ఆ ఆర్‌టిసి డ్రైవర్‌ ‘మనుషుల్లో దేవుడు’!

గత నెల 11వ తేదీన హైదరాబాద్‌ బిహెచ్‌ఇఎల్‌ నుంచి విజయవాడకు ఆర్‌టిసి ఏసి బస్సు బయలుదేరాల్సివుంది. అందులో ప్రయాణించడానికి టికెట్‌ రిజర్వు చేసుకున్న ఓ ప్రయాణికుడు సమయానికి బస్సు వద్దకు చేరుకోలేదు. చాలాసేపు వేచిచూసిన డ్రైవర్‌ ఆలస్యంగా బయలుదేరారు. ఆ తరువాత కొంత సేపటికి ఫోన్‌ చేసిన ప్రయాణికుడు డ్రైవర్‌ను నానా బూతులు తిట్టారు. రాయలేని భాషలో తిట్టనా డ్రైవర్‌ ఎన్‌.కుమారరాజు మాత్రం చాలా నెమ్మదిగా సమాధానం ఇచ్చారు. ఇదంతా సెల్‌ఫోన్‌లో రికార్డు అయింది. దీన్ని విజయవాడలో ఉన్నతాధికారులకు అందజేశారు డ్రైవర్‌. ఆ సంభాషణ మొత్తం విన్న ఆర్‌టిసి మేనేజింగ్‌ డైరెక్టర్‌, ఐపిఎస్‌ అధికారి సురేంద్రబాబు ఆశ్చర్యపోయారు. ప్రయాణీకుడు అంత పరుషంగా మాట్లాడినా డ్రైవర్‌ ఇచ్చిన సమాధానం విని ‘నువ్వు మనుషుల్లో దేవుడివి’ అని అభినందించారు. ఒక ఎండి స్థాయి అధికారి డ్రైవర్‌ను ఆ విధంగా అభినందించడం అరుదైన విషయమనే చెప్పాలి.

ఇందులో ఇంకో మలుపు కూడా ఉంది. డ్రైవర్‌ను దూషించిన ప్రయాణీకుడిపై చట్టపరమైన చర్యలకు ఉపక్రమించారు ఆర్‌టిసి ఎండి. అయితే…తన తప్పును అంగీకరించిన సదరు ప్రయాణీకుడు…పరిహారంగా రూ.10,000 డ్రైవర్‌కు చెల్లించడానికి సిద్ధపడ్డారు. దీంతో కేసులు వంటివి లేకుండా…ఆ ప్రయాణీకుడు ఇచ్చిన రూ.10,000 చెక్కును డ్రైవర్‌ కుమారరాజుకు అందజేశారు మేనేజింగ్‌ డైరెక్టర్‌. చిన్నస్థాయి ఉద్యోగి అయిన తనపట్ల ఉత్యున్నత స్థాయి అధికారి చూపిన శ్రద్దతో ఆ ఆడ్రైవర్‌ ఉబ్బితబ్బిబ్బి అవుతున్నారు. ‘మనుషుల్లో దేవుడు నేను కాదు…మీరేసార్‌’ అని చేతులెక్కి ఎం.డికి మొక్కుతున్నారు డ్రైవర్‌.

సంస్థలో ఇటువంటి ఆదర్శవంతమైన సిబ్బంది ఉండాలి. అప్పుడే ఏ సంస్థ ప్రతిష్ట అయినా పెరుగుతుంది. ఇదే సమయంలో ఆర్‌టిసి ఎండి సురేంద్రబాబు వంటి అధికారులు ఉండటమూ అవసరమే. తప్పు లేనపుడు అధికారులు అండగా నిలబడితే…ఉద్యోగులు మరింత బాధ్యతగా, ఉత్సాహంగ పని చేస్తారు.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*