ఇదీ మన దేశం!

మనది భిన్నత్వంలో ఏకత్వం ఫరిడవిల్లుతున్న దేశం. ఎన్ని మతాలున్నా అంతా కలసి ప్రేమానుబంధాలతో జీవిస్తున్న అరుదైన సంస్కృతి కలిగిన దేశం. ఒక ముస్లిం యువకుడు వినాయకుని విగ్రహానికి తదేకంగా మెరుగులు దిద్దుతున్న ఓ ఫొటో ఫేస్ బుక్ లో కనిపించింది. మంచి సందేశమూ రాశారు. ఎం.సూర్యం వాల్ పై కనిపించిన ఆ పోస్టు మీకోసం….

—————————————–

నేను ముస్లిం అయితే ఏమిటి?
నువ్వు హిందువైతే ఏమిటి?
నీ గుడిముందు బిచ్చగాళ్ళు హిందువులే అయినా నువ్వు గుండెలకు హత్తుకోవు
మసీదు ముందు ఫకీర్లు ముస్లిములే అయినా నేను హత్తుకోను.

నువ్వు ఎన్ని వ్రతాలు చేసుకున్నా
నేను ఎన్ని రోజా లు పాటించినా
నువ్వు టాక్స్ ఎగ్గోట్టెందుకు ఏ సెక్షన్లు వెతుక్కుంటావో
నేను అవే సెక్షన్లు ఫాలో అవుతాను.

నీ మంత్రాలు సంస్కృతం అయినా
నా సూరాలు అరబ్బి అయినా
మన పిల్లల్ని ఇంగ్లీషు మీడియం మానిపించే ధైర్యం నీకు లేదు
నాకూ లేదు.

నువ్వు గుడికెళ్ళే దారిలో
ఏ గుంతల రోడ్డులో ధక్కా ముక్కీలు తింటూ వెళ్తావో
నేను అదే కంకర తేలిన నాసిరకం రోడ్డులో మసీదు కు వెళ్తాను.

నీ పండగలకు ఏ వెజ్ వంటలు చేసుకోవాలన్నా
నా పండుగులకు ఏ నాన్ వెజ్ వంటలు వండుకోవాలనుకున్నా
కిరాణ కొట్టులో ధరల పట్టికలు ఇద్దరికి భయపెడుతూనే ఉంటాయి.

నువ్వు కళ్ళ మధ్య ఎంత పెద్ద బొట్టు పెట్టుకున్నా కానీ
నేను కళ్ళ లో ఏ సుర్మా పూసుకున్నా కానీ
ఎవరి కళ్ళు కూడా
ఏ కల్తీని గుర్తుపట్టలేక జిందగీలు మోసపోతూనే ఉంటాయి .

నువ్వు నదులలో పుణ్య స్నానం ఆచరించాలన్నా
నేను నదుల ఒడ్డున ఏ మసీదు లో వజూ చేసుకోవాలన్నా
కలుషితమై ఎండిపోతున్న ఈ బురదనీళ్ళే మనకు దిక్కవుతుంటాయి .

నువ్వు ఏ పానకం చేసుకోవాలనుకున్నా
నేను ఏ పాయసం చేసుకోవాలనుకున్నా
ఇద్దరి వి నీళ్ళ క్యాను కొనుక్కునే బతుకులై నిరీక్షిస్తుంటాయ్.

నువ్వు వాస్తు చూసి ఇల్లు కట్టుకున్నా
నేను వాస్తు లేక ఇళ్ళు కట్టుకున్నా
మన ఇంటి ముంగిట డ్రైనేజులు మన సహనాల్ని పరీక్షిస్తూనే ఉంటాయి .

పవిత్ర దేశం అని నువ్వేదో అనుకోవడం
సారే జహాసే అచ్చా అని నేను పాడుకోవడమే కానీ
స్వేచ్చగా ఊపిరి తీసుకోలేక
పోల్యూషన్ కు ఇద్దరం ముక్కులు మూసుకోని తిరుగుతూనే ఉంటాం .

నువ్వే పండుగ నవరాత్రులు చేసుకున్నా
నేను ఏ పండుగ మాసాలు చేసుకున్నా
బ్లాక్ మనీ దొంగల్ని ఏ పాలకులు కూడా పూర్తిగా పట్టుకోలేడు అని ఒప్పుకుంటాము

నీ సంప్రదాయం లో పిల్ల పెళ్ళిచేసినా
నా తరీఖా లో బేటి పెళ్ళి చేసినా
మా లో మంచోడు దొరుకుతాడొ లేదో అనే ఇద్దరం భయపడుతూ వెతుకుతుంటాం.

మనిద్దరికి తెలుసు
వర్షాకాలం వస్తుందంటే కాగితం పడువల ఆనందం పోయి
మన అపార్ట్మెంట్లు ఎప్పుడు మునుగుతాయో ఫికర్
నీకు ఉంది నాకు ఉంది

మనిద్దరికి తెలుసు
నా గజల్ ఖవ్వాలి లాగే
నీ తియ్యని ఆలాపన ఏదో ప్రమాదం లో ఉంది .
మనమిద్దరి గొంతుల్ని ఏదో రాజకీయం కబ్జా చేసేస్తుంది.

మనిద్దరికి తెలుసు
నేను ముస్లిం అయితే ఏమిటి ?
నువ్వు హిందువు అయితే ఏమిటి?
మేం ఇద్దరం ఒప్పుకునే నిజం మాత్రం ఒకటున్నది
నువ్వు అమెరికా పోయినా
నేను ఏ అరబ్ కు వెళ్ళినా
మనమంత భారతీయులం
హిందు ముస్లిం భాయి భాయి.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*