ఇక్కడి నుంచి నవ్వుతూ వెళ్లి…ఆస్పత్రిలో విషాదంగా పడుకున్నారు : జగన్‌పై బాబు వ్యంగ్య వ్యాఖ్యలు

వైసిపి అధినేత, ఆంధ్రప్రదేశ్‌ ప్రధాన ప్రతిపక్ష నేత వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డిపై విశాఖపట్నం విమానాశ్రయంలో జరిగిన దాడిపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్పందించారు. గురువారం రాత్రి 9.30 గంటలకు మీడియా సమావేశం నిర్వహించి ఈ అంశంపై మాట్లాడారు. ఆయన ప్రెస్‌మీట్‌లో ఆద్యంతం జగన్‌పై వ్యంగ్యోక్తులు విసురుతూ…చిరునవ్వులు చిందిస్తూ మాట్లాడటం గమనార్హం.

జగన్‌ మోహన్‌ రెడ్డి ఎయిర్‌ పోర్టు నుంచి నవ్వుతూ ఇంటికి వెళ్లారు. నువ్వు ఆస్పత్రికి వెళ్లకుండా ఇంటికెందుకు వెళ్లావు…ముందుగా ఆస్పత్రిలో చేరు. మిగతా విషయాలు మేము చూసుకుంటాం…అని ఢిల్లీ పెద్దలు చెప్పిన తరువాత ఆస్పత్రికి వెళ్లారు. అక్కడ విషాదంగా పడుకున్నారు…అని చంద్రబాబు చిరునవ్వులతో వ్యాఖ్యానించారు. ఆ ఫోటోలు ( జగన్‌ మోహన్‌ రెడ్డి ఆస్పత్రిలో ఉన్న ఫొటోలు) మీరు చూడలేదా అంటూ విలేకరులనూ ప్రశ్నించారు.

దాడి ఘటనపై కేంద్ర ప్రభుత్వ సంస్థలతో విచారణ జరిపించాలని వైసిపి నాయకులు డిమాండ్‌ చేస్తున్న విషయాన్ని విలేకరులు ముఖ్యమంత్రికి దృష్టికి తీసుకెళ్లగా…’విచారణ జరిపించుకోమను. అందుకు నా ఫర్మిషన్‌ కావాలా? కేంద్ర ప్రభుత్వ ఆధీనంలోని విమానాశ్రయంలో ఘటన జరిగింది. మోడీ ఆయనకు కావాల్సినవారు. విచారణ జరిపించుకోమను. మా కార్యకర్త నన్ను పొడిచాడు అని చెప్పుకోమనండి…అంటూ మరోసారి వ్యంగ్య వ్యాఖ్యలు చేశారు.

అయింట్‌మెంట్‌ రాస్తే గాయం మానిపోతుందని విమానాశ్రయంలో చూసిన డాక్టర్‌ రిపోర్టు ఇచ్చారని, అటువంటి దానికి ఆస్పత్రిలో చేరి రగడ చేస్తున్నారంటూ జగన్‌పై రుసరుసలాడారు. ప్రభుత్వ ఆస్పత్రికి వెళ్లకుండా ప్రైవేట్‌ ఆస్పత్రిలో చేరి నాటకాలాడుతున్నారని చంద్రబాబు విమర్శించారు. తన గాయాన్ని చూపి జగన్‌ కోర్టు హాజరు నుంచి మినహామింపు తీసుకుని, ఇష్టానుసారం తిరుగుతారని కూడా ఆయన ఆరోపించారు.

ముఖ్యమంత్రి ప్రెస్‌మీట్‌లో ఆయన హావభావాలను గమనిస్తే…ఈ అంశంలో ప్రభుత్వం చాలా తెలివిగా వ్యవహరించిందన్న భావన ఆయనలో కనిపించింది.

 

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*