజెపితో కలిసి ఇప్పుడు ఆ పార్టీపై యుద్ధం చేస్తున్నానని చెబుతుంటే…మహావీరుడు అంటూ కీర్తిస్తోంది.

ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాల్లోని తప్పుపొప్పులను నిశితంగా విమర్శించే మీడియా ఆంధ్రప్రదేశ్‌లో కరువయింది. చిన్న ఉదాహరణ చాలు…మూడున్నర దశాబ్దాల పాటు బద్ధ శత్రువులుగా ఉన్న కాంగ్రెస్‌ – టిడిపి కలిశాయి. చీమ చిటుక్కుమన్నా…ఏ చీమ ఎప్పుడు చిటుక్కుమంది, ఎక్కడ చిటుక్కుమంది అంటూ గత చరిత్ర మొత్తం నిమిషాల్లో వెలికి తీసి ప్రచురించగల పరిశోధన డెస్క్‌లు ఉన్న పత్రికలు కూడా…టిడిపి-కాంగ్రెస్‌ గత వ్యవహారాల గురించి ఒక్కటంటే ఒక్క మాట రాయలేదు. రాజధాని అమరావతిలో ఏమి జరుగుతోందో నిజం చెప్పేవాళ్లు లేరు. పట్టిసీమ రాయలసీమ కోసమే కట్టామని ప్రభుత్వం చెప్పింది. ఇప్పుడు ఆ పట్టిసీమ వల్ల రాయలసీమకు ఒరిగిందేమిటో పరిశీలించి నాధుడు లేరు. ఇలా ఎన్నో అంశాలున్నాయి.

అందుకే….రాధాకృష్ణ వీకెండ్‌ కామెంట్‌, కొత్త పలుకు నిష్టూరంగా ఉన్నా అటు మీడియాకు, ఇటు ప్రభుత్వ పెద్దలకు పాఠం వంటిదే. ఈ పాఠం మోడీకి, కెసిఆర్‌కు, బాబుకూ అవసరమే. పాఠాలు, గుణపాఠాలతో మాకు సంబంధం లేదు…మాదారి మాదే అని అనుకుంటే…ఆర్‌కె చెప్పినట్లు సోషల్‌ మీడియా ఎటూ ఉండనేవుంది. అది ఇంకాస్త పదునెక్కుతుంది. అదే ఆయుధమవుతుంది.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*