ఆ ఆడబిడ్డను చూశాక…కొడుకుల్లేరన్న దిగులే ఉండదు..!

కొడుకైతేనా వృద్ధాప్యంలో తమను‌ సంరక్షిస్తాడని చాలామంది తల్లిదండ్రులు భావిస్తుంటారు. కొడుకులు పుట్టలేదని బాధపడుతుంటారు.‌ అలాంటి వారు…ఈ‌ ఆడబిడ్డ గురించి తెలుసుకుంటే… కూతుళ్లయినా తమను సంరక్షించగలరన్న నమ్మకం తప్పక కలుగుతుంది.

ఇంతకీ సంగతి ఏమిటంటే..బీహార్ రాష్ట్రం దర్భంగలోని సిర్హుల్లి గ్రామానికి చెందిన మోహన్ పాసవాన్…హరియాణాలోని గుర్​గ్రామ్​​లో​ ఆటో డ్రైవర్​గా పనిచేస్తున్నాడు. కుటుంబం మొత్తం ఇతని సంపాదనపైనే ఆధారపడి ఉంది. దురదృష్టవశాత్తు జనవరిలో మోహన్​కు యాక్సిడెంట్ అయింది. మోకాలికి బలమైన గాయం కావడం వల్ల హరియాణాలోనే చికిత్స చేయించుకున్నాడు.

అంతలో దేశవ్యాప్తంగా లాక్​డౌన్ ప్రకటించడం వల్ల కూతురితో పాటు గురుగ్రామ్​లోనే చిక్కుకు పోయాడు. ఈ పరిస్థితుల్లో మోహన్​ వద్ద రూ. 500 మాత్రమే ఉన్నాయి. మరోవైపు…రెండు రోజుల్లో ఇల్లు ఖాళీ చేయాలని యజమాని ఒత్తిడి తెచ్చాడు. ఆ డబ్బుతో అవసరమైన సరకులు తెచ్చుకుందామని కూతురు జ్యోతికి సూచించాడు మోహన్. అయితే జ్యోతి మాత్రం ఐదు వందలతో పాత సైకిల్ కొని.. తండ్రిని ఎక్కించుకుని తమ స్వస్థలం దర్భంగకు బయల్దేరింది. తండ్రిని వెనుక కూర్చొబెట్టుకొని ఏకంగా 1,300 కిలోమీటర్లు ప్రయాణించింది. దారిలో దాతలు ఇచ్చిన ఆహారం తిని అక్కడక్కడ ఆగుతూ.. ఆశ్చర్యకరంగా ఎనిమిది రోజుల్లోనే తన స్వగ్రామం సిర్హుల్లికి చేరుకున్నారు. అంత దూరం సైకిల్​పై వెళ్లే అవకాశం లేదని తన కూతురుతో వారించానని మోహన్ చెప్పుకొచ్చాడు. అయినా తన కూతురి సంకల్ప బలంతోనే ఇదంతా సాధ్యమైందని అన్నాడు. బాలిక చేసిన సాహసానికి అందరూ మెచ్చుకున్నారు. ఇప్పుడు చెప్పండి ఆడబిడ్డలు… తమ తల్లిదండ్రులను సంరక్షించుకోలారా..!

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*