ఇంగ్లీషు మీడియంతో…నిజంగానే తెలుగు చచ్చిపోతుందా..!

ఆదిమూలం శేఖర్‌, సంపాదకులు, ధర్మచక్రం

వచ్చే విద్యా సంవత్సరం నుండి అన్ని ప్రభుత్వ పాఠశాలలనూ ఇంగ్లీషు మీడియం స్కూళ్లుగా మార్పు చేయాలని ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై రాష్ట్ర వ్యాపితంగా చర్చోపచర్చలు సాగుతున్నాయి. ఇది మంచి నిర్ణయమని కొందరు స్వాగతిస్తుంటే, దీనివల్ల తెలుగు భాష చచ్చిపోతుందని కొందరు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. రాజకీయ కారణాలతో వ్యతిరేకించేవారు కొందరైతే….విధానపరంగా అభ్యంతరం వ్య్తం చేస్తున్నవారు కొందరు.

నేను ఒకటో తరగతి నుండి డిగ్రీ దాకా తెలుగు మీడియంలోనే చదువుకున్నాను. ఐదో తరగతిలో ఏ, బి, సి, డి..లు నేర్పించారు. నాలుగు వాక్యాలు ఇంగ్లీషులో తప్పులు లేకుండా మాట్లాడలేను, రాయలేను. ఇలా చెప్పుకోడానికి నాకేం సిగ్గుగా లేదు. ఒకటో తరగతి నుంచి ఇంగ్లీషు నేర్పించివుంటే….ఆంగ్లం కూడా తెలుగులా రాయగలిగేవాడినేమో. పాత్రికేయ వృత్తిలో ఉన్న నాకు ఇంగ్లీషు ప్రాధాన్యత ఏమిటో తరచూ అవగతం అవుతూనే ఉంటుంది.

ఏదైనా సమాచారం కావాల్సివచ్చి ఇంటర్నెట్‌లో వెతికితే….ఇంగ్లీషులో బోలెడంత సమాచారం ఉంది. అయినా ఏంలాభం…చదవి అర్థం చేసుకోవాలంటే గంటలు గంటల సమయం పడుతుంది. తిరుపతిలో ఇండియన్‌ సైన్స్‌ కాంగ్రెస్‌ జరిగింది. ఆ సందర్భంగా ఓ నోబెల్‌ బహుమతి విజేత ఒకరు వచ్చారు. ఆయన సెమినార్‌లో ఉపన్యాసం అయ్యాక ప్రశ్న వేయాలనుకుంటే….అడగలేకపోయాను. పక్కనున్న ఇంగ్లీషు విలేకరని అడిగి ప్రశ్న రాసుకుని అడగాల్సివచ్చింది.

అదేవిధంగా ఇంగ్లీషు మాట్లాడటం, చదవడం వచ్చివుంటే…నేను ఢిల్లీ నుండి జాతీయ రాజకీయాలను, పరిణామాలను రిపోర్టు చేయగల సామర్థ్యం నాకుంది. ఇంగ్లీషు రాకపోవడం వల్ల తెలుగు రాష్ట్రాల గడప దాటలేని దుస్థితి. ఇంగ్లీషు రాకపోవడం కచ్చితంగా నా కెరీర్‌క పెద్ద ఆటంకమే.

ఇక చదవుకునే రోజుల్లో పడిన ఇబ్బందులు అన్నీ ఇన్నీకావు…ఇంటర్‌ దాకా మ్యాథ్స్‌లో….ఆల్జీబ్రాను బీజ గణితం అని, జామెట్రీని రేఖా గణితం అని, వెక్టార్‌ను సదిశ అని, రెక్టార్‌ను అదిశ అని, డయామీటర్‌ను వ్యాసం అని…చదువుకున్నాను. డిగ్రీకి వెళ్లాక ఇంగ్లీషులో చెబుతుంటే ముఖం వెల్లబెట్టాను. దాన్ని అర్థం చేసుకోడానికి చాలా ఇబ్బందిపడాల్సివచ్చింది. ఒకటో తరగతి నుంచి ఇంగ్లీషు మీడియంలో చదువుతూ ఇప్పుడు ఇంటర్‌ రెండో సంవత్సరంలో ఉన్న మా అబ్బాయి, ఏడో తరగతిలో ఉన్న మా అమ్మాయికి ఇటువంటి సమస్య లేదు. ఇంగ్లీషులో చదువుకున్నా నాకంటే బాగానే అర్థం చేసుకున్నారనిపిస్తోంది. మాట్లాడటం, రాయడం కూడా నాకంటే మెరుగే. నేను చెప్పదలచుకున్నది ఏమంటే….చిన్నప్పటి నుంచి నేర్పిస్తే ఇంగ్లీషును కూడా తెలుగులాగా నేర్చుకోవడం కష్టమేమీ కాదు.

