ఇప్పడు టిడిపికి నర’సింహ’న్‌ భయం!

ఇప్పటికే తీవ్రమైన తత్తరపాటులో ఉన్న తెలుగుదేశం పార్టీకి గవర్నర్‌ భయం పట్టుకుంది. గవర్నర్‌ నరసింహన్‌ తెలుగుదేశంకు వ్యతిరేకంగా రాజకీయ పార్టీలను కూడగడుతున్నారని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు బహిరంగంగా వ్యాఖ్యలు చేశారు. రెండు రోజుల క్రితమే ముఖ్యమంత్రితో గవర్నర్‌ భేటీ అయిన సంగతి తెలిసిందే. ఆ భేటీలో ఏమి చర్చించారో అటు ముఖ్యమంత్రిగానీ, ఇటు గవర్నర్‌గానీ మీడియాకు చెప్పలేదు. అయినప్పటికీ….కేంద్రంతో సఖ్యతగా ఉండమని గవర్నర్‌ సూచన చేసినట్లు పత్రికల్లో వార్తలొచ్చాయి. అది హెచ్చరికో, సూచనోగానీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తీవ్రంగానే స్పందించారు. పవన్‌ కల్యాణ్‌, వైసిపి, బిజెపిలకు మధ్య రాయబారిగా గవర్నర్‌ వ్యవహరిస్తున్నారన్న అనుమానం తెలుగుదేశం పార్టీకి ఉంది. అయినా ఇప్పటిదాకా బయటకు ఆ మాట అనలేదు. ఏమనుకున్నారోగానీ….చంద్రబాబు నాయుడే బహిరంగంగా, అదీ ప్రభుత్వ వేదిక నుంచి గవర్నర్‌పై విమర్శలు చేశారు. రాష్ట్ర పరిణామాలను వివరించడానికి గవర్నర్‌ ఢిల్లీకి వెళ్లిన రోజునే బాబు ఈ వ్యాఖ్యలు చేయడం గమనార్హం.

గవర్నర్ల వ్యవస్థను తొలి నుంచి తెలుగుదేశం పార్టీ తీవ్రంగా వ్యతిరేకిస్తోందని ఆ పార్టీ నాయకులు అప్పుడే చర్చలు మొదలుపెట్టారు. ఆది నుంచి గవర్నర్ల వ్యవస్థ దుర్వినియోగం అవుతోంది. కేంద్రంలోని ప్రభుత్వాలు రాష్ట్రాలను ఆడించడం కోసం గవర్నర్లను ఉపయోగించుకుంటున్నాయి. గవర్నర్లను ఉపయోగించుకుని కొన్ని రాష్ట్ర ప్రభుత్వాలను రద్దుచేసిన ఉదంతాలూ ఈ దేశంలో ఉన్నాయి. తెలుగుదేశం పార్టీ కూడా గవర్నర్ల వ్యవస్థను వ్యతిరేకించింది. ఎందుకరటే ఎన్‌టిఆర్‌ను పదవీచ్యుతున్ని చేయడంలో అప్పటి గవర్నర్‌ కీలక పాత్రపోషించారు. ఇటీవల కాలంలో ఎప్పుడూ గవర్నర్ల వ్యవస్థ గురించి చంద్రబాబు మాట్లాడలేదు. తమిళనాడులో తమకు నచ్చిన వ్యక్తులను ముఖ్యమంత్రిని చేయడానికి, శశికళను సిఎం కానీకుండా అడ్డుకోడానికి గవర్నర్‌నే వాడుకున్నారు. గోవా సహా తక్కువ మంది సభ్యులున్న పార్టీలు ప్రభుత్వాలు ఏర్పాటు చేయడంలో (బిజెపికి అనుకూలమైన వారిని) గవర్నర్ల వ్యవస్థే ఉపయోగపడింది. అలాంటి ఏ సందర్భంలోనూ చంద్రబాబు నాయుడు గవర్నర్ల వ్యవస్థ గురించిగానీ, ఆ వ్యవస్థ దుర్వినియోగం గురించికానీ మాట్లాడలేదు. ఇప్పుడు తనకు ఇబ్బంది అయ్యేసరికి గవర్నర్ల వ్యవస్థపై గగ్గోలుపెడుతున్నారు. గవర్నర్‌ నరసింహన్‌ కేంద్రానికి ఎటువంటి నివేదిక ఇస్తారో అనే భయం టిడిపిలో కనిపిస్తోంది. అందుకే నరిసింహన్‌పై బహిరంగ విమర్శలకు దిగింది. ఒకటి రెండు రోజుల్లో ఈ విమర్శలు మరింత తీవ్రమయ్యే అవకాశాలున్నాయి.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*