ఆ ద్వీపానికి వెళితే…శవం తిరిగి రావడమూ కష్టమే…!

అండమాన్‌ నికోబార్‌ దీవుల్లోని సెంటినెల్‌ ద్వీపం గురించి ఇప్పుడు ప్రపంచ వ్యాపితంగా చర్చ జరుగుతోంది. అమెరికా పర్యాటకుడు జాన్‌ను హత మార్చడంతో ఆ తెగ గురించి అనేక విషయాలు బయటకు వస్తున్నాయి. ఆధునిక ప్రపంచంతో సంబంధం లేకుండా, వేల సంవత్సరాలనాటి ఆటవిక జీవితానికే పరిమితైపోయిన…ఆ ఆదిమ తెగ మనుషులు…తమను తాము రక్షించుకోడానికి ఎంతకైనా తెగిస్తారని జాన్‌ విషయంలోనే కాదు…గతంలోనూ అనేక పర్యాయాలు స్పష్టమైయింది. ఆ ద్వీపంలోకి వెళితే…మృత దేహం తిరిగి రావడం కూడా కష్టమే. జాన్‌ మృతదేహం ఏమయిందో కూడా తెలియడం లేదు.

గతంలో సెంటినెలీన్‌ తెగ చేతిలో ప్రాణాలు కోల్పోయిన మత్స్యకారుల మృతదేహాలను తీసుకురావడానికి తీరప్రాంత రక్షక దళం ఎంతగా శ్రమించాల్సివచ్చిందో…కమాండెంట్‌  ప్రవీణ్‌ గౌర్‌ మీడియాకు వివరించారు….

‘‘సెంటినెల్‌ ద్వీపం ఉత్తర, దక్షిణ ప్రాంతాలన్నీ గాలించాం. సెంటినెల్‌ ఉత్తరం వైపు కొంచెం దగ్గరగా వెళ్తుండగా మాకు పడవ ఉన్నట్లు కనిపించింది. ఇంకా దగ్గరి నుంచి చూద్దామని హెలికాప్టర్‌ను కొంచెం కిందకు దించాం. అప్పటికే మాకు సెంటినెలీస్‌ తెగ నుంచి ఎదురయ్యే ప్రమాదాల గురించి తెలుసు. అయితే కనిపించకుండా పోయిన మత్స్యకారుల గురించి ఆచూకీ లేదా ఏదైనా క్లూ లభిస్తుందని హెలికాప్టర్‌ను బీచ్‌లో దించాలని అనుకున్నాం. హెలికాప్టర్‌ను ఇంకాస్త కిందకు దించేసరికి ఆ తెగ వారు బాణాలతో మమ్మల్ని వెంబడించడం ప్రారంభించారు. వాళ్ల బాణాలు దాదాపు వంద అడుగుల ఎత్తు వరకు వచ్చాయి. దీంతో ప్లాన్‌-బి అమలు చేయాలని అనుకున్నాం’’ అని ప్రవీణ్‌ తెలిపారు.

‘‘దాదాపు 50 మంది సెంటినెలీస్‌ తెగ వారు మాపై దాడి చేసేందుకు ప్రయత్నిస్తున్నారు. వాళ్లు ఏదో ఎరుపు రంగు వస్త్రం నడుము చుట్టూ కట్టుకున్నట్లు కనిపించింది. వారిలో మహిళలెవరూ లేరు. ప్లాన్‌-బి ప్రకారం.. నేను హెలికాప్టర్‌ను పడవ ఉన్న ప్రదేశానికి దూరంగా తీసుకెళ్లడం ప్రారంభించాను. దాదాపు కిలోమీటరున్నర కంటే ఎక్కువ దూరం వెళ్లాను. వాళ్లు కూడా హెలికాప్టర్‌ను వెంబడిస్తూ వచ్చారు. దీంతో నేను వెంటనే హెలికాప్టర్‌ వెనక్కి మళ్లించి తిరిగి బోటు ఉన్న ప్రదేశానికి చేరుకున్నాను. వాళ్లు చాలా దూరం వెళ్లినందున వెంటనే తిరిగి రాలేరు. కాబట్టి నేను పడవ సమీపంలో హెలికాప్టర్‌ను ల్యాండ్ చేశాను. పడవకు కొద్ది దూరంలో గుంతల్లాగా కనిపించింది. వాటిని పరిశీలించమని సిబ్బందితో చెప్పాను. వాటిని తవ్వి చూడగా ఓ వ్యక్తి మృతదేహం కనిపించింది. పడవకు సంబంధించిన తాడుతో ఉరి వేసి చంపినట్లుగా అపిపించింది. ఒక మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నాం. మరో గుంత తవ్వుతుండగా తెగ వాళ్లు తిరిగి వస్తున్నట్లు అర్థమైంది. దీంతో వెంటనే ఆ మృతదేహాన్నితీసుకుని తిరిగి హెలికాప్టర్‌ టేకాఫ్‌ చేసి అక్కడి నుంచి వచ్చేశాం’’ అని వివరించారు.

‘పోర్ట్‌ బ్లెయిర్‌లో మత్స్యకారుడి మృతదేహాన్ని కుటుంబసభ్యులకు అప్పగించాం. కానీ మరో మృతదేహం కోసం మళ్లీ ద్వీపానికి వెళ్లాం. ఈసారి మా ప్లాన్‌ వాళ్లకి తెలిసిపోయింది. బోటు దగ్గర కొందరు ఉండి హెలికాప్టర్‌ను మరికొందరు వెంబడించడం మొదలుపెట్టారు. బాణాలు మరింత వేగంగా మా హెలికాప్టర్‌పై పైకి సంధించారు. దీంతో మరో అవకాశం లేక మా సిబ్బందిని కాపాడడం ప్రధాన కర్తవ్యంగా భావించి వెను దిరిగాను. సెంటినెలీస్‌ తెగ వారు చేసిన పొరపాటు మళ్లీ చేయరు. మా ప్లాన్‌ను అర్థంచేసుకుని తిప్పి కొడతారని, రెండు గ్రూపులుగా విడిపోయి కొందరు పడవ దగ్గర ఉంటారని ఊహించలేదు’ అని ప్రవీణ్‌ తన అనుభవాలను గుర్తుచేసుకున్నారు.  

అందుకే ఆ ద్వీపం వైపు ఎవరూ వెళ్లరు. ఆధునికులెవరూ సెంటినెలీన్‌ తెగ కంటిలో పడరు. ఎందుకంటే…ఆధునీకుల వల్ల తమ ఉనికికే ప్రమాదమని వారు భావిస్తారు. మనలాగా రోగ నిరోధక శక్తి వారికి లేదు. ఆధునిక మనుషుల్లో ఎన్నో వైరస్‌లున్నాయి. జలుబు కలిగించే వైరస్‌ సోకినా తట్టుకోలేక ప్రాణాలు కోల్పోయే ప్రమాదం ఉంది. అందుకే ఆధునీకులను దగ్గరికి రానివ్వరు. కంటబడితే బాణాలతో వెంటాడి మరీ చంపుతారు. అక్కడే ఇసుక దిబ్బల్లో పూడ్చేస్తారు. జాన్‌ మృతదేహాన్ని కూడా అలాగే పూడ్చేసివుంటారని భావిస్తున్నారు.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*