పదిహేనేళ్ల క్రితం ప్రభుత్వ పాఠశాలల్లోనే ఇంగ్లీషు మీడియం ఉండివుంటే… మా పిల్లలను ప్రైవేట్‌ పాఠశాలకు పంపాల్సిన అవసరం ఉండేది కాదు. ప్రతి సంవత్సరం వేలకు వేల రూపాయలు ఫీజుల రూపంలో ప్రైవేట్‌ పాఠశాలలకు చెల్లించాల్సిన పరిస్థితి దాపురించేది కాదు.

ఇలా చెబుతున్నానంటే నేను తెలుగుకు వ్యతిరేకం కాదు. నాకు ఎంతో ఇష్టమైన సబ్జెక్టు తెలుగు. అయితే…బతకడానికి తెలుగు కంటే ఇంగ్లేషే బాగా అక్కరకొస్తుందనేది ఎవరూ కాదలేనిది. నేనూ అదే నమ్ముతాను. చదువు కేవలం బతకడం కోసమేనా అని ఎవరైనా ప్రశ్నిస్తే….అవును చదువు బతకడానికి కూడా. బతకడానికి ఏది మెరుగైన విద్య అనుకుంటే అది చదువుకోవడంలో తప్పులేదు.

ఒకప్పుడు మన పూర్వీకులకు చదువంటే రామాయణ, మహాభారతాలు, పురాణాలు, ఇతిహాషాలు మాత్రమే. ఇప్పుడు చదువంటే….కంప్యూటర్‌, సైన్స్‌…ఇంకా ఎన్నో. ఈ చదువులతో పోల్చితే తెలుగును, మన సంస్కృతి, సంప్రదాయాలను ఉద్ధరించడానికి మన పూర్వీకుల చదువులే సరైనవి. అందుకని ఆ చదువలనే మన పిల్లలకు ఇప్పుడు నేర్పించగలమా?

తెలుగు అవసరమే….అది ఒక సబ్జెక్టుగా ఉంది. ఎప్పటికీ ఉండాలి. దాని అవసరం ఎంత వరకో అంత వరకు ఉండాలి. అంతేతప్ప….ఒక సెంటిమెంట్‌గానో, ఒక భావోద్వేగంతోనే ఇంగ్లీషు మీడియాన్ని వ్యతిరేకించాల్సిన అవసరం లేదు. ఒకటి మాత్రం వాస్తవం….తెలుగుకు కొన్ని పరిమితులున్నాయి. విశ్వభాష అయిన ఇంగ్లీషుకు ఎన్నో సానుకూలతలున్నాయి. ఇక ఇంగ్లీషు మీడియం లేనంత మాత్రాన తెలుగు భాష చచ్చిపోతుందని, అంతరించిపోతుందని చేస్తున్న వాదన పస లేనిది. మాతృభాష అనేది మనం పీల్చే గాలి వంటిది. అది ఎప్పటికీ సజీవంగానే ఉంటుంది.

ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లీషు మీడియం ప్రవేశపెట్టడాన్ని పేదలు ఆహ్వానిస్తున్నారు. డబ్బున్నోళ్ల పిల్లలు ప్రైవేట్‌ స్కూళ్లలో ఇంగ్లీషు చదువులు చదువుతుంటే తమ పిల్లలు ప్రభుత్వ బడుల్లో తెలుగు మీడియానికి పరిమితం కావాల్సి వస్తోందన్న ఆవేదన వారిలో ఉంది. దీనివల్ల భవిష్యత్తులో పోటీ పరీక్షల్లో వెనుకపడుతారన్న భయమూ ఉంది. అందుకే ఇంగ్లీషు మీడియాన్ని ఆహ్వానిస్తున్నారు.

తెలుగు సెంటిమెంటు పేరుతో ఇంగ్లీషు మీడియాన్ని వ్యతిరేకిస్తున్నవారిలో ఎంతమంది తమ పిల్లలను తెలుగు మీడియంలో చదవిస్తున్నారో చెప్పాలని ప్రశ్నిస్తున్నారు. ఈ ప్రశ్న ఎంతో సమంజసమైనది. నిజంగా తెలుగు మీడియంలోనే విద్యార్థులకు భవిష్యత్తు ఉంటుందని నమ్ముతుంటే….తమ పిల్లలను ఎందుకు తెలుగు మీడియంలో చదివించడం లేదన్నది ప్రశ్న. ప్రభుత్వ బడుల్లో ఉపాధ్యాయులుగా ఉన్నవారే 99 శాతానికిపైగా తమ పిల్లలను ప్రైవేట్‌లో ఇంగ్లీషు మీడియం చదివిస్తున్నప్పుడు….తెలుగు మీడియమే గొప్పదని వారు ఎలా సమర్ధించుకోగలరు…! అనేది మరో ప్రశ్న.

