ఇంకో ఎర్ర సినిమా తీస్తా…20 ఏళ్ల క్రితం ఆగిపోయిన సినిమా రీలీజ్‌ చేస్తా : మాదాల రంగారావు

అభ్యదయ, విప్లవ చిత్రాల దర్శకుడు, కథా నాయకుడు మాదాల రంగారావు కన్నుమూశారన్న వార్తతో ఎరుపు వర్ణ విహీనమయింది. బిగిసిన పిడికిలి సడలింది. ఎర్రమల్లెలు వాడిపోయాయి. చిత్ర పరిశ్రమలో విప్లవ శంఖ పూరించిన మాదాల రంగారావు ఇటీవల తిరుపతిలో నెల రోజులకుపైగా ఉన్నారు. బర్డ్స్‌ ఆస్పత్రిలో చికిత్స చేయించుకున్నారు. ఈ సందర్భంగా ధర్మచక్రంతో ముచ్చటించారు. సమ సమాజ స్థాపనకు సాయుధ పోరాటమే మార్గమని చెబుతూ మాదాల రంగారావు 20 ఏళ్ల క్రితం తీసిన ఎర్రపావురాలు సినిమా విడుదలకు నోచుకోలేదు. సెన్సార్‌ బోర్డు వద్దే ఆగిపోయింది. ఆ సినిమాను విడుదల చేయడానికి పోరాటం కొనసాగిస్తానని మాదాల చెప్పారు. అదేవిధంగా తాను కోలుకున్న వెంటనే మరో ఎర్ర సినిమా తీయాలని ఉందని కూడా తెలిపారు. నేటి పరిస్థితులకు అనుగుణంగా, వామపక్ష భావజాలంతో ఆ సినిమా ఉంటుందన్నారు. అయితే ఈ రెండు లక్ష్యాలు నెరవేరకుండానే ఆయన పిడికిళ్లు శాశ్వతంగా బిగుసుకున్నాయి.

‘నన్ను కమ్యూనిస్టులు ఉమ్మడి ఆస్తిగా భావిస్తారు. విద్యార్థి దశ నుండి వామపక్ష రాజకీయాలతో పెనవేసుకున్న బంధం నేటికీ కొనసాగుతోంది. 1981లో ఖమ్మం, విజయవాడలో హత్యారాజకీయాలకు వ్యతిరేకంగా ఉద్యమాలు జరిగాయి. వాటిలో నేనూ పాల్గొన్నాను. స్థానిక సంస్థల ఎన్నికల్లో వామపక్షాల గెలుపు కోసం కృషి చేశాను. నక్సలైట్‌ నాయకులు నాగభూషణ్‌ పట్నాయక్‌ విడుదల కోసం జరిగిన ఉద్యమంలో పాలుపంచుకున్నాను. తిరుమలలో హాకర్ల సమస్యలపై జరిగిన ఉద్యమంలోనూ పాల్గొన్నాను. వామపక్షాల ఐక్యత కోసం, నక్సలైట్లను జనజీవన స్రవంతిలోకి తీసుకురావడానికి నా పద్ధతుల్లో నేను ప్రయత్నిస్తున్నాను.’ అని వివరించారు.

మాదాల రంగారావు పేరు నేటి యువతరానికి పెద్దగా తెలియకపోవచ్చుగానీ…కనీసం 45 ఏళ్ల వయసున్న ఎవరికైనా మాదాల పేరు చెప్పగానే కళ్లముందు ఎర్రజెండా రెపరెపలాడుతుంది. ముందుడు వేసి, రొమ్ము విరిచి, పిడికిలి బిగించిన రూపం రూపుదాల్చుతుంది. ఆయన పేరు వినగానే విప్లవం అనే పదం నోట పలుకుతుంది. మాదాల పేరు చెప్పగానే ఎర్రమల్లెలు, విప్లవ శంఖం, యువతరం కదిలింది, ఎర్రమట్టి, ప్రజాశక్తి తదితర సినిమాలు, వాటిలోని దృశ్యాలు, విప్లవ గీతాలు కళ్లముందు మెదులుతాయి. మాదాల రంగారావు వెండితెరపై ఎరుపు మెరుపులతో, ప్రేక్షక జనాన్ని ఉరకలెత్తించిన కథానాయకుడు.

ప్రజలను చైతన్యం వైపు నడిపించే ఆయన సినిమాలు సహజంగానే పాలకుల ఆగ్రహానికి గురయ్యాయి. వాటిని సెన్సార్‌ గడప దాటించడానికి పోరాటమే సాగించాల్సివచ్చేది. ఎర్రమట్టి సినిమా బయటకు రావడానికి ఐదేళ్లు పట్టింది. మావోయిసఉట నాయకుడు కొండపల్లి సీతారామయ్యతో కలిసి చేసిన ఎర్రపావురాలు అనే సినిమా నేటికీ విడుదలకు నోచుకోలేదంటే మాదాల చిత్రాలు ఎంత నిర్బంధాన్ని ఎదుర్కొన్నాయో అర్థం చేసుకోవచ్చు. విప్లవశంఖం విడుదల కాకుండా కేంద్ర సెన్సార్‌ బోర్డు అడ్డువేస్తే…దాని విడుదల కోసం నాటి కమ్యూనిస్టు ఎంపిలు ఇంద్రజిత్‌ గుప్త (సిపిఐ), సమర్‌ ముఖర్జీ (సిపిఎం) పార్లమెంటు లోపల పోరాడారు. మరోవైపు బయట అనేక మంది వామపక్షవాదులు నిరాహార దీక్షలు చేశారు. అప్పుడుగానీ సినిమాకు విముక్తి లభించలేదు. మాదాల రంగారావు అగ్రనటుడు ఎన్‌టిఆర్‌తో కలిసి ‘తీర్పు’ అనే చిత్రంలో నటించారు. అందులో మాదాల పాత్రకు ప్రశంసలు, అవార్డులు లభించాయి. మాదాల చిత్రాల్లోని విప్లవ గీతాలు ప్రేక్షకులను ఉర్రూతలూగిస్తాయి. ఆయన చిత్రాలకు అగ్రనటులతో సమానమైన ఆదరణ లభించేది. శతదినోత్సవాలు జరుపుకున్న చిత్రాలూ ఉన్నాయి. ఎన్‌టిఆర్‌ గజదొంగ, ఎర్రమల్లెలు ఒకేసారి విడుదలైతే…గజదొంగ కంటే మాదాల చిత్రమే ఎక్కువ రోజులు ఆడిందట. తిరుపతి జయశ్యామ్‌ థియేటర్‌లో ఎర్రమల్లెలు 100 రోజులు ఆడింది. ఈ చిత్రాలన్నీ ఆయన తన సొంతంగా ఏర్పాటు చేసుకున్న ‘నవతరం’ బ్యానర్‌పైన నిర్మించినవే.
మాదాల మృతికి ధర్మచక్రం నివాళులర్పిస్తోంది. భారత దేశంలో ఎర్ర సూరీడు ఉదయించాలన్న ఆయన ఆశయం సాకారం కావాలని ఆకాంక్షిస్తోంది.

Leave a Reply

Your email address will not be published.


*