ఇంతకీ రమణ దీక్షితులు వెనుక ఎవరున్నారు?

తిరుమల శ్రీవేంకటేశ్వర స్వామికి కైంకర్యాలు సరిగా జరగడం లేదని, శ్రీవారి పోటులో గుప్త నిధుల కోసం తవ్వకాలు జరిగాయని, స్వామివారి ఆభరణాలకు భద్రత కరువయిందని విమర్శలు చేస్తున్న టిటిడి ప్రధాన అర్చకులు రమణ దీక్షితులు వెనుక ఎవరున్నారు? ఈ మొత్తం కథ వెనుక బిజెపి ఉందని తెలుగుదేశం పార్టీ మొదటి నుంచి ఆరోపిస్తోంది. బిజెపితో తెగదెంపులు చేసుకున్న తరువాత…రాష్ట్ర ప్రభుత్వాన్ని ఇబ్బంది పెట్టడానికి…రమణ దీక్షితులను పావుగా చేసుకుని ఆటాడుతోందని భగ్గుమంటోంది. దీనికి ఉదాహరణగా అమిత్‌షా శ్రీవారి దర్శనానికి వచ్చినపుడు ఆయన్ను కలవడాన్ని చూపుతోంది. అదేవిధంగా గతంలో ఎప్పుడో అమిత్‌షాతో సమావేశమైన ఫొటోలనూ బయటపెట్టింది. అదేవిధంగా వైసిపి, పవన్‌ కల్యాణ్‌ కూడా దీక్షితులు వెనుక ఉన్నారని టిడిపి మండిపడుతోంది. రమణ దీక్షితులు పాత్రధారి అయితే సూత్రధారి బిజెపి అనేది తెలుగుదేశం పార్టీ గట్టిగా విశ్వసిస్తోంది.

ఇదిలావుంటే రెండు రోజుల క్రితం రమణ దీక్షితులు హైదరాబాద్‌ ప్రెస్‌క్లబ్‌లో విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సంందర్భంగా ఆయన వెనుక కనిపించిన బోరగడ్డ అనిల్‌ వ్యక్తిపై పెద్ద చర్చ జరిగింది. తెలుగుదేశం అనుకూల మీడియా…ఆయన గురించి తవ్వితీసింది. ఆయనకు క్రిస్టియన్‌ మిషనరీలతో సంబంధాలున్నాయని, హిందూయేతరుడైన వ్యక్తితో కలిసి రమణ దీక్షితులు కుట్రలు చేస్తున్నారంటూ హడావుడి చేసింది. ఒకవిధంగా క్రిస్టయన్‌ సంస్థలు ఏవో దీక్షితులు వెనుక ఉన్నట్లు ప్రచారం చేశాయి.

ఈ రెండు ప్రచారాలూ ఒకదానితో ఒకటి పొసగనివి. ఒకవైపు హిందూ సంస్థలు, మరోవైపు క్రిష్టియన్‌ సంస్థలు దీక్షితులు వెనుక ఉన్నాయనడంలో తర్కబద్ధంగా లేదు. అనిల్‌ గురించి దీక్షితులు వివరణ ఇచ్చారు. ఇందుకోసం ఆయన ప్రత్యేకంగా ఒక వీడియోను విడుదల చేశారు. అనిల్‌ అనే వ్యక్తి ఎవరో తనకు తెలియదని, ప్రస్తుతం టిటిడిలో జరుగుతున్న పరిణామాలపై ప్రజా ప్రయోజన వ్యాజ్యం వేయాలని, దానికి సహకారం కావాలని తన వద్దకు వచ్చారని, అంతకు మించి అతనెవరో కూడా తనకు తెలియదని వివరణ ఇచ్చారు. అయినా రమణ దీక్షితులు వెనుక ఎవరున్నారనేదానికంటే.. ఆయన లేవనెత్తుతున్న అంశాల్లోని అనుమానాలను నివృత్తి చేస్తే సమస్య పరిష్కారం అయిపోతుంది. అప్పుడు ఎవరున్నా దీక్షితులు చేయగలిగేది ఏమీ ఉండదు.

ఈ వెబ్‌సైట్‌లోని పాత క‌థ‌నాల కోసం క్లిక్ చేయండి….
www.dharmachakram.in

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*