ఆ బోడిగుండు సహా ఎవరూ ‘బంగారం’ కాదు…!

ఇటీవల ఏ పేపర్‌ చూసినా, ఏ టివి పెట్టినా….ఒక బోడిగుండు పెద్ద మనిషి కనిపిస్తుంటారు. డబ్బులు ఊరికే రావు అంటూ ఊదరగొడుతుంటారు. ఆయనగారి దుకాణం సహా….రాష్ట్రంలో పేరుగాంచిన బంగారు దుకాణాలలో ఏదీ 24 క్యారెట్ల బంగారం కాదని తేలిపోయింది. అన్నీ వినియోజదారులను మోసం చేస్తున్నవే అని స్పష్టమయింది. కోట్లాది రూపాయలు ప్రకటనలు తీసుకునే మన పత్రికలు…ఆ విషయాలను మరుగుపరిచాయిగానీ…. వాస్తవంగానైతే పెద్ద సంచలన వార్త అయ్యేది. పత్రికల్లో బ్యానర్‌ వార్తగా వేయాల్సింది. ఇంతకీ సంగతేమిటంటే….

గడచిన రెండు రోజుల్లో తూనికలు-కొలతల శాఖ అధికారులు విజయవాడ, విశాఖ, తిరుపతి, గుంటూరు, కాకినాడ, విజయనగరం, శ్రీకాకుళం, కడప, కర్నూలు, భీమవరం…ఇలా రాష్ట్రంలోని ప్రధాన పట్టణాలు, నగరాల్లో ఉన్న ప్రముఖ బంగారు దుకాణాలన్నింటినీ తనిఖీ చేశారు. ఈ సందర్భంగా 31 కేసులు నమోదు చేశారట. ఒక దుకాణానికి రూ.50 వేల జరిమానా కూడా విధించారట. అయితే….ఏయే దుకాణాలపైన కేసులు నమోదు చేసిందీ స్పష్టంగా చెప్పలేదు. ఏ దుకాణానికీ జరిమానా విధించినదీ చెప్పలేదు. ఈ విషయాలన్నీ దాచిపెట్టారు.

ఏకంగా 31 కేసులు నమోదయ్యాయ్యంటే….చాలా దుకాణాల్లోనే తూనికల్లో మోసం జరుగుతున్నట్లు అర్థమవుతోంది. బంగారాన్ని 1 ఎంపి కాటాతోనే తూకం వేయాలని, రాళ్లను వేరుగా తూకం వేసి విలువకట్టాలని తూనికలు-కొలతల శాఖ అధికారులు చెబుతున్నారు. ఈ సూచనలు చెప్పుడే చెప్పేవేగానీ….ఈ తనిఖీల్లో ఏ దుకాణం ఎలాంటి తప్పు చేస్తూ పట్టుబడింతే మీడియాకు వివరంగా వెల్లడిస్తే బాగుండేది. ఏ దుకాణం బండారం ఏమిటో తేలిపోయేది. అలాకాకుండా ఇటువంటి సూక్తుల వల్ల ప్రయోజనం ఉండుదు.

రోడ్డుపైన బండ్లు పెట్టుకుని పండ్లు కూరగాయలు అమ్ముకునే వారు గ్రాముల్లో మోసం చేస్తే వినియోగదారుడు రూపాయో అర్థరూపాయలో మోసపోవచ్చు. కానీ బంగారు దుకాణాల్లో అలాకాదు. మిల్లీ గ్రాముల్లో మోసం చేసినా….వినియోగదారులు రోజులో, నెలలో భారీగానే (కోట్ల రూపాయల్లో) మోసపోతారు. బంగారు దుకాణాల్లో మోసాలు ఈనాటివి కావు. ఎప్పటి నుండో కొనసాగుతున్నాయి. అయితే…ఎప్పుడే ఏడాదికో రెండేళ్లకో ఒకసారి ఇటువంటి తనిఖీలు చేసి చేతులు దులుపుకోవడం గట్టి చర్యలు కనిపించడం లేదు. గట్టి చర్యలు ఉండివుంటే….పరిమితమైన దుకాణాల్లోనే 31 కేసుల నమోదుకు ఆస్కారం ఉండేదా?! ఏమైనా బంగారు కొనేటప్పుడు వినియోగదారులూ జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం కనిపిస్తోంది.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*