ఆ పత్రికలకు ఆసక్తి లేదనుకుందాం…మరి ‘సాక్షి’కి ఏమయింది?

ఎవరు అవునన్నా కాదన్నా తెలుగు మీడియా పార్టీల పరంగా స్పష్టంగా విభజించబడి ఉన్నాయనడంలో సందేహం లేదు. ఏ వార్తనైనా ఆయా పత్రికలు, టీవి ఛానళ్లు తాము సమర్థిస్తున్న పార్టీ ప్రయోజనాలకు అనుగుణంగా ప్రచురిస్తున్నాయి. అందులో ప్రజా ప్రయోజనాలు, సమాజహితం అనే గీటురాళ్లతో సంబంధం లేకుండా ఎవరి రాజకీయ అవసరాల మేరకు వారు సమర్థిస్తున్నారు లేదా వ్యతిరేకిస్తున్నారు. ప్రస్తుతం పిడి (పర్సనల్‌ డిపాజిట్స్‌) అకౌంట్ల పేరుతో ఆంధ్రప్రదేశ్‌లో జరుగుతున్న వివాదం మీద కూడా తెలుగు మీడియా ఇదే ధోరణిలో స్పందిస్తోంది.

దేశంలోని ఏ రాష్ట్రంలోనూ లేని విధంగా ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం 58,000 పిడి అకౌంట్లను తెరిచింది. ఇందులో రూ.53 వేల కోట్లు సమ చేసింది. దీనికి సంబంధించిన వివరాలు ప్రభుత్వం సరిగా ఇవ్వలేదనేది కాగ్‌ ఆరోపణ. దీన్ని బిజెపి ఎంపి నరసింహారావు బయటపెట్టారు. ఇది 2జి కుంభకోణం కంటే పెద్దదని ఆరోపించారు. మొదటి రోజు నరసింహారావు చేసిన ఆరోపణల వార్తను సాక్షి దినపత్రిలో పతాక శీర్షికలో ప్రచురిస్తే….ఈనాడు అస్సలు దానికి ప్రాధాన్యతే ఇవ్వలేదు. ఇక రెండో రోజు నరసింహారావు ఆరోపణలకు టిడిపి తరపున కుటుంబరావు వివరణ ఇస్తే…ఈ వివరణను ఈనాడు మొదటి పేజీలో ప్రచురించింది. ఆరోపణలు చేస్తున్న నరసింహారావుది అజ్ఞానం అంటూ కుటుంబరావు నోటిమాటతో కొట్టిపారేశారు. అసాధారణంగా అన్ని ఖాతాలు ఎందుకు తెరవాల్సి వచ్చిందో మాత్రం ఆయన వివరణ ఇవ్వలేదు.

సాధారణంగా రాజకీయా పార్టీలు ఒకరిపై ఒకరు దుమ్మెత్తిపోసుకుంటాయి. ఇందుకోసం ఏ అవకాశాన్నీ అవి జారవిడుచుకోవు. పిడి అకౌంట్ల విషయంలో మీడియా చేయాల్సింది ఏమిటి? నాయకులు చేసుకుంటున్న ఆరోపణలు, ప్రత్యారోపణలను ప్రచురించడం, ప్రచురించకుండా వదిలేయడం వరకే మీడియా పరిమితం అవుతుందా? ప్రధాన పత్రికలు అన్నింటికీ రాష్ట్రంలో మండల స్థాయి దాకా విలేకరులున్నారు. తమ నెట్‌వర్క్‌ ద్వారా ఈ పిడి అకౌంట్ల లోతుపాతులు తేల్చలేరా? ఏ అకౌంట్‌ నుంచి ఎంత డబ్బులు డ్రా చేశారు, ఎవరి పేరుతో డ్రా చేశారు, ఎందుకోసం డ్రా చేశారు అనే వివరాలను రాబట్టలేరా? మన పత్రికల నెట్‌వర్క్‌ అంత బలహీనంగా ఉందా?

అధికార పార్టీని సమర్థించాలనుకునే పత్రికలకు ఇటువంటి పరిశోధన చేసే ఆలోచన, ఆసక్తి లేకపోవచ్చు. మరి నరసింహారావు ఆరోపణలను పతాక శీర్షికలో ప్రచురించి సాక్షి పత్రికైనా ఆ పని చేయాల్సిన పనిలేదా? సాక్షి ధోరణి గురించి గతంలోనూ ఇటువంటి కథనాన్నే ధర్మచక్రం ప్రచురించాల్సివచ్చింది. ఎన్‌టిఆర్‌ ఇళ్లతో భారీ అవినీతి జరిగిందని వైసిపి నాయకులు ఆరోపిస్తున్నా…దాన్ని క్షేత్రస్థాయిలో ఆధారాలతో సహా రుజువు చేయగల అవకాశం ఉన్న సాక్షి…ఆ పని చేయడంలో విఫలమయింది. వైసిపి నాయల ఆరోపణలను ప్రచురిస్తే సరిపోతుందనే పద్ధతిలో వ్యవహరించింది. పిడి అకౌంట్ల విషయంలోనూ అదే చేస్తుందా? లేక తీగలాగి డొంక కదిలిస్తుందా? చూద్దాం!

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*