ఆ కార్టూన్‌ సారాంశాన్ని ఇలా చెప్పవచ్చా!!

కఠువాలో 8 ఏళ్ల బాలికపై సామూహిక అత్యాచారానికి ఒడిగట్టి, ఆమెను దారుణంగా హతమార్చిన ఘటనపై దేశ వ్యాపితంగా కులమతాలకు అతీతంగా జనం రోడ్లపైకి వచ్చి నిరసన తెలియజేస్తుంటే….నిందితులకు మద్దతుగా నిలుస్తున్న ‘భక్తులు’ కొందరున్నారు. దీన్నిచూసి దేశం విస్మయం చెందుతోంది. ఇలాంటి జనమూ మన మధ్యనే ఉన్నారా? అని హేవగించుకుంటున్నారు. ఈ హేవగింపు నుంచే స్వాతి వడ్లమూడి అనే ఆంగ్ల పత్రిక జర్నలిస్టు…ఓ కార్టున్‌ ద్వారా కఠువా ఘటనపై స్పందించింది. ‘రామా….నన్ను రావణాసుడు ఎత్తుకెళ్లబట్టి సరిపోయింది…నీ భక్తుల చేతికి చిక్కివుంటే….ఏమయ్యేదాన్నో…’ అనేది ఆ కార్టూన్‌ భావన. దీనిపై ఛాందసవాదలు రెచ్చిపోతున్నారు. ఆమెపై కేసు పెట్టారు. పోలీసులూ ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేశారు. ఆమె పోస్టును షేర్‌ చేసినందుకు ఆంగ్ల జర్నలిస్టుపైనా పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు.

journalist swati

ఓ బాలిక కామోన్మాదుల చేతుల్లో బలైపోతే…దాన్ని ఎవరూ సమర్థించలేరు. కానీ…బాలిక మతాన్ని చూసి కొందరు ఆమెకు వ్యతిరేకంగా, నిందితులకు అనుకూలంగా మాట్లాడుతున్నారు. హిందూ మత విశ్వాసకుల పేరుతో కొందరు చేస్తున్న ఈ ఆమానవీయ వాదనలు చూసి…అదే హిందూ విశ్వాసాలను అనుసరించే వారూ ఎంతగానో మదనపడుతున్నారు. హిందూ మతంపై ఎంతో ప్రేమవుంటే ఓ బ్లాగర్‌ ఏం రాశారంటే….’ హిందుత్వ ఔన్నత్యాన్ని మంట కలిపారు కదరా..! మీలాంటి రాక్షస ప్రవత్తి కలవారు చేసే దుర్మార్గపు పనులు సగటు హిందువు మనసును ఎంత కల్లోలానికి గురి చేస్తున్నాయో మీకు తెలుసా… ఆధ్యాత్మికంగా ఓనమాలు రానివాళ్లతోనూ ఆ భగవంతుని మీరు తిట్టిస్తుంటే… మీ ప్రత్యర్థులు ఆ భగవంతునిపై సెటైర్లు వేస్తుంటే మా మనోభావాలు ఎంతగా దెబ్బతింటున్నాయో తెలుసా… అయినా ఏమీ అనలేని పరిస్తితి. ఎందుకంటే తప్పు వాళ్లది కాదు కాబట్టి. మీలో మార్పు రాకపోతే మీలాంటి వారిని వధించడానికి మీరు కీర్తించే శివాజీ, శ్రీరాముడు, వినాయకుడు లాంటివారే మళ్లీ పుట్టాల్సి వస్తుంది.’ అని రాశారు. పసిమొగ్గను నులిమేసిన కిరాతకులను సమర్థిస్తున్న వారిపట్ల ఇలాంటి ధర్మాగ్రహమే ఎవరికైనా కలుగుతుంది. అలాంటిది ఓ మహిళగా, జర్నలిస్టుగా స్వాతి ఓ కార్టున్‌ గీస్తే ఆమెపై విరుచుకుపడుతున్నారు ఛాందసులు. ‘రామా..రావణుడు నన్ను ఎత్తుకెళ్లడాన్నీ సమర్థించేవాళ్లు తయారయ్యారు…ఏమిటీ భూలేకం తీరు…’ అని సీత రాముని వద్ద కన్నీళ్లు పెట్టుకుటోంది. ఆ కార్టూన్‌ని ఇలా కొద్దిగా మార్చితే…తప్పవుతుందా?!

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*