ఇంతకీ గల్లంతయిన బంగారు నాణేలు ఎన్ని..?

…. 53 నాణేలు మాయమైనట్లు రికార్డుల్లోనే ఉంది….మరి ఒకటే అని అధికారులు చెబుతున్నారు..!

టిటిడి ట్రెజరీ నుంచి వెండి కిరీటం, కొన్ని బంగారు ఆభరణాలు మాయమైన వ్యవహారం పెద్ద దుమారం రేపుతోంది. మూడేళ్ల క్రితం జరిగిన ఈ ఉదంతంలో బంగారు నాణేలపై గందరగోళం కనిపిస్తోంది. మొత్తం 53 నాణేలు కనిపించలేదని తనిఖీల సందర్భంగా రికార్డుల్లో నమోదు చేశారు. అయితే…ఒక నాణమే కనిపించలేదని తాజాగా అధికారులు చెబుతున్నారు.

ట్రెజరీ అక్రమాలకు సంబంధించి బిజెపి నాయకులు భానుప్రకాష్‌ రెడ్డి మీడియా సమావేశం ఏర్పాటు చేసి….టిటిడికి సంబంధించిన ఓ పత్రాన్ని విడుదల చేశారు. ఏఈఓ శ్రీనివాసులు బాధ్యతలు అప్పగించే సమయంలో ఇన్వెంటరీ విభాగం ట్రెజరీలో తనిఖీలు చేసి….కనిపించని వస్తువుల జాబితా, అదేవిధంగా అదనంగా ఉన్న వస్తువుల జాబితాను రూపొందించింది. దీనికి సంబంధించి ఒక సర్టిఫికెట్‌ కూడా జారీ చేశారు. దాన్నే భానుప్రకాష్‌ రెడ్డి మీడియాకు విడుదల చేశారు.

ఈ డాక్యుమెంట్‌ ప్రకారం….53 బంగారు నాణేలు కనిపించలేదు. వాటి బరువు 400 గ్రాముల 700 మిల్లీ గ్రామలు. వీటి విలువ (అప్పటి ధర 2,839 ప్రకారం) రూ.12,51,147గా తేల్చారు. అయితే…మీడియాకు వివరణ ఇచ్చే సందర్భంగా ఈవో సింఘాల్‌ మాట్లాడుతూ ఒక నాణెం మాత్రమే గల్లంతయిందని చెప్పారు. దాని విలువను వేలల్లో చెప్పారు.

ఈ అంశంలో మిగతా ఆభరణాలు, కిరీటం సంగతి ఎలావున్నా….ఎక్కువ విలువైనవి ఈ నాణేలే. టిటిడి రికార్డుల్లోనే 53 బంగారు నాణేలు కనిపించలేదని పేర్కొని, ఇప్పుడు ఒక నాణెం విలువను మాత్రమే సంబంధిత ఉద్యోగి ఖాతాలో చూపించారు. మిగతా నాణేలు ఉన్నట్లా…లేనట్లా అనేది అధికారులు చెప్పలేదు. ఈవో సింఘాల్‌ దీనిపైన స్పష్టత ఇవ్వాల్సిన అవసరం ఉంది.

  • ఆదిమూలం శేఖర్‌, సంపాదకులు, ధర్మచక్రం

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*