ఇంతకీ దాడి కేసులో జగన్‌ బాధితుడా…నిందితుడా..!

విశాఖపట్నం విమానాశ్రయంలో వైసిపి అధినేత జగన్‌పై హత్యాయత్నం జరిగింది. ఆయన భుజానికి గాయమయింది. ఈ ఘటన దేశ వ్యాపితంగా సంచలనంగా మారింది. అయితే…కొందరు అధికారులు, ప్రభుత్వ పెద్దలు మాట్లాడుతున్న తీరు చూస్తుంటే…జగన్‌ బాధితునిగా అనిపించడం లేదు. అతనే దాడికి పాల్పడిన నిందితుడా అని అనిపిస్తోంది.

ముఖ్యమంత్రి చంద్రబాబు మాట్లాడుతూ…’జగన్‌ను విమానం ఎలా ఎక్కనిచ్చారు. విశాఖపట్నం నుంచి ఎలా వెళ్లనిచ్చారు’ అని ప్రశ్నించారు. ఎక్కడైనా నేరం జరిగితే నిందితున్ని వెంటనే అదుపులోకి తీసుకోవడం సహజమే. బాధితులను ఆస్పత్రికి తీసుకెళ్లడమో, ఇంటిపి పంపి విశ్రాంతి ఇవ్వడమో చేస్తారు. జగన్‌ను విశాఖపట్నం నుంచి హైదరాబాద్‌ వెళ్లడానికి విమానం ఎక్కించడం ఎయిర్‌పోర్ట్‌ అథారిటీ అధికారుల తప్పిదంగా చంద్రబాబు చెబుతున్నారు.

దాడిలో గాయపడిన జగన్‌…ప్రభుత్వ ఆస్పత్రిలో చికిత్స చేయించుకోకుండా ప్రైవేట్‌ ఆస్పత్రికి ఎలా వెళుతారు అని ముఖ్యమంత్రితో పాటు టిడిపి నేతలు ప్రశ్నించారు. ఇది విచిత్రమైన ప్రశ్న. ప్రైవేట్‌ ఆస్పత్రిలో చికిత్స చేయించకుంటే నష్టమేమిటి? తిరుపతిలో 2003లో అప్పడు ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబుపై తిరుపతిలో మావోయిస్టుల దాడి జరిగితే వెంటనే స్విమ్స్‌ ఆస్పత్రికి తరలించారు. ఇది టిటిడి ఆధీనంలోని ఆస్పత్రే తప్ప ప్రైవేట్‌ ఆస్పత్రికాదు.

గాయపడిన జగన్‌ మోహన్‌ రెడ్డి ఇక్కడే ఉండి పోలీసు కేసు పెట్టకుండా హైదరాబాద్‌ ఎలా వెళ్లిపోతారు…అని కూడా టిడిపి నేతలు ప్రశ్నిస్తున్నారు. ఇలా చాలా అన్యాయమైన ప్రశ్న. దాడుల్లో గాయపడినవారు, ప్రమాదాల్లో గాయపడినవారు ముందుగా ఆస్పత్రిలో చేరుతారు. పోలీసులు అక్కడికి వచ్చి ఫిర్యాదు రాసుకుంటారు. అంతేతప్ప రక్తమోడుతున్న వ్యక్తి పోలీసులు వచ్చేదాకా ఉండి….కేసు రాసుకున్నాక ఆస్పత్రికి వెళ్లరు. జగన్‌ విషయంలో టిడిపి నేతలు అసంబద్థ వాదన చేస్తున్నారు.

ఇటువంటి విషయాల్లో పోలీసులు సుమోటోగా కేసు నమోదు చేస్తారు. జగన్‌ విషయంలో జరగాల్సిందీ అదే. అంతేతప్ప వాదన కోసం, తప్పుబట్టడం కోసం ఏదో ఒకటి మాట్లాడటం వల్ల ప్రభుత్వ పెద్దలు పలచనవడం తప్ప ప్రయోజనం ఉండదు. జగన్‌ హైదరాబాద్‌కు వెళ్లిపోతే పోలీసులు దర్యాప్తు ఎలా చేయాలి అని కూడా టిడిపి నేతలు ప్రశ్నిస్తున్నారు. జగన్‌ హైదరాబాద్‌లో ఉంటే వెళ్లి విచారించడం కష్టమా? ఎవరైనా అడ్డుకుంటారా?

మొత్తంగా ప్రభుత్వ పెద్దల స్పందనలు చూస్తుంటే…జగన్‌ను బాధితునిగా కాదు…. నిందితునిగా చూపుతున్నారని అనిపించకమానదు.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*