ఇంద్రగంటి ‘సమ్మోహనం’ కాసింతే!

సినీ తారలూ మనుషులే, వాళ్లకూ మనసులుంటాయి, ప్రేమానుబంధాలుంటాయి, సినిమావాళ్లని తక్కువగా చూడొద్దు అనే లైనుపై సున్నిత ప్రేమకథా చిత్రంగా రూపొందిన, ఇంద్రగంటి మోహన్‌కృష్ణ దర్శకత్వం వహించిన ‘సమ్మోహనం’ ప్రేక్షకుల ముందుకు వచ్చింది. గ్రహణం, అష్టాచమ్మా, నానీ జెంటిల్‌మన్‌ వంటి సినామాలతో ఇంద్రగంటికి ఉన్న ప్రత్యేక గుర్తింపు వల్ల సమ్మోహనం సినిమాకు ప్రాధాన్యత ఏర్పడింది.

ఇంద్రగంటి మోహన్‌ కృష్ణ తన సినిమాలకు పెట్టే తెలుగు పేర్లే ప్రేక్షకులను థియాటర్లకు రప్పిస్తుంటాయి. సమ్మోహనం కూడా అటువంటి పేరే. సమ్మోహనం అంటే ఒక విధంగా మైమరచిపోవడం. గాల్లో తేలిపోవడం. హాయిగా అనిపించడం. అయితే…సుధీర్‌బాబు, అతిథిరావు హీరో హీరోయిన్లుగా నటించిన ‘సమ్మోహనం’ పేరుకు తగినంతగా ప్రేక్షకులను సమ్మోహన పరచలేకపోయింది. చిత్రీకరణ, మంచి సంభాషణలు ఉన్నప్పటికీ కథలో బలంలేకపోవడం వల్ల మధ్యమధ్యలో బోరింగ్‌గా అనిపిస్తుంది. దీనివల్ల ప్రేక్షకుడు ఏ దశలోనూ సమ్మోహన స్థితికి వెళ్లలేకపోతాడు.

అతిథిరావు ఈ చిత్రంలో సినీ హారోయిన్‌గా (సమీరాగా) నటించారు. చిత్రకారుడైన సుధీర్‌ బాబుకు సినిమాలపై మంచి అభిప్రాయం ఉండదు. సాహిత్యం మాత్రమే సమాజ హితానికి దోహదపడుతుందని నమ్మే వ్యక్తి. అనుకోకుండా సమీరా సినిమా షూటింగ్‌ హీరో ఇంట్లో జరుగుతుంది. సమీరాకు తెలుగు నేర్పించే క్రమంలో ఆమెతో ప్రేమలో పడుతాడు. ఆమె కూడా అతన్ని ప్రేమిస్తుంది. అయితే ఏవో కారణాల వల్ల తన ప్రేమను వ్యక్తం చేయదు. ఆఖరికి ఈ ఇద్దరి ప్రేమ ఎలా ఫలించింది, ఏ విధంగా ఏకమయ్యారనేది తెరపై చూడాలి.

ఇంత చిన్న కథతో నిర్మించిన చిత్రం ప్రధానంగా కథనంపైనే ఆధారపడి సాగుతుంది. సిమావాళ్లపై జనాల్లో ఉన్న అభిప్రాయాలను, ఇటీవల కాస్టింగ్‌ కౌచ్‌ వివాదం, సినిమాల సమీక్షల్లో వెబ్‌సైట్లు పోషిస్తున్న పాత్రపై సెటైర్లు వంటి అంశాలన్నీ సంభాషణల రూపంలో ప్రస్తావనకు వస్తాయి. ‘సినిమా జీవితం అంతా అబద్ధం. అక్కడ మొత్తం నటనే. అంతా మాయే’ అని పలు సందర్భాల్లో సినిమాల గురించిన డైలాగులు వస్తాయి. ఇదే సమయంలో హీరో తండ్రి సీనియర్‌ నటుడు నరేష్‌కు సినిమాలంటే పిచ్చి. ఆయన సినిమా గొప్పదనాన్ని చెబుతుంటారు. ‘మాకూ సామాన్యుల్లా ఉండాలనిపిస్తుంది. జీవితమంతా నటిస్తూనే ఉండలేం కదా’ అని హీరోయిన్‌ చెప్పే డైలాగ్‌ ఆలోచింపజేస్తుంది. నటనలో ఎవరి పరిధిలోవారు చేశారు. ఎక్కడా తప్పుబట్టలేం. కెమెరా పనితనం, సంగీతం బాగున్నాయి. సినిమాపైన ఇంద్రగంటి ముద్ర కనిపిస్తుందిగానీ…కథ, కథనంలో ఇంకాస్త జాగ్రత్తలు తీసుకునివుంటే ప్రేక్షకులను పమ్మోహన పరచలేకున్నా….మంచి సినిమాగా రూపుదిద్దుకునేది.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*