ఆ డాగ్ మరణానికి పోలీసుల సంతాపం… ఘనంగా అంత్యక్రియలు

ధర్మచక్రం ప్రతినిధి – తిరుపతి

ఎర్రచందనం టాస్క్ ఫోర్స్ విధులలో విశేష ప్రతిభ కనబరిచిన డాగ్ స్క్వాడ్ బిట్టూ శనివారం రాత్రి మరణించింది. ఎర్ర చందనం స్మగ్లర్లు దాచి ఉంచిన ఎర్ర చందనం దుంగలను కనుగొనడంలో బిట్టూ దిట్టగా పేరుపొందింది. కొన్ని సందర్భాలలో దాగి ఉన్న స్మగ్లర్లును కూడా చూపించి, టాస్క్ ఫోర్స్ ప్రతిష్ఠ ను ఇనుమడించేలా చేసింది. తిరుపతి అర్బన్ ఎస్పీ అధీనంలో ఉంటూ, టాస్క్ ఫోర్స్ కు సేవలు అందజేసిందని టాస్క్ ఫోర్స్ ఇంచార్జి పి రవిశంకర్ తెలిపారు. ఆయన ఆదివారం మాట్లాడుతూ బిట్టూ ఒక రకమైన కాన్సర్ వ్యాధితో మరణించదని‌ తెలిపారు. ఆదివారం దానికి పోస్టుమార్టం నిర్వహించి, ఘనంగా అంత్యక్రియలు చేసినట్లు తెలిపారు. స్వంత ఖర్చులతో బిట్టూకి ఐస్ బాక్స్ ను ఏర్పాటు చేశామని అన్నారు.

టాస్క్ ఫోర్స్ కు మూడు డాగ్ స్క్వాడ్ లను కేటాయించగా బిట్టూ 2017 ఫిబ్రవరి 21 నుంచి తన సేవలను అందజేస్తోందని అన్నారు. అది 2016 జనవరి 13వ తేదీన జన్మించిందని చెప్పారు. ఎర్ర చందనం దుంగలను కనుగొనే ప్రత్యేకతతో మొయినాబాద్ లో శిక్షణ పొందినట్లు తెలిపారు. 8 నెలలు శిక్షణ పూర్తిచేసుకుని, టాస్క్ ఫోర్స్ కార్యాలయం కు వచ్చిందని, కానిస్టేబుల్ కిషోర్ కుమార్ పర్యవేక్షణ లో ఉండేదని తెలిపారు. ఇటీవల టాస్క్ ఫోర్స్ కార్యాలయంలో జరిగిన డ్యూటీ మీట్ లో విద్యార్థుల సమక్షంలో పలు విన్యాసాలు చేసిందని తెలిపారు. బిట్టూ మరణం టాస్క్ ఫోర్స్ కు తీరని లోటని అన్నారు. తిరుపతి అర్బన్ ఎస్పీ రమేష్ రెడ్డి బిట్టూ మరణ వార్త విని దురదృష్ట కరమైన సంఘటన గా పేర్కొని ఆవేదన వ్యక్తం చేశారన్నారు.‌ఆయన ప్రత్యేకంగా ఒక అధికారిని నియమించి పోస్ట్ మార్టం ఏర్పాట్లు చేపట్టారని అన్నారు. టాస్క్ ఫోర్స్ సిబ్బంది అందరూ బిట్టూకి అంజలి ఘటించి నివాళులు అర్పించారు.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*