ఇప్పుడు చెప్పులు తొడగడం కాదు… మోసినా ప్రయోజనం ఉంటుందా?

అంబేద్కర్‌ జయంతి రోజున అంబ్కేర్‌కు నివాళులర్పించిన తరువాత ప్రధాని నరేంద్ర మోడీ కీలక వ్యాఖ్యలు చేయడమే కాదు…ఆసక్తికరమైన ఓ చర్యకూ ఉపక్రమించారు. ‘నేను ప్రధాన మంత్రి పదవిలో కూర్చున్నానంటే…అది అంబ్కేర్‌ పెట్టిన భిక్షే’ అని అన్నారు. అదే సభలో ఓ గిరిజన మహిళకు పంపిణీ చేసిన పాదరక్షలు ధరించడానికి ఆమె ఇబ్బందిపడుతుంటే…నరేంద్రమోడీనే స్వయంగా వొంగి పాదరక్షలు ఆమెకు తొడిగారు. ఈ ఫొటో ఈనాడు దినపత్రికలో ప్రముఖంగా వచ్చింది. ఎందుకో ఈ ఫొటో సామాజిక మాధ్యమాల్లో పెద్దగా కనిపించలేదు. సాధారణంగా మోడీ ఏమి చేసినా…ఆహా ఓహో అంటూ బిజెపి కార్యకర్తలు, సోషల్‌ మీడియా విభాగం హోరెత్తిస్తుంటుంది. ఈ ఫొటో గురించి పెద్దగా పట్టించుకోలేదు. ఆయనకు ఎదురుగాలి వీస్తున్నందున….ఇలాంటివి పెట్టినా ఎవరూ పట్టించుకోరని భావించారో ఏమో…అలా వదిలేశారు. సరే అసలు విషయంలోకి వద్దాం…

దళిత, గిరిజనులకు రక్షా కవచంలాగా ఉన్న అట్రాసిటీ చట్టాన్ని నీరుగార్చేలా వ్యవహరించడమేగాక…ఆవు మాంసం తిన్నారనే పేరుతో దళితులను చంపినా ప్రధాన మంత్రి స్పందించిన దాఖలాలు లేవు. మైనారిటీలతో పాటు దళిత, గిరిజనులనూ బిజెపి సర్కారు దూరం చేసుకుంది. అందుకే ‘దళితులకు మనం ఏమి చేసామో చెప్పండి’ అంటూ బిజెపి ఎంపిలే నిలదీశారు. అదేవిధంగా పసి పాపలపైన సహా మహిళలపై తన పార్టీ నాయకులే అత్యాచారాలకు తెగబడుతున్నా గట్టిగా మాట్లాడలేకున్నారు. బిజెపి కార్యకరతలు అంబేద్కర్‌ విగ్రహాలను కూల్చుతున్నారు. మరోవైపు తన పదవి అంబేద్కర్‌ పెట్టిన భిక్ష అని ప్రధాన మాట్లాడుతారు. ప్రధానిలోని రెండు నాల్కుల ధోరణి బట్టబయలైపోయింది. దళిత, గిరిజనుల కోణంలో చూసినా, మహిళల కోణంలో చూసినా….మోడీ గిరిజన మహిళలకు చెప్పులు తొడిగినంత మాత్రాన వాళ్ల అభిమానం చూరగొనడం ఇక కలే. తిమ్మిన బమ్మిని చేయగలనన్న నమ్మకం మోడీది. అయినా…ఎదురుగాలిలో పెద్దపెద్ద ఓడలైనా తలకిందులవుతాయన్న సంగతి మోడీకి ఇప్పుడిప్పుడే తెలిసొస్తుండాలి.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*