ఇటు గదుల కొరత…అటు వందల గదులు ఖాళీ..!

  • మాధవం, శ్రీనివాసంలో రోజూ 200 గదులు ఖాళీ
  • ఆన్‌లైన్‌లో రిజర్వు చేసుకున్నవారు రావడం లేదు
  • టిటిడికి డబ్బులు వస్తున్నా యాత్రీకులకు కోణంలో నష్టమే

తిరుమల శ్రీవారి దర్శనానికి వచ్చే భక్తులు ఒకపూట బస చేయడనికి గదులు దొరక్క నానా అగచాట్లు పడుతుంటారు. అందుకే టిటిడి తిరుమల, తిరుపతిలో వేలాది గదులు నిర్మించింది. ఇంకా నిర్మించడానికి ప్రణాళికలు సిద్ధంచేసింది. గదులు నిర్మించడం కాదు….ఇప్పటికే నిర్మించిన వాటిని పూర్తిస్థాయిలో వినియోగించుకోవడమూ అవసరమే. అయితే…తిరుపతిలోని మాధవం, శ్రీనివాసం కాంప్లెక్స్‌లలో రోజూ 200 దాకా గదులు ఖాళీగా ఉంటున్నాయి.

తిరుపతి ఆర్‌టిసి బస్టాండుకు ఎదురుగా ఉన్న శ్రీనివాసం, మాధవం కాంప్లెక్స్‌లలో 600 గదులకుపైగా ఉన్నాయి. ఈ మొత్తం గదులను ఆన్‌లైన్‌ రిజర్వేషన్‌ కోసం కేటాయించారు. ఇక్కడ కరెంట్‌ బుకింగ్‌ పూర్తిగా రద్దు చేశారు. భక్తులు 90 రోజులు ముందుగా ఆన్‌లైన్‌లో ఈ గదులను బుక్‌ చేసుకోవచ్చు.

ఆన్‌లైన్‌లో గదులు రిజర్వు చేసుకున్న భక్తుల్లో చాలామంది వివిధ కారణాల వల్ల దర్శనానికి రావడం లేదు. దర్శనానికి రానివారు కొందరు గదుల బుకింగ్‌ రద్దు చేసుకుంటున్నా….చాలామంది వదిలేస్తున్నారు. పోతేపోయేది రూ.200లో, రూ.400లో మాత్రమే అని గదిని క్యాన్సిల్‌ చేసుకోవడం లేదు. ఫలితంగా రోజూ 200 గదులు దాకా ఖాళీగా ఉండిపోతున్నాయి. ధర్మచక్రం పరిశీలనలో ఒకరోజు మాధవంలో 63 గదులు, మాధవంలో 120 గదులు ఖాళీగా ఉండిపోయాయి. అదేవిధంగా ఇంకోరోజు మాధవంలో 60, శ్రీనివాసంలో 120 గదులు ఖాళీగా ఉన్నాయి. ప్రతిరోజూ ఈ విధంగా దాదాపు 200 గదులు ఖాళీగా ఉంటున్నాయని అక్కడ పనిచేసే సిబ్బంది చెబుతున్నారు.

సాధారణంగా ఇక్కడ చెక్‌ఇన్‌ చెక్‌ అవుట్‌ సమయం ఉదయం 8 గంటలు. అంటే…ఈ రోజు ఉదయం 8 గంటలకు గదిలో దిగితే…తరువాతి రోజు ఉదయం 8 గంటలకు ఖాళీ చేయాలి. రాత్రి 8 గంటలకు గదికి వచ్చానా ఉదయాని 8 గంటలకు ఖాళీ చేయాల్సిందే. గదులు బుక్‌ చేసుకున్నవారు రాత్రి 8 దాకా కూడా రాకున్నా…వాళ్ల కోసం నిరీక్షించడం తప్ప…ఆ గదులను ఇతరులకు కేటాయించే అవకాశం లేదు. సాధారణంగా భక్తులు ఉదయమే వచ్చేస్తారు…ఆలస్యమైతే మధ్యాహ్నం లోపు చేరుకుంటారు. అప్పటికీ రాకుంటే ఇక రానట్లే…అయినా గదులను ఖాళీగానే ఉంచాల్సివస్తోంది.

ఈ సమస్య పరిష్కారానికి టిటిడి ప్రధానంగా కొన్ని చర్యలు చేపట్టాల్సిన అవసరం కనిపిస్తోంది. గదుల బుకింగ్‌కి డిపాజిట్‌ ఏమీ తీసుకోవడం లేదు. గది అద్దె మాత్రమే వసూలు చేస్తున్నారు. అలాకాకుండా డిపాజిట్‌గా కనీసంగా రూ.500 నిర్ణయించి, అద్దెతో పాటు డిపాజిట్‌ కూడా వసులు చేయాలి. అప్పుడు యాత్ర రద్దు చేసుకున్నవారు…గది బుకింగ్‌ను రద్దు చేసుకునే అవకాశం ఉంటుంది. డిపాజిట్‌ లేకపోవడం వల్లే పోతేపోనీలే అని వదిలేస్తున్నారు. దీనివల్ల టిటిడికి ఆర్థికంగా నష్టంలేనప్పటికీ….భక్తులకు బస కల్పించే అవకాశం చేజేతులా కోల్పోతున్నట్లుగా ఉంది.

ప్రస్తుత నిబంధనల ఒక రోజు ముందుగా గది రద్దు చేసుకునే అవకాశం లేదు. దానికంటే ముందుగా మాత్రమే రద్దు చేసుకోవాలి. అలాకాకుండా ఒక రోజు ముందుగా కూడా గది రద్దు చేసుకునే అవకాశం కల్పించాలి. ఆవిధంగా రద్దయిన గదులను కరెంటు బుకింగ్‌ ద్వారా కేటాయించవచ్చు. విష్ణు నివాసం పూర్తిగా కరెంటు బుకింగ్‌కు కేటాయించారు. అక్కడే మాధవం గదుల బుకింగ్‌కూ అవకాశం కల్పిస్తే….ఆరోజుకు రద్దు చేసుకున్న గదులను కరెంటు బుకింగ్‌ ద్వారా కేటాయించే అవకాశం ఉంటుంది.

టిటిడి ఈవో అనిల్‌ కుమార్‌ సింఘాల్‌, ఇతర ఉన్నతాధికారులు ఈ అంశంపై దృష్టి సారించాలి. సమస్య పరిష్కారానికి ఇంకా ఏవైనా మెరుగైన పద్ధలుంటే ఆలోచించాలి. ఈ 200 గదులు ఖాళీగా లేకుండా చర్యలు తీసుకుంటే కనీసం వెయ్యి మందికి అదనంగా బస కల్పించే అవకాశం ఉంటుంది.

ఆదిమూలం శేఖర్‌, సంపాదకులు, ధర్మచక్రం

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*