ఇంగ్లీషును బలవంతంగా రుద్దుతారా…అని ప్రశ్నిస్తున్నవారూ ఉన్నారు. బలవంతంగా రుద్దడం ఏముంది..? ప్రభుత్వ బడుల్లో చదువుతున్న పిల్లల తల్లిదండ్రులను విచారిస్తే వారు ఏమి కోరుకుంటున్నారో తెలుస్తుంది. అలాకాకుండా తమ పిల్లలను ఎక్కడో ఇంగ్లీషు మీడియం చదివిస్తూ….మిగతా పిల్లలు తెలుగు చదవాలనడం అర్థం లేనిది. అలా వాదించే నైతికత కూడా వారికి ఉండదు. ఇక బలవంతంగా రుద్దడం అనే అంశానికొస్తే….ఒక్కోసారి బలవంతంగా రుద్దాల్సిన అవసరం కూడా ఉంటుంది. కొన్ని దేశాల్లో వ్యాయామ విద్య నిర్బంధం. దీన్ని నియంతృత్వం అనే దేశాలూ ఉన్నాయి. అంత మాత్రాన వ్యాయామ విద్య తప్పు అవుతుందా? అతి అవసరం కాబట్టి నిర్బంధంగా చెప్పినా తప్పులేదు. ఇంగ్లీషుకు సంబంధించి అటువంటి అవసరమే ఉందన్నది నా అభిప్రాయం.

ఇక ఆచరణలో ఉన్న మరికొన్ని అంశాల్లోకి వెళితే….ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లీషు ప్రవేశపెట్టడం వల్ల అవి బతికిబట్టకట్టుతాయి. ప్రభుత్వ ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులు ఎందుకు చేరడం లేదో మనకు తెలియంది కాదు. ఇప్పటి తల్లిదండ్రులు తాము కూలీ చేసుకుంటున్నా….తమ పిల్లలు బాగా చదువుకోవాలని ఆశిస్తున్నారు. ఇంగ్లీషు చదువుకోవాలని కోరుకుంటున్నారు. అందుకే ప్రైవేట్‌ పాఠశాలలకు పంపుతున్నారు. ఇదే ఊర్లోనే ఇంగ్లీషు మీడియం ప్రవేశపెడితే…అక్కడే చేరే అవకాశం ఉంటుంది. దీనివల్ల ప్రభుత్వ పాఠశాలకు బాగుపడతాయి. ప్రైవేట్‌ పాఠశాలలకు గండిపడుతుంది.

చివరిగా చెప్పేదేమంటే….ఒక సబ్జెక్టుగా డిగ్రీ దాకా తెలుగు చదవడం నిర్బంధంగా చేయండి. మంచి టీచర్లను పెట్టండి. తెలుగు బాగా బోధించండి. అది మనం ఆశిస్తున్న ప్రయోజనాలను కచ్చితంగా నెరవేర్చుతుంది. ఇదే సమయంలో మిగతా సబ్జెక్టులను ఇంగ్లీషులో చెప్పాల్సిన అవసరం ఉంది. మొదట్లోనే నేను చెప్పిన అవస్థలు (సైన్స్‌ వంటి సజ్జెక్టుల్లో) తప్పాలంటే ఇంగ్లీషులో బోధించాల్సిన అవసరం కచ్చితంగా ఉంది. ఇందుకు అవసరమైన శిక్షణ టీచర్లకు ఇప్పించండి. అంతేతప్ప….ఇంగ్లీషు మీడియం వల్ల తెలుగుకు ఏదో నష్టం జరిగిపోతుందనే పేరుతో దాన్ని అడ్డుకుని పేద పిల్లల భవిష్యత్తుకు నష్టం చేయకండి.

3 Comments

  1. వాస్తవానికి అక్షర రూపం ఇచ్చారు సార్.
    అయితే ప్రభుత్వ కార్యాలయాలలో
    మాతృభాష అమలును కూడా ఇలాగే రుద్దాలి.
    అప్పుడే తెలుగు అన్యాయం జరగకుండా ఉంటుంది.

Leave a Reply

Your email address will not be published.


*